Home Unknown facts పంచభూత ఆలయాల్లో అగ్నిని సూచించే శివాలయం

పంచభూత ఆలయాల్లో అగ్నిని సూచించే శివాలయం

0

మన దేశంలో ఎన్నో ప్రసిద్ధ శివాలయాలు ఉన్నవి. అయితే సమస్త జీవరాశికి ఆధారమైన పంచభూతాలు భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి. ఈ పంచభూతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ శివుడు ఐదు చోట్ల వెలిసాడు. వాటినే పంచభూత దేవాలయాలని అంటారు. అందులో అగ్నిని సూచిస్తూ శివుడు వెలసిన ఆలయం ఇది. మరి ఈ అగ్ని లింగం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Tejolingam

తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై జిల్లాలో అన్నామలై కొండ దిగువన ఉన్న ప్రాంతంలో అరుణాచల దేవాలయం ఉంది. శివుడి యొక్క పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ స్వామివారిని అరుణాచలేశ్వరుడని, అమ్మవారిని అరుణాచలేశ్వరి అని పిలుస్తారు. ఈ ఆలయం అగ్నిని సూచిస్తుంది. ఇక్కడి శివలింగాన్ని తేజోలింగం అని కూడా అంటారు. ఈ ఆలయానికి వెనుక భాగంలో ఉన్న కొండనే అరుణాచలం అని అంటారు.

ఈ ఆలయ పురాణానికి వస్తే, గౌతమ మహర్షి ఆశ్రమంలో ఉన్న పార్వతీదేవి నిష్ఠకి భగ్నం చేయాలనే ఉద్దేశంతో మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రయత్నించగా ఆగ్రహానికి గురైన పార్వతీదేవి ఆ రాక్షసుడిని సంహరించింది. అయితే మహిషాసురుడు శివభక్తుడు కావడంతో పచ్చాత్తాపం చెంది కొండశిఖరం మీద తన చేతిలోని కత్తితో ఒక దెబ్బ వేయగా అక్కడ ఒక పుష్కరిణి ఏర్పడింది. దీనినే ఖడ్గ పుష్కరిణి అని అంటారు. ఆ దేవి ఈ నీటి యందు మునిగి ఉండి కార్తీక పౌర్ణమి నాడు అందులో నుండి బయటకు వచ్చి దర్శనమివ్వగా అప్పుడు మహిషాసురుడిని తన తలపైన మోసుకొని ఉన్నట్లుగా ఒక పెద్ద జ్యోతిస్వరూపుడైన లింగాకారంలో శివుడు ఆమెకి దర్శనం ఇచ్చాడట. అందువలనే కార్తీకపౌర్ణమి రోజున ఇక్కడ ఒక గొప్ప ఉత్సవం చేయడంతో పాటుగా పక్కనే ఉన్న ఒక కొండమీద పెద్ద జ్యోతిని వెలిగిస్తారు.

ఈ ఆలయంలో గిరి ప్రదక్షణికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఉన్న అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే దాదాపుగా 12 కి.మీ. నడవాల్సి ఉంటుంది. ఇలా ప్రదక్షిణ చేస్తుండగా మార్గమధ్యంలో మొత్తం ఎనిమిది శివాలయాలు ఉంటాయి. ఇలా ఒక్కో ఆలయాన్ని దర్శిస్తూ మార్గమధ్యంలో అరుణాచల శిఖరాన్ని చూస్తూ భక్తులు ప్రదక్షిణం ముగిస్తారు. ఇలా గిరి ప్రదక్షిణ చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని నమ్మకం.

ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ఈ ఆలయంలో దీపోత్సవం చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఇక్కడ మహాదీపం వెలిగించే ఈ అన్నామలై కొండ 2668 అడుగుల ఎత్తు ఉండగా, అక్కడికి చేరాలంటే 8 కి.మీ. నడవాల్సి ఉంటుంది. ఈ మహాదీపంలో వేసే వత్తి పొడవు అరకిలోమీటరు పొడవు ఉండగా, దాదాపుగా వెయ్యి కిలోల నెయ్యి వేసి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఈ ఉత్సవం 11 రోజుల పాటు చాలా వైభవంగా జరుగుతుంది. ఈ దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తుంటారు.

ఈ ఆలయం దాదాపు 25 ఎకరాలు విస్తరించి ఉండగా, తొమ్మిది గోపురాలు, ఏడు ప్రాకారాలు ఉండగా, 217 అడుగుల ఎత్తు ఉండే రాజగోపురం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వేదాంత గురువైనా భగవాన్ రమణమహర్షి 53 సంవత్సరాలు ఇక్కడే నివసిస్తూ సమాధి పొందారు. ఆలయంలోపల గల పాతాళ లింగం వద్ద ఈ గురువు కు జ్ఞానోదయం కలిగింది.

ఇలా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి దీపోత్సవం, రథోత్సవం సమయంలో, ప్రతి పౌర్ణమి రోజున అరుణాచల కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

Exit mobile version