Home Unknown facts మూడు కళ్లు, పది భుజాలతో దర్శనమిచ్చే వీరాంజనేయుని ఆలయం

మూడు కళ్లు, పది భుజాలతో దర్శనమిచ్చే వీరాంజనేయుని ఆలయం

0

హనుమాన్ ఈ పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే ఆంజనేయుడు గుర్తుకు వస్తాడు. అంతే కాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా కూడా ఆంజనేయుడు కీర్తికెక్కాడు. హనుమంతుడు సాధారణంగా చేతిలో సంజీవని పర్వతంతోనో, లేదా రాముని పాదాల వద్దో మనకు కనిపిస్తాడు. అయితే పదిభుజాలు, మూడు కళ్లు కలిగిన ఆంజనేయుడిని ఎప్పుడైనా చూశారా? అయితే ఆ రూపాన్ని చూసేందుకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళంలో ఉన్న త్రినేత్ర దశభుజ వీరాంజనేయ ఆలయానికి వెళ్లాల్సిందే.

త్రినేత్ర దశభుజ వీరాంజనేయఈ ఆలయంలో పది భుజాలు, నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారమెత్తి యుద్ధం చేసి రావణుడిని సంహరించి లంకను నాశనం చేసి తరువాత విబీషణుడికి పట్టం కట్టారు. పిమ్మట నారదుడు రాముడిని కలుసుకున్నాడు.

స్వామి లంక నాశనముతో మీ యుద్ధము పూర్తికాలేదు. రావణుని వారసులు ఉన్నారు. తండ్రి మృతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు తప్పకుండా మీపై యుద్ధానికి వస్తారు. వారు ప్రస్తుతం సముద్ర అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు పూర్తి కాకముందే మీరు వారిని సంహరించాలని వేడుకున్నాడు. అప్పుడు రాముడు నారదమహర్షి రామావతారంలో నా కర్తవ్యం పూర్తయినది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలించనున్నాను. ఇందుకు ఇంకెవరినైనా ఎంపిక చేయుమని అన్నాడు. కాగా, అంతటి పరాక్రమ వంతుడు ఎవరున్నారు అని అలోచించి ,రాక్షస వధకు హనుమంతుడిని పంపించాలని అందరూ నిర్ణయించారు.

యుద్ధం ప్రారంభమయే సమయంలో బ్రహ్మ, విష్ణు ,మహేశ్వరులు హనుమంతుడిని ఆశీర్వదించి, యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణు మూర్తి తన శంకు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు. ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు.

కైలాసనాధుని నుంచి మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు. వానర శ్రేష్టుడు రాక్షస వధ పూర్తిచేసి విజయంతో తిరిగి వచ్చాడు. ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసినందున ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు. రాక్షస వధతో హనుమంతుడు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు.

 

Exit mobile version