Home Unknown facts దేశంలో ఎక్కడ లేని విధంగా యమధర్మరాజు పూజలు అందుకుంటున్న ఆలయం

దేశంలో ఎక్కడ లేని విధంగా యమధర్మరాజు పూజలు అందుకుంటున్న ఆలయం

0

శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. శనిగ్రహ దోషాలు, జాతక దోషాలు ఉన్నవాళ్లు ఎక్కువగా ఈ ఆలయానికి వస్తుంటారు. ఇంకా ఎలాంటి గండాలు రాకుండా ఉండేదుకు చాలా మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు. మరి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయాన్ని దర్శిస్తే గండాలన్నీ తొలగిపోతాయని ఎందుకు అంటారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1-Temple

తెలంగాణ రాష్ట్రం, జగిత్యాలకు 30 కీ.మీ దూరంలో ధర్మపురి అనే గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయం ఉంది. అయితే క్రీ.. 7 వ శతాబ్దంలో విషువర్దన మహారాజు ధర్మపురిని కేంద్రంగా చేసుకొని, ధర్మ పరిపాలన చేసాడు. అందుకే ఈ ప్రాంతానికి ధర్మపురి అనే పేరు వచ్చిందని పురాణాలూ తెలియచేస్తున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రధానంగా శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ రామలింగేశ్వరస్వామి, మసీదులు ప్రక్కప్రక్కనే ఉండి అనాది నుండి వైష్ణవ, శైవ, ముస్లిం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచి ఉన్నాయి. దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి తీరాన వెలసి, పౌరాణికంగా, చారిత్రాత్మకంగా గొప్ప పేరు గాంచిన హరిహర పుణ్యక్షేత్రం ధర్మపురి. ఇక్కడ శ్రీ నరసింహుడు లక్ష్మి సమేతంగా వెలసి యోగానంద నారసింహునిగా అవతరించి తనను దర్శించవచ్చిన భక్తుల కోరికలను నెరవేరుస్తున్నాడు.

ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఇక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ యమధర్మరాజు పూజలనందుకొంటున్నాడు. అయితే యమలోకంలో నిత్యం పాపులను శిక్షిస్తూ క్షణం తీరికలేని యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరి నదిలో స్నానమాచరించి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకొని ఆలయంలోనే నివాసం ఏర్పరుచుకున్నట్లు పురాణ గాధలు తెలుపుతున్నాయి. అందుకు నిదర్శనంగా స్వామివారి ఆలయ ద్వారం పక్కన కుడివైపు యమధర్మరాజు విగ్రహం ఉండటం అంతేకాకుండా నిత్యం యమధర్మరాజుకు ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. అకాల మృత్యువు కలగకుండా అనారోగ్యబాధలు కలగకుండా యమధర్మరాజుకు ఇచ్చట భక్తులు దీపారాధన చేస్తారు. యమధర్మరాజుకు భారతదేశం మొత్తంలో ఈ ఒక్క చోటనే ఆలయం ఉన్నదని చెప్పుతున్నారు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా యమధర్మరాజుని దర్శించుకొని నృసింహుడ్ని దర్శించుకోవడం ఆనవాయితీ. ధర్మపురి వచ్చిన వారికీ యమపురి ఉండదు అనే మాట ఇక్కడి నుండి వచ్చినదే.

ఇక్కడ మండపంలో గల గండ దీపంలో నూనె పోసి యముని విగ్రహానికి దణ్ణం పెట్టుకుంటే గండాలన్ని తొలగిపోతాయి భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో వచ్చి పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్థానాలు ఆచరించి యమధర్మరాజుకు దీపారాధన చేసి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకుంటారు.

Exit mobile version