గడ్డం పెంచుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. టాప్ సెలబ్రిటీల నుంచి కాలేజీ కుర్రాళ్ల వరకు అందరూ ఈ ఫ్యాషన్ ఫాలో అయిపోతున్నారు. అయితే కొంతమందిని గడ్డంతో చూస్తే మ్యాన్లీగా కనిపిస్తారు. చూడగానే భలే మెయింటైన్ చేస్తున్నాడే అనిపిస్తుంది. కానీ కొందరిని చూస్తే వీడి గడ్డమేంట్రా బాబు ఇలా ఉంది అనిపిస్తుంది. దీనికి కారణం గడ్డం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే.
అవును మరి తల వెంట్రుకల మీద పెట్టిన శ్రద్ధ గడ్డంపై ఎక్కడుంటుంది. దాని పాటికి అది పెరుగుతుంది.. దాన్ని ట్రిమ్ చేస్తూ ఉంటారు. కానీ గడ్డం మ్యాన్లీ లుక్ ఇవ్వడానికి అదొక్కటే సరిపోతుందా? కచ్చితంగా చాలదు. అందుకే ఈ చిట్కాలు పాటిస్తే గడ్డం చక్కగా పెరిగి మ్యాన్లీ లుక్ ఇస్తుంది.
గడ్డం పెంచినంత మాత్రాన సరిపోదు.. దాన్ని సరిగ్గా మెయింటైన్ కూడా చేయాలి. అప్పుడే అది మ్యాన్లీ లుక్ ఇస్తుంది. లేదంటే ఏదో గుబురు పెరిగినట్టు ఉంటుంది. రోజూ గడ్డం దువ్వితేనే అది నీట్ గా ఉంటుంది. దీనికోసం గడ్డం దువ్వుకోవడానికే తయారుచేసిన beard comb కొని దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టండి. ఇలా రోజూ గడ్డం దువ్వుకోవడం వల్ల అక్కడి వెంట్రుకలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దానివల్ల బియర్డ్ గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుంది.
ట్రిమ్ చేసుకుంటే గడ్డం పెరుగుతుందని చాలా మంది భావిస్తారు. కానీ అది ఓ అపోహ మాత్రమే. కాబట్టి నిజంగా అవసరమైతేనే తప్ప లేదంటే ట్రిమ్ చేసుకోకుండా ఉండటమే మంచిది. రోజుకి ఒకసారో.. రెండు సార్లో ముఖం శుభ్రం చేసుకుంటాం కదా. అలాగే గడ్డాన్నికూడా శుభ్రం చేసుకోవాలి. సబ్బు, ఫేస్ వాష్ గుబురు గడ్డాన్ని పొడిగా మారిపోయేలా చేస్తాయి. పైగా తలలో డాండ్రఫ్ ఉన్నట్టే.. గడ్డంలోనూ డాండ్రఫ్ పెరగడానికి అవకాశం ఉంది. ఈ చుండ్రును సబ్బు లేదా ఫేస్ వాష్ వదలగొట్టలేదు కాబట్టి.. గడ్డం కోసమే ప్రత్యేకించి తయారుచేసిన బియర్డ్ వాష్ ఉపయోగించాల్సి ఉంటుంది.
శ్రద్ధ చూపకపోతే.. గడ్డం పొడిగా మారుతుంది. ఆపై డాండ్రఫ్ పెరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే.. అప్పుడప్పుడూ కాస్త నూనె రాస్తూ ఉండటం మంచిది. ఇప్పుడు మార్కెట్లో గడ్డం కోసమే కొన్ని గ్రూమింగ్ ప్రొడక్ట్స్ లభిస్తున్నాయి. నూనె వాడటం ఇష్టం లేని వారు వాటిని కూడా ఉపయోగించవచ్చు. ఇవి గడ్డం మీద పెరుగుతున్న వెంట్రుకలకు అవసరమైన పోషణ అంందిస్తుంది.