వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి. కానీ బల్లాళేశ్వర్ గణపతి పేరు మీరు విని ఉండరు. అయితే ఇక్కడి ఆలయంలో స్వయంభూగా వెలసిన ఆ వినాయకుడికి ఆ పేరు ఎందుకు వచ్చినది? ఆ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాజాస్థానం రాష్ట్రంలోని దక్షిణభాగంలో దుంగర్భుర్జైళ్లకు పరిపాలన కేంద్రంగా దుంగర్భుర్ ఉంది. ఈ ఆలయం హిందూ, జైన ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతంలోనే బనేశ్వర దేవాలయం ఉంది. ఈ ఆలయంలో తాంత్రిక వినాయకుడు ఉన్నాడు.
ఇక ఈ ఆలయం పురాణానికి వస్తే, ఆ పట్టణములో కల్యాణ్ అనే వైశ్యుడు ఉండేవాడు. అతడు చాల ధనికుడు, భగవద్భక్తి కలవాడు. లేదనకుండా దాన ధర్మాలు చేసేవాడు. ఆయన భార్య ఇందుమతి మహా పతివ్రత, సౌందర్యవతి. ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. అతనికి బల్లాల్ అని నామకరణం చేశారు. అతడు చిన్న వయస్సునుండియే, గణపతిభక్తుడైయుండెను. బల్లాల్ ఒకనాడు తనతోడి బాలకులతో అడవికి వెల్లెను. అచ్చట బల్లాల్ ఒక పెద్ద రాయిని చూచి, దానిని గణపతి విగ్రహముగా భావించి, ప్రాణప్రతిష్టచేసి, పిల్లలందరితో కలిసి పూజలు చేయనారంభించెను. అందరూ ఆ గణపతి విగ్రహమునకు బిల్వపత్రములతోను, దూర్వాయుగ్మముతోను పూజలు చేసిరి. జై గజానన్, జై గజానన్ అను నాదములు చేయుచు, చక్కని పాటలు పాడుచు, నృత్యములు చేయుచు, భక్తి పారవశ్యములో ఆకలి దప్పులను, వారి యిళ్ళను మరచిరి. కొన్ని రోజులు గడచినవి. కాని ఆ బాలురెవ్వరును తమయిండ్లకు తిరిగి రాలేదు. ఆ బాలుర తల్లిదండ్రులు చాల భయపడి కల్యాణ్వర్తకుని యింటికి వెళ్ళి తమ పిల్లలు ఇండ్లకు తిరిగి రాలేదని, బల్లాల్ వారందరిని ఎక్కడకో శ్రీసికొని వెళ్ళాడని, అతనిని నివారింపుమని, దుఃఖముతోను, భయముతోను, రోషపూరితముగాను మాట్లాడిరి. కల్యాణ్ వర్తకుడు కోపించిన వాడై, ఆ గ్రామముబయట పిల్లలందరు పూజ చేసికొనుచున్న ప్రదేశమునకు వెళ్ళి వారిపై ఆగ్రహించెను. పిల్లలందరును భయముతో పారిపోయిరి. కాని, బల్లాల్ మాత్రము తన ధ్యానములో నిమగ్నుడై యుండెను. ఆ వర్తకుడు కోపముతో బల్లాల్ను కొట్టి, చెట్టుకు కట్టి, గణపతి విగ్రహముగా పూజలు పొందుచున్న రాయిని పారవేసెను. అప్పడు పిల్లవాడైన బల్లాల్ విఘ్నేశ్వరుని కొట్టినందుకు తండ్రి పై అతనికి ఇంచుకైనను కోపము రాలేదు. కాని గణపతి విగ్రహము పారవేయుట చూచి, సహింపలేక ఎవరు యిటు చేసిరో, వారు గ్రుడ్డి, చెవుడు, మూగ, గూని అగునని శపించెను. గణపతి పిల్లవాని భక్తికి మెచ్చి ఒక బ్రాహ్మణపిల్లవాని వలె దర్శనమిచ్చెను. అతని శరీరమును తాకెను. వెంటనే అతనిశరీరములోని నొప్పలన్నియుపోయి, అది బలమైన శరీరముగా మారినది. బల్లాల్ ఆ బ్రాహ్మణ బాలకుని విఘ్నేశ్వరుడని గ్రహించి, అతనిని పూజించెను. విఘ్నేశ్వరుడు సంతసించి బల్లాల్ ను వరము కోరుకొనుమనెను. విఘ్నేశ్వరునియందు అనన్యభక్తి కలిగి యుండునట్లను, ఆ స్థలమునందు విఫే్నుశ్వరుడు ఎల్లప్పడు వసించి, ప్రజల కష్టములను నివారణ చేయవలెననియు బల్లాల్వరమును కోరెను. వినాయకుడు అంగీకరించి, బల్లాలేశ్వర్ నామముతో స్వయంభూ విగ్రహరూపమును దాల్చి, అప్పటి నుండి భక్తుల కోర్కెలను, కష్టములను తీర్చుచుండెను. బల్లాల్ తన తండ్రిచే పారవేయబడిన రాతిని, డుండి వినాయక నామముతో అచ్చట ప్రతిష్టించెను. తరువాత, బల్లాల్ అచ్చట సర్వాంగ సుందరమైన మందిరమును గూడ నిర్మించెను. ఈవిధంగా వినాయకుడు తన భక్తుడి భక్తికి మెచ్చి అతనిపేరు మీదనే అచట స్వయంభూగా వెలసినాడు.