ఉపవాసం అంటే కొంతమంది మంచినీరు అయిన తాగకుండా ఉంటారు. ఇలా చేస్తే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎసిడిటీ వచ్చి కడుపులో మంట, లో షుగర్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారు. మరికొంతమంది ఉపవాసం చేస్తున్నామని అన్నం తప్ప పళ్లు, పాలు, కూల్ డ్రింక్ లు ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇలా చేయడం కూడా తప్పే. ఉపవాసం అంటే ఆహార పదార్ధాలు తీసుకోవడం పూర్తిగా మానేయాలి. నిమ్మరసం, తేనె కలిపిన నీరు మాత్రమే తాగాలి. ఇలా వారానికి ఒకసారి ఆహారం తినడం మానేస్తే పేగులు, లివరు వంటి జీర్ణావయవాలు విశ్రాంతి తీసుకొని అవి మరింత శక్తి వంతమవుతాయి. అలా అని ఎక్కువ రోజులు ఉపవాసం ఉండకూడదు. ఎందుకంటే.. సాధారణంగా మనం తీసుకున్న ఆహారము అగ్ని పచనం చేసి దహించివేస్తుంది. ఈ విధానంగా ఆహారము అగ్నికి ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఉపవాసము ఉండడం వల్ల అగ్నికి ఆహారం అందదు. దీంతో రక్తంలో పోగైన మలాలు, విషాలను దహింపజేసి వాటిని నిర్మూలిస్తుంది. అలాగే కొన్ని రోజులు జరిగితే రక్తంలో వ్యర్ధాలు లేకపోవడంతో అగ్ని మన శరీరానికి ఉపయోగపడే ధాతువులు కూడా దహించి శరీరాన్ని దెబ్బ తీస్తుంది. కాబట్టి వారానికి ఒకరోజు, లేదా నెలకి ఒకసారి ఉపవాసం ఉండడం మంచిది.