Home Unknown facts జగన్మోహినీ కేశవస్వామి ఆలయ రహస్యం ఏంటో తెలుసా ?

జగన్మోహినీ కేశవస్వామి ఆలయ రహస్యం ఏంటో తెలుసా ?

0

దేవ, దానవులు క్షీరసాగరం మథిస్తూంటే, అమృతం పుట్టింది. ఆ అమృతాన్ని ఎలా పంచుకోవాలా.. అన్న విషయంమీద దేవ, దానవులు ఘర్షణకు దిగారు. అప్పుడు శ్రీమహావిష్ణువు జగన్మోహినీ రూపం దాల్చి వారిరువురి మధ్యకు వయ్యారంగా వచ్చి నిలబడ్డాడు. మనసును మెలిబెట్టి, మరులను రగిలించే, మన్మథశరంలాంటి ఆ సుందరాంగి వొంపు సొంపుల తళతళలకు దానవులు తబ్బిబ్భై పోయారు.

Jaganmohini Keshavswamy Templeకనురెప్పలు కూడా వేయడం మరచి, గుటకలువేస్తూ నిలబడిపోయారు. జగన్మోహిని తన సౌందర్యంతో దానవుల కళ్లకు విందులు చేస్తూ అమృతాన్ని దేవతలకు పంచిపెట్టి మాయమైంది.ఈ విషయాన్ని కలహ భోజనుడైన నారదుడు పరమశివుని చెవిలో ఊదాడు. అప్పుడు పరమశివుడు మనోనిగ్రహం లేని మీవంటివారు విష్ణుమాయా విలాసానికి లోనౌతారుగానీ నావంటి విరాగిని ఎలాంటి సౌందర్యము వంచించలేదు అన్నాడు.

అంతటితో ఆగక పరమశివుడు విష్ణువును కలిసి నీ జగన్మోహన రూపాన్ని చూపించు అని అడిగాడు. పరమేశ్వరుడు అడిగితే పరంథాముడు కాదనగలడా. మరల జగన్మోహిని రూపం దాల్చాడు. విశ్వాన్ని సైతం వివశతకు గురిచేసే ఆ అసాధారణ సౌందర్య ప్రభలు చూసి విరాగి, శ్మశాన సంచారి అయిన పరమశివుడు శృంగార రసావేశానికి లోనై తనను తానే మరచి ఆ జగన్మోహినినీ ఆనుసరించాడు.(తెలియనితనం తో చాలామంది శివుడు వెంట బడ్డాడు అని అంటారు. కానీ కాదు ,మహిషి ఘోర తపస్సు చేసి తనను చంపగలిగేవాడు హరిహారాదులకు పుట్టినవాడు కావాలని కోరుకుంది. అందుకు అక్కడ అయ్యప్ప జననం జరగాలి,విష్ణువు ,అమ్మవారికి సోదరుడు కనుక పార్వతి అంశ తనలో ఉండబట్టే పార్వతి దేవిలా శివునికి భార్యలా ప్రవర్తించగలిగాడు విష్ణువు)

జగన్మోహిని శివుని చేతికి చిక్కక..చిరునవ్వుల జల్లులు చిలకరిస్తూ పరుగులు తీస్తూ భూలోకం వచ్చి ఆగి శిలారూపం దాల్చింది. అదే తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేటకు పది మైళ్ల దూరంలో గల ర్యాలి అనే గ్రామంలో ఉన్న జగన్మోహినీ కేశవస్వామి దేవాలయం. పూర్వం ర్యాలి ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలను ‘ఘంటచోళుడు’ అనే చక్రవర్తి పరిపాలిస్తూండేవాడు.

ఒకసారి ‘ఘంటచోళుడు’ వేటకని ఆ అరణ్యాలకు వచ్చి, చాలాసేపు వేటాడి, అలిసిపోయి ఒక చెట్టునీడన విశ్రమించాడు. ఎందరో భక్తులు హరిసంకీర్తన చేస్తున్న ధ్వనులు వినిపించాయి. చక్రవర్తి కన్నులు తెరిచి చూసాడు. ఎవరూ కనిపించలేదు. ఆశ్చర్యపోయిన ‘ఘంటచోళుడు’ వేట చాలించి రాజథానికి వచ్చాడు.

ఆ రాత్రి ‘ఘంటచోళుని’ కలలో శ్రీ మహావిష్ణువు కనిపించి ‘రాజా ఒక రథం సిద్ధం చేయించి నీ రాజ్యంలో నడిపించు.ఆ రథం శీల ఎక్కడ ఊడి పడుతుందో అక్కడ నా విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహానికి అక్కడే గుడి కట్టించి ప్రతిష్ఠించు. నీ జన్మ ధన్యమౌతుంది’ అని ఆదేశించాడు. నిద్రనుంచి మేల్కొన్న మహారాజు మరునాడు తన స్వప్న వృత్తాంతాన్ని రాజగురువులకు చెప్పి, వారి ఆదేశంతో రథాన్ని నడిపించాడు.ఒకచోట శీల ఊడిపడింది. అక్కడ తవ్వించగా ‘జగన్మోహిని’ విగ్రహం బయటపడింది.

మహారాజు ఆ శిల్పాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ విగ్రహానికి ఒకప్రక్కన శ్రీ మహావిష్ణువు ఆకృతి ఉంటే…మరొకప్రక్క జగన్మోహిని ఆకృతి ఉంది. స్త్రీ పుంభావ రూపంతో దొరికిన ఆ విగ్రహానికి అక్కడే ఆలయం నిర్మించి ప్రతిష్ఠ చేయించాడు ‘ఘంటచోళ చక్రవర్తి’. ఆ తరువాతి కాలంలో ఆ ఆలయం ఎంతగానో అభివృద్ధి చెందింది.

Exit mobile version