Home Unknown facts దేవాలయాల్లో పూర్ణకుంభంతో ఎందుకు స్వాగతిస్తారు ?

దేవాలయాల్లో పూర్ణకుంభంతో ఎందుకు స్వాగతిస్తారు ?

0

ఇంట్లో ఏదైనా శుభకార్యం లేదా వ్రతం చేస్తున్నారంటే.. తప్పకుండా కలశాన్ని ఏర్పాటు చేయాల్సిందే. కలశాన్ని త్రిమూర్త్యాత్మకంగా భావించి పూజించడం, విజయం కోసం ఆశీస్సులు కోరడం హిందువుల సాంప్రదాయం. నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర ఏర్పాటుచేసి పాత్ర మొదట్లో మామిడి ఆకులు వాటి పైన కొబ్బరి కాయ ఉంచబడుతుంది. తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమ చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది. అటువంటి పాత్రని ‘కలశం’ అంటారు.

పూర్ణకుంభం
ఆ పాత్రకు అర్ధం ఏమిటంటే ఆ పాత్రను నీటితో గానీ బియ్యంతో గానీ నింపినప్పుడు “పూర్ణకుంభము” అనబడుతుంది. అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది. ప్రాణశక్తి వల్లనే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది. సాంప్రదాయ బద్ధమైన గృహ ప్రవేశం, వివాహం, నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో కలశం ఏర్పాటు చేయబడుతుంది. స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం దగ్గర దీనిని పెడతారు.

ఇది మహాత్ములను సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది. సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రములో తన శేషశయ్య పై పవళించి ఉంటాడు. అతని నాభి నుండి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. కలశంలోని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రథమ అడుగు అయిన నీటికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది అన్నింటికి జీవన దాత. లెక్కలేనన్ని నామరూపాలకి, జడ పదార్థాల మరియు చలించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త. ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక. చుట్టబడిన దారం సృష్టిలో అన్నింటినీ బంధించే ‘ప్రేమ’ను సూచిస్తుంది. అందువల్లనే ‘కలశం’ శుభసూచకంగా పరిగణింపబడి పూజింపబడుతుంది.


అన్ని పుణ్య నదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానం మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించబడిన తరువాత అందులోని నీరు “అభిషేకము”తో సహా అన్ని వైదికక్రియలకి వినియోగించ బడుతుంది. దేవాలయ కుంభాభిషేకాలు ఎన్నో రకాల పూజలు కలశ జలాలతో అభిషేకాలతో విశిష్ట పద్దతిలో నిర్వహిస్తారు. పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మధించినపుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ‘కలశం’ అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది.

కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః |
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః | |
కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా |
ఋగ్వేదో థ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః | |
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః |
ఆయాంతు దేవ పూజార్థం సకల దురిత క్షయ కారకాః | |

కలశం పెట్టిన తరువాత ఈ మంత్రాన్ని చదుకోవాలి దీని అర్ధం:

కలశ ముఖంలో విష్ణుమూర్తి, కంఠ భాగంలో శివుడు, మూల భాగంలో బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో మాతృగణాలు ఆశ్రయించి ఉన్నారు. కలశంలోని జలాల్లో సాగరాలన్నీ, సప్తద్వీపాలతో కూడిన భూమి, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు, వేదాంగాలతో సహా సమస్త దేవతా గణాలు ఆశ్రయించి ఉన్నారు. సమస్త పాపాలను తొలగించడానికి వారంతా వచ్చెదరు గాక !

పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ, ఆనందాలతో తొణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీకగా ఉంటారు. వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పతనానికి గుర్తింపుగా మరియు వారిపట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణకుంభంతో హృదయ పూర్వకంగా స్వాగతమిస్తాము. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు గొప్ప వ్యక్తులకు ఇచ్చే గౌరవం కూడా.

Exit mobile version