Home Unknown facts ఆంజనేయస్వామి శ్రీరామునికి అరటిపండు ఇచ్చి ఆకలి బాధను పోగొట్టిన పుణ్యస్థలం

ఆంజనేయస్వామి శ్రీరామునికి అరటిపండు ఇచ్చి ఆకలి బాధను పోగొట్టిన పుణ్యస్థలం

0

ధర్మ రక్షణ కోసం రాముడు జన్మిస్తే అయన నమ్మిన బంటు హనుమంతుడు ధర్మ సేవ కోసం అవతరించాడు. ధైర్యానికి నిజమైన భక్తికి నిదర్శనం అయినా హనుమంతుడు లేని గ్రామం అంటూ ఉండదు. ఇక్కడ హనుమంతుడు ఒక కోతి రూపంలో దర్శనం ఇచ్చాడని చెబుతారు. అయితే అరణ్యవాసంలో శ్రీరామునికి అరటిపండు ఇచ్చి ఆకలి బాధను పోగొట్టగా ఇక్కడ అంజనేయస్వామి వారు రామా ఇవిగో అరటిపండ్లు అన్నట్టుగా విగ్రహం ఉండటం ఒక విశేషం అయితే, ఆలయంలో సీతాదేవి శ్రీరాముడికి కుడివైపున నిలబడి ఉండటం విశేషం. మరి ఈ ఆలయ స్థల పురాణం ఏంటి? సీతాదేవి ఎందుకు ఆలా కుడివైపున ఉంటుందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Hanuman Junction

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పచ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల సరిహద్దు లో హనుమాన్ జంక్షన్ ఉంది. ఇక్కడే శ్రీ అభయాంజనేయస్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడ హనుమంతుడి విగ్రహం ప్రతిష్టించకముందు ఈ ప్రాంతాన్ని బావులపాడు జంక్షన్ అని పిలిచేవారట. ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహాన్ని 1938 వ సంవత్సరంలో నూజివీడు జమిందార్ ప్రతిష్టించాడట.

ఇక పూర్వం జమిందార్ అయినా మేక వేంకటాద్రి అప్పారావు బహాదుర్ రావు గారు ఈ ప్రాంతానికి ఒక సందర్భంలో రాగా, ఆ సమయంలో ఆయనకి చాలా ఆకలిగా ఉండటంతో ఈ ప్రాంతంలో ఎక్కడ వెతికిన కూడా ఆహారం లభించలేదట, ఆలా ఆకలితో బాధపడుతున్న ఆయనకి ఒక కోతి హఠాత్తుగా వచ్చి అరటిపండు ఇచ్చి అదృశ్యం అయిందట. అప్పుడు ఆ అరటిపండు తినడంతో చాలా శక్తి రాగ తనకి స్వయంగా ఆ ఆంజనేయస్వామియే కోతి రూపంలో వచ్చి అరటిపండు ఇచ్చి నా ఆకలిని పోగొట్టాడు, ఈ ప్రాంతం చాలా పవిత్రమైనది భావించి భక్తిభావంతో ఆ ఆంజనేయస్వామిని ఇక్కడ ప్రతిష్టించాలని భావించాడట.

ఇక రామాయణంలో, వనవాసంలో ఉన్నప్పుడు అంజనేయస్వామి అరటిపండుని ఇచ్చి శ్రీరాముని ఆకలిని తీర్చాడు. అందుకే ఈ ప్రాంతంలో ఆంజనేయస్వామి రామా, ఇవిగో అరటిపండ్లు అన్నట్లుగా ఉండే ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక ఈ స్వామివారికి ఎదురుగానే ఒక రామాలయాన్ని కూడా నిర్మించారు.

ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, ఇక్కడి రామాలయంలో సీతాదేవి శ్రీరామునికి కుడివైపు ఉంటుంది. ఇలా సీతాదేవి కుడివైపు ఉండటానికి కారణం, అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతారాములకు మార్గమధ్యంలో ఆకలి అవ్వడంతో, వారి ఆకలి బాధని తీర్చేందుకు ఆంజనేయుడు అరటిపండ్లని తెస్తూ రామా అంటూ పిలవడంతో వెళ్లిపోతున్నా సీతారాములు వెనుకకి తిరిగి చూడటంతో సీతాదేవి శ్రీరాముడికి కుడివైపున నిలబడి ఉన్నట్లుంటుందని కొందరు స్థానికుల నమ్మకం గా చెబుతారు. ఇక్కడి ఆంజనేయస్వామి విగ్రహం నాలుగు రోడ్ల కూడలి మధ్యలో ప్రతిష్టించారు. ఈ స్వామి దుష్టగ్రహ పీడల బారినుండి ఎల్లప్పుడూ భక్తులని రక్షిస్తాడని నమ్మకం. ఇలా వెలసిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చాలా అద్భుతంగా జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి వేడుకలు ఆరు రోజుల పాటు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో ఇక్కడికి భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version