Home Unknown facts కార్తికేయుని వరాల కోసం చేయాల్సిన స్కంద మాత పూజ

కార్తికేయుని వరాల కోసం చేయాల్సిన స్కంద మాత పూజ

0

దక్షిణభారతదేశంలో కుమారస్వామి ఆరాధనకి ప్రాముఖ్యత ఎక్కువ. ఇటు శక్తినీ, అటు ముక్తినీ ప్రసాదించగల ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడంటే మనకి భక్తి ఎక్కువ. మరి అలాంటి కుమారస్వామిని తల్లితో సహా ఆరాధించే సందర్భం వస్తే ఇంకెంత ఫలదాయకమో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అవకాశాన్ని అందించే తల్లి- స్కందమాత.

దక్షయజ్ఞంలో భాగంగా శివుని భార్య అయిన సతీదేవిని దక్షుడు అవమానించే విషయం తెలిసిందే ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి అగ్నికి ఆహుతైపోతుంది. దాంతో శివమెత్తిన పరమేశ్వరుడు దక్షయజ్ఞాన్ని చిన్నాభిన్నం చేసి దక్షుని సంహరిస్తాడు. అయినా శివుని మనసు శాంతించకపోవడంతో ప్రబలమైన వైరాగ్య భావనతో ధ్యానావస్థలో కాలం గడుపుతూ ఉంటాడు. ఇదే అదనుగా భావించి తారకాసురుడు అనే రాక్షసుడు తన మృత్యువు శివపుత్రుని చేతిలోనే ఉండాలన్న వరాన్ని కోరుకుంటాడు. తీవ్ర మనస్తాపంతో ఉన్న శివునికి పుత్రుడు కలిగే అవకాశం లేదని విర్రవీగిన తారకాసురుడు ముల్లోకాల మీదా పడి విధ్వంసాన్ని సృష్టించడం మొదలుపెడతాడు.

ఇప్పుడు శివుని తపస్సుని భగ్నం చేస్తేకానీ ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు అందుకోసం స్వయంగా ఆ మన్మధుడే దిగివచ్చి శివునిలోని వైరాగ్యాన్ని సడలించే ప్రయత్నం చేయబోతాడు. కానీ అందుకు బదులుగా శివుని ఆగ్రహానికి గురవుతాడు. తన మూడో కన్నుని తెరచి మన్మధుని భస్మం చేస్తాడు పరమేశ్వరుడు. ఆ సమయంలో ఆయన నుంచి వెలువడిన తేజస్సు ఒక పిండరూపాన్ని దాల్చింది. అంతటి తేజస్సుని అగ్ని సైతం భరించలేకపోవడంతో దానిని గంగానదిలో విడిచిపెడతాడు అగ్నిదేవుడు. అక్కడి రెల్లుపొదల మధ్య ఆ పిండము శిశువుగా మారింది. ఆ శిశువుని ఆరుగురు అక్కచెల్లెళ్లైన కృత్తిక నక్షత్ర దేవతలు సాకారు.

కృత్తికలు పెంచడం వల్ల కార్తికేయుడనీ, శివపుత్రుడు కాబట్టి స్కందుడనీ, రెల్లు పొదలు (శరవణాలు) మధ్య పుట్టాడు కాబట్టి శరవణుడనీ ఆయనకు పేరు వచ్చింది. ఈలోగా శివుని తపస్సు కూడా ముగిసింది. ఆనాటి సతీదేవి తిరిగి పార్వతిగా జన్మించడంతో శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. తారకాసురుడనే రాక్షసుని చావు తన చేతిలో ఉందని తెలుసుకున్న స్కందుడు అతడిని సంహరించడానికి బయల్దేరతాడు. ఆ సమయంలో పార్వతీదేవి స్కందమాత రూపంలో ఆయనను ఆశీర్వదించిందని చెబుతారు. తిరిగి దేవాసుర సంగ్రామం జరిగిన నవరాత్రుల సమయంలో ఐదో రోజున దుర్గాదేవి స్కందమాత రూపంలో శుంభ, నిశుంభులను ఎదుర్కొంధీ అని పురాణాలు చెబుతున్నాయి.

స్కందమాత సింహవాహనం మీద నాలుగు చేతులతో అలరారుతూ ఉంటుంది. రెండు చేతులా కమలాలను ధరించి, ఒకచేత్తో అభయాన్ని అందిస్తూ, మరో చేతితో కార్తికేయుని పట్టుకుని ఉండే అమ్మవారి విగ్రహాలే తరచుగా దర్శనమిస్తాయి. స్కందమాతని పూజిస్తే ఇటు ఇహంలో జ్ఞానమూ, పరంలో మోక్షమూ సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. పైగా ఆమెని పూజిస్తే ఆమె ఒడిలో ఉన్న కార్తికేయుడు కూడా ప్రసన్నమవుతాడు కాబట్టి, ఇరువురి ఆశీస్సులూ లభిస్తాయంటారు. నవరాత్రులలో భాగంగా ఐదవ రోజు అమ్మవారిని స్కందమాత రూపంలో పూజిస్తారు. ఆ రోజున స్కందమాతను పూజిస్తే, భక్తుల మనసు ఎలాంటి ద్వంద్వాలకూ లోనుకాని రీతిలో పరిశుద్ధమవుతుందని నమ్ముతారు.

కేవలం దేవీనవరాత్రుల సందర్భంలోనే కాదు స్కందమాతను ఎప్పుడైనా కొలుచుకుకోవచ్చు. ‘ఓం దేవీ స్కందమాతాయై నమః’ అన్న మంత్రంతో కానీ “సింహాసనగతా నిత్యం పద్మాంచిత కరద్వయా। శుభదాస్తు సదా దేవి స్కందమాతా యశస్వినీ” అన్న ధ్యానశ్లోకంతో కానీ ఆమెను తలచుకోవచ్చు. అంతే భక్తుల జీవితాలలో ఉండే ఎలాంటి కష్టాన్నైనా ఆ తల్లీబిడ్డలు ఈడేరుస్తారనడంలో సందేహం లేదు.

 

Exit mobile version