దేవుడు ఎక్కడ వెలసిన ఆ ప్రాంతాన్ని చేరుకోవడానికి ఎంతటి కష్టం ఉన్న భక్తులు అన్ని కష్టాలు దాటుకొని దైవ దర్శనం చేసుకొని వారి భక్తిని చాటుకుంటారు. అయితే మన దేశంలో చాలా ఆలయాలు దట్టమైన అరణ్యంలో, కొండలలో, గుహల్లో ఇలా మానవాళి లేనటువంటి ప్రదేశాలలో దర్శనమిస్తుంటాయి. ఇలా దట్టమైన అరణ్యంలో వెలసిన అమ్మవారి ఆలయ విశేషాల గురించే మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో గల బుట్టాయిగూడెం నుంచి దాదాపు ముఫ్ఫై కిలోమీటర్ల దూరం అడవీమార్గంలో ప్రయాణించిన తరువాత అమ్మవారు కొలువైన గుహ కనిపిస్తుంది. ఈ అమ్మవారిని “గుబ్బల మంగమ్మ తల్లి” గా భక్తులు కొలుస్తుంటారు. కొండజాతికి చెందిన ప్రజలు అడవితల్లి గా ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ గుహ పైభాగం నుంచి నిరంతరం నీరు పడుతూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఎవరికీ తెలియదు. అయితే మోకాళ్ల లోతు నీళ్లలో నడుస్తూ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవలసి ఉంటుంది.
ఈ ఆలయంలోని అమ్మవారిని దగ్గరి నుంచి చూస్తే సర్ప లక్షణాలను కలిగినట్టుగా అనిపిస్తుంది. ఈ సందేహానికి తగినట్టుగానే ఒక సర్పం అమ్మవారి పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటుందని చెబుతుంటారు. అమ్మవారు స్వయంభువు కావడం వలన, ఆ తల్లి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై వుందని భక్తులు విశ్వసిస్తుంటారు. అమ్మవారిని ఆప్యాయంగా సేవిస్తే అడిగిన వరాలను ప్రసాదిస్తుందని చెబుతుంటారు.ఈ ఆలయంలోని అమ్మవారు సంతాన సౌభాగ్యాలను విజయాలను అందిస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి మంగళవారం ఆదివారం రోజున అమ్మవారిని దర్శించుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఇక్కడి వాతావరణం ఒక పెద్ద జాతరను తలపిస్తూ ఉంటుంది. అటు ఖమ్మం జిల్లా నుంచి ఇటు ఉభయగోదావరి జిల్లాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు.
అడవీ ప్రాంతంలో ప్రయాణం అమ్మవారు గుహలో స్వయంభువుగా ఉండటం, సర్పం అమ్మవారిని కనిపెట్టుకుని ఉండటం, గుహలోకి నీరు నిరంతరం వస్తూ ఉండటం వీటికి తోడు అమ్మవారు చూపే మహిమల కారణంగా ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా చెబుతుంటారు. ఆ తల్లి ఆశీస్సులు అందుకుని ఆనందంతో తిరిగి వెళుతుంటారు.
ఇలా దట్టమైన అరణ్యములోని గుహలలో వెలసిన గుబ్బల మంగమ్మ తల్లి భక్తులను చల్లగా చూస్తూ ఇక్కడ కొలువై ఉంది.