Home Unknown facts మీకు పెళ్లి కావట్లేదా… అయితే ఇడగుంజి గణపతిని దర్శించండి!

మీకు పెళ్లి కావట్లేదా… అయితే ఇడగుంజి గణపతిని దర్శించండి!

0

హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యం ప్రారంభించాలన్న వినాయకుడి పూజతో మొదలు పెడతాం. అలా చేయటం ఆనవాయితీగా వస్తుంది. వివాహాది శుభకార్యాల్లో కూడా ఎటువంటి విఘ్నాలు తలెత్తకుండా ముందుగా గణపతి పూజ చేస్తాం. కానీ గణపతి కొలువైన ఇడగుంజి క్షేత్రాన్ని దర్శిస్తే చాలు వివాహాలు జరుగుతాయట. కర్ణాటకలో పర్యాటకంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాల్లో ఉత్తరకన్నడ జిల్లా కూడా ఉంది. శిరిసి,మురుడేశ్వర్‌,యానా తదితర ఎన్నో పర్యాటక,ఆధ్యాత్మిక ప్రాంతాలను కలిగి పర్యాటకంలో కీలకపాత్ర పోషిస్తున్న ఉత్తరకన్నడ జిల్లాలో మరో ప్రముఖ పర్యాటక ప్రాంతం ఇడగుంజి.

idagunji mahaganapatiద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రవేశించే తరుణంలో శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించి భూలోకాన్ని వదిలివెళ్లడానికి నిర్ణయించుకోవడంతో కలియుగంపై ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు. దీంతో కలియుగంలో ఎదురయ్యే సమస్యలు అధిగమించడానికి పరిష్కార మార్గాల కోసం ఋషులు కృష్ణుడి సహాయం కోరుతూ శరావతి నదీ తీరాన దట్టమైన అటవీప్రాంతంలోని కుంజవానా అనే ప్రదేశంలో కఠోర తపస్సులు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో నారద మహర్షి సూచన మేరకు వలాఖిల్య అనే ఋషి పుంగవుడు ఆ ప్రాంతంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి కలియుగ అడ్డంకులను తొలగించాలంటూ ప్రార్థించారు. అప్పుడు ఋషుల ప్రార్థన మేరకు వినాయకుడు కుంజావన వద్ద శరావతి నదీ తీరాన వెలిశాడని ప్రతీతి.

అంతేకాదు త్రిమూర్తులైన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు ఈ స్థలాన్ని సందర్శించి భూమిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న రాక్షసులను సంహరించినట్లు స్థలపురాణం. అనంతరం భవిష్యత్తుల్లో తలెత్తే విఘ్నాలను తొలగించడానికి గణేశుడు ఇక్కడే వెలిశాడట. గణేశుడి కోసం దేవతలు చక్రతీర్థ,బ్రహ్మతీర్థ అనే రెండు పవిత్ర సరస్సులను సృష్టించగా నాదరుడు,ఋషిపుంగవులు దేవతీర్థ అనే చెరువును సృష్టించినట్లు స్థలపురాణం.

పెళ్ళి కాని వారికి కొంగు బంగారం ఈ వినాయకుడు:

ఇడగుంజి వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే వినాయకుడుగా ప్రసిద్ధి. ఇడగుంజి లేదా ఇడన్ గుంజి అనేది హిందువులకు ఎంతో ప్రధానమైన ప్రార్ధనా స్ధలం. ఈ ప్రాంతంలో వినాయకుడు ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయంలో గణపతి ఒక చేతిలో పద్మం మరో చేతిలో లడ్డూతో కనపడతాడు. ఇక్కడికి వచ్చే భక్తులు తాము కోరుకున్నది జరుగుతుందని భావిస్తూంటారు. అందుకే ఏటా సుమారు పది లక్షల మంది భక్తులు ఈ దేవాలయ సందర్శన చేస్తుంటారు. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది.

కొందరు భక్తులైతే ఇడగుంజి వినాయకుడి అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే చేయరు. వివాహం ఆలస్యం అవటం, ఎన్ని ప్రయత్నాలు చేసిన వివాహం జరగకపోవటం.. ఇలాంటి ఇబ్బందులు పడేవారు ఇడగుంజి వినాయకుడిని దర్శించిన మాత్రాన్నే త్వరలో వివాహం జరుగుతుందట. దేశ నలుమూలల నుండి వివాహం కానీ వారు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు.

మనదేశంలో గణపతి స్వయంగా వెలసిన ఆలయాలలో ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని ఆలయం ప్రముఖమైనది. ఈ గ్రామం ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఉంది. శరావతి నది ఇడగుంజికి అతి సమీపంలో ఉన్న హోన్నవర్‌ వద్దనే అరేబియా సముద్రంలో కలుస్తుంది.

Exit mobile version