శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందింది. ఇక్కడ ఉన్న అమ్మవారిని భవాని అంటారు. ఈ అమ్మవారిని కరవీరవాసిని, అమలాదేవి అని కూడా పిలుస్తారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ పురాణం ఏంటి? అక్కడ ప్రతి సంవత్సరం గర్భాలయంలో అమ్మవారి పైన సూర్య కిరణాలూ పడటానికి గల కారణం ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకలోని హుబ్లీ నుండి మహారాష్ట్రలోని పూణే వరకు ఉన్న రైల్వే మార్గంలో మధ్యగా మీరజ్ అనే జక్షన్ ఉంది. ఇక్కడి నుండి పడమరగా కొన్ని కిలోమీటర్ల దూరంలో కొల్హాపూర్ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో సరస్వతి, మహాకాళి విగ్రహాలున్నాయి. ఒక్కప్పుడు ఈ మహాలక్ష్మి ఆలయం చుట్టూ పక్కల సుమారు 200 పైన చిన్న పెద్ద ఆలయాలు ఉండేవట. భూకంపం కారణంగా అవి నేలమట్టమైపోయాయి. క్రీ.శ. 13 , 14 శతాబ్దాల కాలంలో ఇచటకు దండెత్తి వచ్చిన మహమ్మదీయ రాజులూ మిగిలి ఉన్న వాటిలో చాలా భాగం ద్వాంసం చేసారు. ఈ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం మాత్రం వాటి బారినపడకుండా యధాతధంగా నిలిచి ఉంది. ఇక పురాణానికి వస్తే, శ్రీమహావిష్ణువు వైకుంఠంలో వుండగా భృగుమహర్షి వచ్చాడు. అయితే రుషి రాకను విష్ణువు గమనించలేదు. దీంతో ఆగ్రహం చెందిన భృగువు స్వామివారి ఎదపై కాలుపెట్టారు. దీంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి భూలోకానికి వెళ్లి కొల్హాపూర్ సమీపంలో తపస్సులో మునిగిపోయింది. భృగువు పాదంలో కన్నును లౌక్యంగా తీసివేసిన మహావిష్ణువు రుషి గర్వాన్ని అణచివేశాడు. అనంతరం అమ్మవారి కోసం అన్వేషిస్తూ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడిగా అవతరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అయితే కొల్హాపురంలో వెలసిన అమ్మవారి ప్రాశస్త్యం అందరికి తెలియడంతో క్షేత్రం అందరికి దర్శనకేంద్రంగా మారింది. ఈ ఆలయంలో శ్రీమహాలక్ష్మీదేవి విగ్రహాన్ని అరుదైన శిలపై చెక్కారు. నాలుగు హస్తాలు కలిగి భక్తులను దీవిస్తున్న రూపం మనల్ని ఆకట్టుకుంటుంది. ఫలం, గద, కవచం, పాత్రను నాలుగుచేతుల్లో కలిగివున్న దివ్యమంగళరూపం భక్తులకు ఎల్లప్పుడూ ఆశీర్వచనాలు ఇస్తుంటుంది. ఈ ప్రాంతాన్ని కర్వీర్‌గా వ్యవహస్తారు. ఆ మహాదంపతులకు ఇష్టమైన ప్రదేశం కావడంతో మహాప్రళయంలోనూ చెక్కుచెదరదు. అందుకనే ఈ క్షేత్రాన్ని అవిముక్తేశ్వర క్షేత్రమని పేర్కొంటారు. లోకమాత జగదాంబ ఈ క్షేత్రాన్ని సృష్టించింది. అందుకనే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మహర్షులు, రుషులు పూజలు చేసినట్టు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. అమ్మవారి తపస్సు అనంతరం ఒక్క రాత్రిలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. అయితే కిరణోత్సవం విషయానికి వస్తే, సూర్యదేవుడు అమ్మవారి కటాక్షం కోసం ఏటా మూడురోజులు గర్భాలయంలోకి సూర్యకిరణాలను ప్రసారిస్తాడు. తొలిరోజు పాదాలకు, రెండో రోజు నడుము భాగానికి మూడోరోజు శిరస్సు భాగానికి కిరణాలు ప్రసారిస్తాయి. ఈ ఉత్సవాలను కిరణ్ ఉత్సవ్‌గా వ్యవహరిస్తారు. ఈ దినాల్లో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వేలాదిమంది భక్తులు కొల్హాపూర్‌కు చేరుకుంటారు. ఈ విధంగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పుకునే మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వెలసింది.