పురాణాల ప్రకారం నరసింహస్వామి తేత్రాయుగంలో ఐదు రూపాల్లో సాక్షాత్కారించాడు. అవి జ్వాలా నరసింహుడు, యోగ నారసింహుడు, గండ బేరుండ నారసింహుడు, ఉగ్ర నారసింహుడు, శ్రీ లక్ష్మి నారసింహ రూపాల్లో యాదమహర్షికి దర్శనం ఇచ్చాడు. అయితే ఎక్కువగా నరసింహస్వామి ఆలయాలు కొండప్రాంతంలోనే ఉంటాయి. అలానే ఇక్కడ కూడా లక్ష్మీనరసింహస్వామి ఒక కొండగుహలో స్వయంభువుగా వెలిశాడని పురాణం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, కృష్ణానది తీరాన మట్టపల్లి గ్రామంలో ఒక కొండపైన ఉన్న గుహలో నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో నరసింహస్వామి స్వయంభువుగా వెలిశాడని పురాణం. అయితే ఈ ఆలయంలో స్వామివారితో పాటు దక్షిణావృత శంఖం కూడా ఆవిర్భవించింది. ఈ ఆలయానికి కొన్ని వేలసంవత్సరాల క్రితం నాటిదిగా ఇక్కడ ఉన్న శిలాశాసనం ద్వారా తెలియుచున్నది. ఈ ఆలయం వేదాద్రి మొదలైన పంచనారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అతి పురాతన ఆలయమని చెప్పే ఈ ఆలయంలో స్వామివారిని భక్తులు ప్రహ్లాద యోగానంద శ్రీ లక్ష్మీనరసింహస్వామి గా పిలుస్తారు.
ఈ ఆలయ పురాణానికి వస్తే, పూర్వం భరద్వాజ మహర్షి ఇక్కడ ఉన్న గుహలో స్వామివారి దర్శనం కోసం ఘోర తపస్సు చేసాడట. అయితే తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడం కోసం వచ్చిన స్వామివారు భరద్వాజునికి ప్రత్యేక్షమై దీవించాడు. ఇక అయన కోరికమేరకు స్వామివారు ఈ కొండగుహలో వెలిశాడని పురాణం. ఇక ఈ ఆలయంలో 15 అడుగుల ఎత్తులో ఉన్న శిలాశాసనం ద్వారా ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల క్రితం నాటిదిగా తెలియుచున్నది. ఇక ఈ ఆలయం వెలుగులోకి ఎలా వచ్చినది అంటే, అలా చాలా సంవత్సరాలు కొండ గుహలో ఉన్న స్వామివారు కొన్ని సంవత్సరాల తరువాత ఇక్కడి ప్రాంతంలోని ఒక భక్తుడి కలలో కనిపించి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి నేను ఇక్కడే ఉన్నాను, నన్ను దేవతలు, మహర్షులు పూజించి తరించారు. ఇక్కడ ఉన్న కొండగుహలో నేను ఉన్నాను నన్ను పునః ప్రతిష్టించి పూజించమని కలలో చెప్పాడట.
ఇక ఈ ఆలయ గర్భగుడిలో స్వామివారికి ఎడమపక్కన ఒక గుహద్వారం అనేది ఉంది. ఈ ద్వారం గుండా పూర్వం సప్తరుషులు, యోగులు, సిద్దులు కృష్ణనదిలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వచ్చేవారని చెబుతారు. ఇంతటి ప్రసిద్ధ ఆలయానికి, దుష్టగ్రహ బాధలు, రుణబాధలు, సంతానం లేనివారు ఇక్కడి వచ్చి 11 రోజులు 3 పూటలా కృష్ణలో స్నానం చేసి తడిబట్టలతో 32 ప్రదక్షిణాలు చేస్తే ఆ స్వామివారు అన్ని కోరికలను నెరవేరుస్తాడని నమ్మకం.