ఇక్కడ వెలసిన శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయం సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని ప్రసాదిస్తుందని రోజు రోజుకి ప్రసిద్ధి చెందుతుంది. అయితే పురాతన కాలంలో ఏర్పడిన ఈ ఆలయం రెండు సార్లు పునప్రతిష్టించబడింది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయానికి సంబంధించిన పురాణం ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పచ్చిమగోదావరి జిల్లా, నిడదవోలు మండలం, తిమ్మరాజు పాలెం గ్రామంలో శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం ఉంది. భక్తులకి కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా ఈ అమ్మవారు విలసిల్లుతున్నారు.
పూర్వము 13 వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు పరిపాలించినకాలంలో నిడదవోలుని రాజధానిగా చేసుకొని రాణి రుద్రమదేవి భర్త అయినా వీరబద్ర చాళక్యుడు గోదావరి జిల్లాలోని కొంత భాగాన్ని పరిపాలించారు. వారి కాలంలోనే ఈ కోట నిర్మిచబడిందని చెబుతారు. ఈ కోటకు రక్షణ శక్తిగా శ్రీ కోట సత్తెమ్మ దేవత ఉండేదని ప్రతీతి. కాకతీయ రాజుల పరిపాలనలో నిడదవోలుకి ఎంతో ప్రాముఖ్యత వచ్చింది. అయితే వీరి తరువాత కాలంలో ప్రకృతి భీభత్సలకి కాలగర్భంలో మరుగున పడింది.
ఇది ఇలా ఉంటె 1936 వ సంవత్సరంలో నిడదవోలు శివారు తిమ్మరాజు పాలెం గ్రామ అగ్రహారీకులు శ్రీ దేవులపల్లి రామమూర్తి శాస్రి గారు భూమిలో వ్యవసాయం చేయుటకు నాగళ్ళ కట్టగా నాగలి కర్రకి తగిలి అమ్మవారి ఉనికి తెల్సింది. తదుపరి అమ్మవారు రామమూర్తి శాస్రిగారికి కలలో కనిపించి దేవాలయం నిర్మించమని ఆనతి ఇవ్వడంతో శాస్రిగారు చుట్టూ ప్రక్కల రైతుల సహాయంతో అమ్మవారిని నిలిపి చుట్టూ గోడలతో డాబాగా ఆలయం నిర్మాణం చేసారు. నాటి నుండి నేటివరకు అమ్మవారు శంఖు, చక్ర, గద అభయ హస్తములతో యజ్ఞో పవీతధారిణి అయి మనోహరమైన సుందరరూపంలో దర్శనమిస్తుంది.
ఇక అమ్మవారి ఆలయంలోని సంతాన వృక్షం విషయానికి వస్తే, శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో గర్భాలయానికి నైరుతి వైపున ఉన్న సంతాన వృక్షానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. సంతానం లేని దంపతులు ఈ వృక్షానికి ఊయల కట్టడం సంప్రదాయం. సంతానం లేని దంపతులు ఈ వృక్షం దగ్గరకు చేరుకుని ఎర్రటి వస్త్రం, పూర్తిగా పండిన రెండు అరటిపండ్లను అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం ఒక అరటి పండును, ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దంపతులు సంతాన వృక్షానికి ఊయల కట్టి, ఆ ఊయలలో పండును ఉంచి, అమ్మా పండు కడుతున్నాను పండంటి బిడ్డను ప్రసాదించు తల్లీ అని వేడుకుంటారు. బిడ్డ పుట్టిన తరువాత అమ్మవారి సన్నిధి తీసుకువచ్చి పేరు పెట్టుకోవడంతోపాటు బిడ్డ ఎత్తు తులాభారంతో మొక్కుబడి తీర్చుకుంటారు. తులాభారానికి నగదు నాణేల రూపంలో లేదా పటిక బెల్లం తూకం సమర్పించుకుంటారు.
ఇలా భక్తుల కోరికలు తీర్చే శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఐదురోజులపాటు తిరునాళ్ళ మహోత్సవములు అత్యంత వైభవముగా జరుగుతాయి. ఈ మహోత్సవంలో అమ్మవారికి లక్ష కుంకుమ అర్చన జరుగుతుంది. చివరి రోజు గర గోత్సవం అత్యంత వైభవముగా కన్నుల పండుగగా జరుగుతుంది.