భూమిపై జన్మించిన ప్రతి జీవి ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక విధంగా చనిపోవాల్సిందే. మరణం అనేది పుట్టిన ప్రతి జీవికి ఉంటుంది. అది మనుషులకైనా సరే, ఇతర జీవాలకైనా సరే, పుట్టడం అంటూ జరిగాక గిట్టడం తథ్యం. కాకపోతే ఒకరికి చావు ముందు వస్తుంది, ఒకరికి తరువాత వస్తుంది, అంతే తేడా. అయితే ఇంతకీ విషయం ఏమిటంటే… మీకు గరుడ పురాణం గురించి తెలుసు కదా. దాని ప్రకారం… మరణించిన తరువాత ఏమవుతుందో మనకు తెలుస్తుంది. మనుషులు తాము చేసిన పాపాలను బట్టి నరకంలో వారికి విధించబడే శిక్షల వివరాలు ఉంటాయి. అయితే ఇవే కాదు, గరుడ పురాణంలో ఇంకో విషయం కూడా తెలుస్తుంది. అదేమిటంటే… ఎవరు ఎలా చనిపోతారోనని..! అవును, మీరు విన్నది కరెక్టే. మనుషులు తాము చేసే పనులను బట్టి కర్మ ప్రకారం ఎలా చనిపోతారో కూడా గరుడ పురాణం చెబుతుంది. మరి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందామ్!
ఎలాంటి తప్పులు చేయనివారు, ధర్మం ప్రకారం నడుచుకునే వారు, మానవత్వం కలిగి ఉండేవారు, మంచివారు ఎవరైనా ఎలాంటి బాధ, భయం, నొప్పి లేకుండా హాయిగా చనిపోతారట. వీరికి చాలా మంచి మరణం వస్తుందట. ఇతరులను మోసం చేసే వారు, ఇతరుల సంపదను కొల్లగొట్టేవారు అంత సులభంగా, తేలిగ్గా చనిపోరట. వారు ముందుగా అంటే.. చనిపోయే ముందు అపస్మారక స్థితికి చేరుకుంటారట. ఆ తరువాత చాలా సమయానికి చనిపోతారట. ఆ బాధ అనుభవించి గానీ వారు చావరట.
తోటి మనుషులను, జీవాలను హింసించే వారు చాలా బాధ, నొప్పి అనుభవిస్తూ చనిపోతారట. చనిపోయే ముందు చాలా సేపు వాటిని అనుభవించి గానీ చావరట.మానవత్వం పాటించకుండా మనుషులను, ఇతర జీవాలను నిర్లక్ష్యం చేసేవారు, మనుషులను చంపేవారు వ్యాధులు సోకి మంచాన పడి, బాగా బాధ అనుభవించి చనిపోతారట.
ఇక చివరిగా ఇంకో విషయం ఏమిటంటే… ప్రకృతి విపత్తులు లేదా, ఏవైనా ప్రమాదాలు సంభవించినప్పుడు పెద్ద ఎత్తున జనాలు చనిపోతారు కదా. అలా ఎందుకు జరుగుతుందంటే… పాపాలు చేసిన వారు కర్మ ఫలితంగా ఎక్కువ మంది ఒకే చోట ఉంటే అప్పుడు కర్మ వారిని విడిచి పెట్టదట. దీంతో అలాంటి ప్రమాదాల్లో చాలా మంది ఒకేసారి చనిపోతారట.