Home Unknown facts 600 సంవత్సరాల క్రితం శ్రీలక్ష్మీనరసింహస్వామి వెలసిన అద్భుత ఆలయం

600 సంవత్సరాల క్రితం శ్రీలక్ష్మీనరసింహస్వామి వెలసిన అద్భుత ఆలయం

0

శివుడు మరియు విష్ణువు యొక్క ఆలయాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడి విశేషం ఏంటి అంటే మూలా వాగుకు ఉత్తర ఒడ్డున శైవక్షేత్రం ఉంటె దక్షిణ ఒడ్డున వైష్ణవ క్షేత్రం ఉంది. ఈ వైష్ణవ క్షేత్రంలో శ్రీ కృష్ణుడు ఐదు తలల సర్పం పైన పిల్లనా గ్రోవుతో నాట్యం చేస్తూ భక్తులకి దర్శనం ఇస్తాడు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడి విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

shri krishnuduతెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా, కరీంనగర్ – సిరిసిల్ల కు వెళ్లే రహదారి మార్గం పక్కనే వేములవాడ మండలంలోని నాంపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామము నందు మహిమాన్వితమైన నరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడి మూలవాగుకు ఉత్తర ఒడ్డున వేములవాడ ఉన్నదీ.

ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, ఐదు తలల సర్పాకారం తలపై శ్రీకృష్ణుడి నృత్యరూపం, 52 అడుగుల ఎత్తైన గుట్ట చుట్టూ పచ్చని పంటలు కను చూపు మేర కనువిందుచేసే అందాలు, మనసును ఉల్లాసంగా ఉంచే ప్రకృతి దృశ్యాలు ఎన్నిసార్లు చూసినా తనివి తీరని అద్భుత శిల్పాలు నాంపల్లిగుట్ట సొంతం. నాంపల్లిని పూర్వం నామపల్లిగా పిలిచేవారు. ఆరువందల ఏళ్ల కిందట ఈ గుట్టపై శ్రీలక్ష్మీనర్సింహస్వామి వెలసినట్లు చెబుతారు.

అయితే శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో చోళుల కాలంలోనే స్వామివారికి పూజాదికాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. సహజ సిద్ధంగా ఓ వైపు మూలవాగు మరోవైపు మానేరు వాగులు ప్రవహిస్తుంటాయి. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత లోపల ఉన్న అంజనేయస్వామి రాతి శిల. ఈ హనుమంతుడికి మండల దీక్షలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం.

ఇంకా సిరిసిల్ల రాజన్న జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయానికి దర్శనానికి వచ్చే భక్తులు నాంపల్లిగుట్టకు కూడా వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. కొత్తగా పెళ్లయిన జంటలు సంతానం కలగాలని మొక్కుకుని, కోరిక నెరవేరాక ఇక్కడ వనభోజనాలు చేస్తారు. రాజరాజనరేంద్రుడు, ఆయన సతీమణి కూడా స్వామివారిని సేవించి, సంతానాన్ని పొందినట్లు చారిత్రక కథనాలున్నాయి.

నాంపల్లి గుట్టపై సహజసిద్ధమైన బండరాళ్ల మధ్య గుహలు, రెండు కోనేరులున్నాయి. ఇక ఆలయం పక్కనే ఉన్న చిన్న గుహలో శివలింగంతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకూ పూజలు జరుగుతాయి. క్రీ.శ 10 శతాబ్దంలో నవనాథ సిద్ధులు ఈ గుట్టపై తపస్సు చేసి సిద్ధి పొందారని ప్రతీతి. నిత్యం నవనాథులు ఈ గుహ నుంచి భూగర్భ సొరంగ మార్గంలో వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసే వారని చెబుతారు.

నాంపల్లిగుట్ట ఆసాంతం సింహం నిద్రిస్తున్న తీరులో ఉంటుంది. గుట్ట ఎంత మహిమాన్వితంగా కనిపిస్తుందో ప్రకృతి అందాలతో అంతగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సహజ సిద్ధమైన అందాలతో పాటు కాళీయమర్దనం మరో ప్రత్యేకత. ఐదుతలల సర్పాకారంలో నిర్మించిన నాగదేవత ఆలయం. నాగపాము తలపై శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవితో నృత్యం చేస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఎటు నుంచి చూసినా గుట్టపై చెట్లపొదల్లో చుట్టుకుని పడుకున్న కొండంత పాములా కనిపిస్తుంది. పామునోటిలోనికి వెళ్తుండగా.. శ్రీలక్ష్మీనర్సింహస్వామి లీలలను తెలిపే రకరకాల శిల్పాలు కనువిందు చేస్తాయి. గుట్టపైకి వచ్చిన వారు వీటిని మైమరచి చూస్తూ… నర్సింహుడి ఉగ్రరూపాన్ని, నాగదేవతను దర్శించుకుంటారు. నూనెతో, పాలతో స్వయంగా అభిషేకాలు నిర్వహించుకుంటారు.

ఈ విధంగా ప్రకృతి ఒడిలో వెలసిన ఈ ఆలయాన్ని సందర్శించడానికి ప్రతి ఏటా కొన్ని లక్షల మంది భక్తులు వస్తుంటారు.

Exit mobile version