ఆ పరమ శివుడికి సంబంధించిన కథలలో దక్షయజ్ఞానికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సమయంలో రుద్రుని జటాజూటం నుండి ఉద్భవించిన వాడే వీరభద్రుడు. మన తెలుగు రాష్ట్రాల్లో వీరభద్ర స్వామి ఆలయాలు అరుదు. కానీ తక్కువ సంఖ్యలో ఉన్న ఆలయాలు అయినా చాలా ప్రసిద్ధి చెందాయి.
- ఈ విధంగా తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం ఒకటి. నిత్యం ఎంతో మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయ విశేషాలు ఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామి వారి మహిమలు, ఆలయ చరిత్ర ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం…
- వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కోరమీసాల వీరభద్ర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ మనం ఏదైనా కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
- ఈ ఆలయంలో వెలసిన స్వామి వారికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వెలసిన స్వామి వారు విగ్రహ రూపంలో కాకుండా అర్చామూర్తిగా కోరమీసాలతో వెలసి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయ విషయానికి వస్తే కొందరు కుమ్మరులు వంట చెరుకు కోసం కొండపైకి ఎడ్ల బండితో వెళ్లారు వారు వంట చెరుకును తీసుకువచ్చి చూసేసరికి తమ ఎడ్లు మాయమయ్యాయి. అయితే తిరిగి వెళ్లడానికి చీకటి పడడంతో ఆ కుమ్మరులు ఆ కొండపైనే సేద తీరారు.
- ఈ క్రమంలోనే వారి కలలో వీరభద్రస్వామి కనిపించి తాను కొండపై ఒక గుహలో కొలువై ఉన్నానని తనని కిందకి తీసుకెళ్లి ఆలయం నిర్మించాలని చెప్పారు. ఇలా చేస్తే మీ ఎడ్లు మీకు తిరిగి దక్కుతాయని చెప్పి మాయమయ్యాడు.
- ఈ క్రమంలోనే స్వామి వారుకలలో కనిపించి చెప్పిన విధంగానే ఆ కుమ్మరులు గుహలోకి వెళ్లి స్వామివారి విగ్రహాన్ని కిందకు తీసుకు వస్తున్న నేపథ్యంలో స్వామివారికి కాలు విరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఎంతో మహిమ గల ఈ స్వామివారికి సంతానం లేని వారు కోర మీసాలను సమర్పిస్తామని మొక్కుకుంటే వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తులు ఎక్కువగా నమ్ముతారు.
- అందుకే ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. అదే విధంగా ఈ ఆలయంలో స్వామివారికి మొక్కులు మొక్కి ఆ ముక్కు నెరవేరాలని ఇక్కడ కోడె దూడలను సమర్పించడం మరొక ఆచారం. సంక్రాంతి సమయంలో ఈ స్వామివారికి జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో మొదటి రోజు కుమ్మరులు పాల్గొని స్వామివారికి బోనాలు సమర్పిస్తారు. అంతే కాదు ఎడ్ల బండ్లతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి మొక్కులు సమర్పించుకుంటారు.