మాసాలలోనే ఎంతో ఉత్తమమైంది ‘మాఘమాసం’. అందులో శుక్లపక్షంనాడు సూర్యునికి ఎంతో ఇష్టమైన రోజు రథసప్తమి వస్తుంది. ఇతనిని పూజించడానికి బ్రాహ్మణాది సకలవర్ణాలవారు ముక్తిని కోరుకుని ఆరాధిస్తారు. రథసప్తిమినాడు సముద్రస్నానం చేసి, అనుష్టానం తీర్చుకొని, భాస్కరుణికి అర్ఘ్యమిచ్చి బ్రహ్మయజ్ఞం, పితృతర్పణం చేసుకోవాలి. ఆ తరువాత శుభ్రమైన వస్త్రాలను ధరించి, ఆ సముద్రతీరంలోనే తూర్పముఖంగా కూర్చుని, అష్టదళాల పద్మమైన ఎర్రచందనం కలిసిన నీటితో రాయాలి.
తరువాత ఒక రాగి పాత్రను తీసుకుని అందులో తిలలు (నువ్వుల ఉండలు ) ,బియ్యం, ఎర్రచందనం కలిపిన నీటిని పోసి, ఎర్రని పూలు వుంచి, వానిపై దర్భలు కూడా వేయాలి. దానిమీద ఒక జిల్లేడు ఆకును వుంచి, దానిలో కూడా తిలతండులాదివస్తువులను వుంచి, ఆపైన ఇంకొక రాగి చెంబును నీళ్లతో నింపుకోవాలి.
ఆగ్నేయనైరృతి, వాయు, ఈశానకోణాలలో భాస్కరునే ప్రధానదైవంగా భావించి, భాస్కరుని ఆవాహనచేసి కర్ణికాభాగాములో స్థాపించి, ముద్రాప్రదర్శన చేసి, పరమాత్ముని ధ్యానించుకోవాలి. ఆపైన ఆరాధకుడు మోకాళ్లమీద కూర్చొని ఆ పాత్రను శిరస్సుపై వుంచుకొని, మళ్లీ పద్మంపై వుంచాలి. ఆపై మూడక్షరాల మంత్రంతో అర్ఘ్యమివ్వాలి. దీక్షితుడు కానివాడు కూడా ఈ విధంగా సూర్యుడిని ఆరాధించవచ్చు. ఆ తరువాత గంధధూపదీప నైవేద్యంతో సూర్యభగవానుడిని పూజించుకోవాలి.
వేదాలలో చెప్పినప్రకారం సౌరాష్టాక్షరీ మంత్రాన్ని యథాశక్తిగా జపించాలి. తరువాత భూమిపై శిరము వుంచి నమస్కారాలు చేసుకోవాలి. ఆదివారం సప్తమి, మాఘమాసం కలిసివచ్చిననాడు ఈవిధంగా సూర్యారాధనం చేసి, నమస్కారం చేసుకోవడం వల్ల ఎటువంటి దారిద్ర్యం ఇళ్లలో వుండదు. ఆరాధకుడు సూర్యారాధనం చేసేరోజు ఉపవాసం వుండాలి.