భాగవత పురాణం ప్రకారం, ఒక పర్యాయం శ్రీమహావిష్ణువు దర్శనార్థం సనత్ కుమారులు వైకుంఠం చేరుకుంటారు. అప్పుడు వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనత్ కుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగిస్తారు. దీని వల్ల సనత్ కుమారులకు ఆగ్రహం వచ్చి జయవిజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాప విమోచనాన్ని అర్థించగా హరి భక్తులుగా ఏడు జన్మలు గానీ, లేదా హరి విరోధులుగా మూడు జన్మలు గానీ భూలోకంలో గడిపితే, శాప విమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు. ఏడు జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులు మూడు జన్మల పాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు. ఈ విధంగా జయవిజయులు రాక్షసులుగా జన్మలెత్తుతారు.
కృతయుగములో హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు త్రేతాయుగము:లో రావణాసురుడు, కుంభకర్ణుడు ద్వాపరయుగము: మందు శిశుపాలుడు, దంతవక్త్రుడు. ఈ విధంగా త్రేతాయుగంలో జన్మించిన వారే రావణ, కుంభకర్ణులనే అన్నదమ్ములు. రావణాసురుడి జన్మవృత్తాంతం స్కాంద పురాణము, బ్రహ్మఖండంలో రామేశ్వర సేతు మహాత్మ్యంలో చెప్పబడింది.
బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్వవసు బ్రహ్మ. ఆయనకు దైత్య రాకుమారియైన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి సుమాలి. సుమాలి తనకు అత్యంత పరాక్రమవంతుడైన మనుమడు కావాలన్న కోరికతో అందరు రాకుమారులను అంగీకరించకుండా మహా తపస్వి అయిన విశ్వ వసు బ్రహ్మకి కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు. కైకసి, తండ్రి ఆజ్ఞపై అసుర సంధ్యాకాలంలో విశ్వ వసు బ్రహ్మ మహర్షి తపస్సు చేసుకొంటుండగా ఆయన వద్దకు వెళ్లి, తపోశక్తితో తన కోరిక తెలుసుకొనమని అంటుంది. విశ్వ వసు బ్రహ్మ విషయం తెలుసుకొని అసుర సంధ్యాకాలం చేత క్రూరులైన పుత్రులు జన్మిస్తారని చెబుతాడు. కాని ఒక ధార్మికుడైన కుమారుడు కూడా జన్మిస్తాడని చెబుతాడు. ఆ ధార్మిక పుత్రుడే విభీషణుడు. ఈ విధంగా పుట్టినవాడు రావణాసురుడు. అందువల్ల రావణాసురుడు దైత్యుడు, బ్రాహ్మణుడు.
రావణాసురుడికి తమ్ములు కుంభకర్ణుడు విభీషణుడు. చెల్లెలు శూర్పణఖ (చంద్రనఖు). రావణాసురుడు చిన్నతనం నుండి సాత్విక స్వభావం లేకుండా తామస స్వభావం కలిగి ఉండేవాడు. ఏకసంథాగ్రాహిగా ఉండేవాడు. వేదవిద్యలు తన తండ్రి విశ్వ వసు బ్రహ్మ నుండి నేర్చుకొని గొప్ప విద్వాంసుడౌతాడు.
తన తాత సుమాలి వద్ద నుండి రాజ్యపాలనా విషయాలు, దైత్యకృత్యాలు నేర్చుకుంటాడు. కానీ తన పూర్వజన్మ వృత్తాంతం గుర్తులేక తన ఆరాద్యమైన విష్ణుమూర్తితోనే వైరం పెట్టుకుంటాడు. చివరికి రాముడి చేతిలో మరణించి మోక్షం పొందుతాడు.