సుబ్రమణ్యం స్వామి శివ పార్వతుల రెండవ కుమారుడు. ఆయననే భక్తులు కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు అనే పేర్లతో పిలుచుకుంటారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు, పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని గుర్తించి అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.
ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని అంటారు. కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు “శూలం” మొదలైన ఆయుధాలను ఇచ్చారు.
దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించాడు. ఆ రోజునే “శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి” గా వ్యవహరిస్తారు. అంటే సుబ్రమణ్యం స్వామి పెళ్ళి రోజు అన్నమాట. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి , సుబ్బరాయుడు షష్టి అంటారు. తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు.
స్కంద షష్టి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు,పువ్వులు,వెండి పడగలు,వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజ దోషం,కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ, దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేస్తుంటారు.
తమిళనాడు ప్రాంతాలలో షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని వెళ్లి మొక్కు తీర్చుకుంటారు. ముఖ్యంగా ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కొన్ని ప్రాంతాల్లో కావడిలో మొసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని అంటారు.
పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు.