Home Unknown facts ఈ ఆలయంలోని రాతి కోడి కూసిన రోజు ఈ ప్రపంచం జలసమాధి అవుతుందా?

ఈ ఆలయంలోని రాతి కోడి కూసిన రోజు ఈ ప్రపంచం జలసమాధి అవుతుందా?

0

దైవ దర్శనం కోసం గుడికి వెళ్ళినప్పుడు కోరుకున్న కోరికలు నెరవేరాలని కొందరు మొక్కుకుంటే చేసిన తప్పులు, పాపాలు తొలగిపోవాలని మరికొందరు వేడుకుంటారు. అయితే ఈ తంగిడి సంగమం వెళితే సకల పాపాలు నివృత్తి అవుతాయని పురాణాలూ చెబుతున్నాయి. మరి ఆ తంగిడి సంగమం ఎక్కడ ఉంది? అక్కడి ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sangameshwara Templeతెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా కృష్ణా మండల పరిధిలోని తంగిడి గ్రామంలో సంగమేశ్వరుడి ఆలయం ఉంది. కర్ణాటక సరిహద్దు లో ఉండే ఈ ఆలయం ఒకవైపు కృష్ణానది, మరోవైపు భీమానది పరవళ్లు తొక్కుతుంటాయి. ఇక్కడ సాక్షాత్‌ జగద్గురు శ్రీదత్తాత్రేయ స్వామి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు స్నానమాచరించిన కృష్ణ, భీమ నదుల సంగమ క్షేత్రం ఇది అని చెబుతారు. తంగిడి గ్రామం వద్ద కృష్ణ, భీమనదులు కలిసే చోటును సంగమ క్షేత్రంగా అభివర్ణిస్తారు. ఈ క్షేత్రానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కడ దేవతలు, రుషులు, మునులు తపస్సు ఆచరించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణమ్మ అడుగిడుతున్న ప్రాంతమిది. ఒకప్పుడు ఇది దివ్యక్షేత్రంగా వెలుగొందిందని ప్రసిద్ధి. దత్తాత్రేయ స్వామి మొదటి అంశావతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించాడు. ఇప్పటికీ ఆయన జన్మించిన ఇల్లు అక్కడ ఉండడం విశేషం. అక్కడ 16 సంవత్సరాల వరకు ఉండి దేశసంచారం నిమిత్తం వెళ్లిపోయాడు. ఆలా వెళ్లిన వ్యక్తి కొన్ని సంవత్సరాల పాటు ఎవరికీ కన్పించకుండా మాయమయ్యాడు. ఆ తరువాత కార్తీక పౌర్ణమి నాడు తంగిడిలోని నివృత్తి సంగమంలో ప్రత్యక్షమయ్యాడు.

ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు తపస్సు ఆచరించి ఇక్కడినుంచి కర్ణాటకలోని కుర్మగడ్డకు వెళ్లాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇప్పటికీ ఈ సంగమంలో శ్రీపాద శ్రీవల్లభుడు పూజించిన వినాయక విగ్రహం, ఆయన పాదుకలు, శివలింగం ఉన్నాయి. ఆయన ఇక్కడినుంచి కుర్మగడ్డకు కాలినడకన వెళ్లిన మార్గంలో నదిలోని రాళ్లు నల్లరాయితో రోడ్డు వేసినట్లు ఇప్పటికీ ఇక్కడా ప్రత్యక్షంగా కన్పిస్తాయి. ఇంతటి విశేషమైన ఈ స్థానాన్ని తెలుసుకున్న విఠల్‌బాబా ఇక్కడా ఓ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. అందులో భాగంగానే ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ దత్తభీమేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఈ నివృత్తి సంగమంలో స్నానం ఆచరించిన వ్యక్తులకు పాపాలు నివృత్తి అవుతాయని ప్రసిద్ధి. అందుకే ఈ క్షేత్రానికి తంగిడి సంగమమని, నివృత్తి సంగమమనీ పేరొచ్చింది.

ఇక్కడ ఒక శిలాశాసనంలో నది నీటి ద్వారానే ఓ శక్తి పుడుతుంది. ఆ తరువాత సంగమంలోని రాతి కోడి కూస్తుంది. ఆ కోడి కూసిన రోజు ఈ ప్రపంచమంతా జలసమాధి అయిపోతుంది అంటూ రాసుంది. ఆ శాసనంలో చెప్పినట్లే ఇక్కడున్న బురుజుపై రాతికోడి ఉండేది. అది ప్రస్తుతం శిథిలమైంది. అదే విధంగా ఆ శాసనమూ ప్రస్తుతం శిథిలమైపోయింది. కానీ ఈ ప్రాంత ప్రజలు మాత్రం ఈ మాటలను ఎప్పుడూ తలచుకుంటూనే ఉంటారు. ఈవిధంగా కృష్ణ, భీమనదులు ఒకచోట కలిసే ఈ తగిడి సంగమం చోటుకి వెళితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలూ చెబుతున్నాయి.

 

Exit mobile version