ఇక్కడి ఆలయం విశేషం ఏంటంటే పరమశివుడు ఒక మహర్షి కోరిక ప్రకారం తానే స్వయంగా రూపుదిద్దిన ఒక పార్థివ లింగాన్ని ప్రసాదించాడని స్థల పురాణం చెబుతుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇంకా ఈ ఆలయంలోని విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో కొల్లూరులో మూకాంబిక దేవాలయం ఉంది. ఈ ఆలయం సౌపర్ణిక నది ఒడ్డున, కొండచాద్రి కొండపైన ఉంది. పూర్వము ఈ ఆలయం 3880 అడుగుల ఎత్తున ఉన్న కొండచాద్రి పర్వత శిఖరం పైన ఉండగా, సామాన్యులు అంత ఎత్తుకు ఎక్కి అమ్మవారిని దర్శించడం కష్టం అని ఆదిశంకరాచార్యులు ఈ ఆలయాన్ని తిరిగి కొల్లూరులో ప్రతిష్టించినట్లు తెలియుచున్నది.
ఇక పురాణానికి వస్తే, పూర్వం ఈ అరణ్య ప్రాంతాన్ని మహారణ్యపురం అని పిలిచేవారు. ఇక్కడ కోలుడు అనే ఋషి తపస్సు చేసుకోవడానికి అనువైన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. కొంతకాలానికి అయన తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యేక్షమై తానే స్వయంగా రూపుదిద్దిన ఒక పార్థివ లింగాన్ని ప్రసాదిస్తూ, ఇక నుంచి ఈ ప్రదేశం కోలాపురం అని ప్రసిద్ధమవుతుందని రాబోయే కాలంలో ఆదిశక్తి వచ్చి ఇక్కడ వెలుస్తుందని చెపుతాడు.
ఆవిధంగా కోలా మహర్షి ఇక్కడ తపస్సు చేస్తుండగా, మూకాసురుడి అనే రాక్షసుడు కోలామహర్షిని వేదించగా, అయన ఆదిశక్తిని ప్రార్ధించి, రక్షించమని వేడుకొనగా అప్పుడు మూకాసుడిని ఆదిశక్తి సంహరిస్తుంది. మూకాసురుని సంహరించిన ఆదిశక్తిని దేవతలు, ఋషులు మూకాంబికగా స్తుతించారు. ఆ తరువాత కోలామహర్షి కోరికమేరకు ఆదిశక్తి మూకాంబికాదేవిగా అచటనే ఉండిపోయింది.
ఈ ఆలయంలో ఉన్న మూకాంబిక దుర్గాదేవి అవతారమే స్వయంగా ఉధ్భవించిన శివలింగం వెనుక మహా తేజస్సుతో విరాజిల్లే దుర్గాదేవి ని శ్రీ శంకరాచార్యుల వారు ఇక్కడ స్వయంగా ప్రతిష్టించి, శ్రీ చక్రాన్ని కూడా స్థాపించారు. ఆది శంకరాచార్యుల వారు శ్రీ చక్రం ముందు కూర్చొని గొప్ప తపస్సు చేయగా జగన్మాత ఆయనకు దర్శనం ఇచ్చింది. తానూ దర్శించిన ఆ జగన్మాత రూపాన్ని మనసులో స్థిరపరుచుకొని, ఆ రూపంతోనే ఒక పంచలోహ విగ్రహం తయారుచేయించి, శ్రీ చక్రం వెనుకగా ప్రతిష్టించారు.