Home Unknown facts బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో ఏం జరగనుంది?

బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో ఏం జరగనుంది?

0

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఉహించి కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానం లోని విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. అయితే క్రీ.శ. 1608 లో వీరబ్రహ్మం గారు అవతరించి భవిష్యత్తులో జరుగబోయే విపత్తులను ఆయన ముందుగానే దర్శించి, దానినే కాలజ్ఞానం అనే పేరుతో ఎన్నో తత్వాల రూపంలో బోధించారు. వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు. మరి ఇప్పటివరకు బ్రహ్మం గారు చెప్పిన విషయాలు ఏంటి? కలియుగంలో అయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Brahmam Gari Kalagnanam1బ్రహ్మం గారు ఒక గొప్ప జ్ఞానీ. ఆయన తండ్రి మరణించిన తరువాత తన తల్లి అనుమతితో బ్రహ్మం గారు పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పి ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. ఆలా వెళ్ళిపోయినా బ్రహ్మం గారు ఒక రోజు రాత్రి అచ్చమ్మ గారి ఇంటి బయట నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం ఆమె ఎవరు నీవు అని అడుగగా బ్రతువు దెరువు కోసం వచ్చాను, ఏదైనా పని ఉంటె చెప్పండి అనగా అప్పుడు అచ్చమ్మ తన దగ్గర ఉన్న గోవులని తోలుకెళ్ళమని చెప్పగా బ్రహ్మం గారు గోవుల కాపరిగా మారాడు.

గోవుల కాపరిగా మారిన తరువాత కాలజ్ఞానాన్ని మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్న వీరబ్రహ్మేంద్రస్వామి అక్కడ ఉన్న ఒక తాటిచెట్టు ఆకులను కోసుకుని, కొండ గుహలో రాయడం మొదలుపెట్టాడు. పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. రకరకాల సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింతచెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు? ఇలా ఎందుకు చేశారు? అనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు.

బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీ లోని దేవాలయం నలభై రోజులు పాడుపడుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పినవిధంగానే 1910 – 12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్ళలేదు.

రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంతో రాచరిక వ్యవస్థ అనేది లేదు. ఒక అంబ పదారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు. ఇక ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాలపాటు మన దేశానికి ప్రధానిమంత్రిగా వున్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పటివారికి తెలియదు కానీ, వంద సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు వుండేవి. ప్రస్తుతం ఎక్కాడా అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ, చావు పుట్టుకలు మాత్రం కనుగోనలేకపోతారు. సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకూ కనుక్కోలేదు.

రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టేను రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు. ప్రస్తుతం నీటినుంచే విద్యుత్తు వస్తోంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ళ కిందటే బ్రహ్మంగారు చెప్పారు. గట్టివాడయిన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడయిన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమయిన పాలనను అందించారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలని మోసం చేస్తున్నారు.

వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. వావీ వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చినవారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పాడు. బ్రహ్మం గారు చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు.

ఇది ఇలా ఉంటె ఇప్పటివరకు జరగనవి, రాబోవు రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానం లో ఏమని ఉందంటే, కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుంది అని ఉంది. ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది.

ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. దీని పైన భిన్న వాదనలు ఉన్నాయి. చెన్నకేశవస్వామి మహిమలు నాశనమైపోతాయి. ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసినవారికి ఆ కాంతివల్ల కనులు కనబడవు గుడ్డి వారు అవుతారని ఉంది. పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి, భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమౌతుంది అని చెప్పాడు. కలియుగాన 5000 సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు. బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాతిముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు.

ఇక బ్రహ్మం గారి ఆయన జన్మ రహస్యం గురించి, ఐదువేల ఏళ్ళ తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారము దాల్చి మళ్ళీ జన్మిస్తాను. ఈ సంఘటన జరగటానికి ముందు అనేక ఉత్పాతాలు విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గండకీనదిలో సాలగ్రామములు నాట్యమాడతాయి. మనుషులతో మాట్లాడతాయని చెప్పారు. ఇలా భవిష్యత్తుని ముందే ఉహించి రాసిన బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది తెలీదు, ఎలా ఉన్న కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి, కాలంతో పాటు మనం ముందుకు వెళ్లాల్సిందే.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా, మైదుకూరుకు సుమారు 24 కి.మీ. దూరంలో కందిమల్లయ్య పల్లి అనే గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయం ఉంది. ఇది చాలా పేరుగాంచిన పురాతనమైన మఠము. అయితే శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారిని విష్ణువు యొక్క అవతారంగా కొందరు భక్తులు కొలుస్తారు. ఇక క్రీ.శ. 1694 వ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు భక్తుల సమక్షంలో జీవసమాధి యందు ప్రవేశించారు. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు దీక్ష వహించి బ్రహ్మం గారి మఠమునకు వచ్చి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి జీవసమాధిని భక్తి శ్రద్దలతో దర్శిస్తారు.

Exit mobile version