పరశురాముడు శివుడి యొక్క పరమ భక్తుడు. ఇక్కడ తపస్సు చేస్తే పరమాత్మ సాక్షాత్కారం తథ్యమని భావిస్తారు. మరి పరశురాముడు శివలింగాన్ని ఎందుకు పునఃప్రతిష్ఠించాడు? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇంకా ఈ ఆలయంలో విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ కి మూడు కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున యనమలకుదురు అనే గ్రామంలో “మునిగిరి” అని పిలువబడే 612 అడుగుల ఎత్తైన పర్వతంపైనా శివుడు స్వయంభుగా వెలసిన ఆలయమే శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం. తేత్రా యుగంలో శ్రీ రామ చంద్రమూర్తి సీత సమేతుడుగా ఈ స్వామివారిని దర్శించినట్లు స్థల పురాణం చెబుతుంది. ఇక ఆలయ పురాణానికి వస్తే, జమదగ్ని మహర్షి, రేణుకాదేవి దంపతుల సంతానమే పరశురాముడు. పరమేశ్వరుడి పరమభక్తుడైన పరశురాముడు ఆ ముక్కంటి దగ్గరే సకల విద్యలూ నేర్చుకున్నాడు. శివుడి నుంచి శక్తిమంతమైన గొడ్డలిని కానుకగా పొంది పరశురాముడన్న పేరును సార్థకం చేసుకున్నాడు. ఓసారి కార్తవీర్యార్జునుడు అనే రాజు జమదగ్ని ఆశ్రమంలోని మహిమాన్వితమైన గోవును చూశాడు. ఆ గోమాత కరుణతోనే మహర్షి ఎంతమంది అతిథులు వచ్చినా, మృష్టాన్నం వడ్డించేవాడు. దాన్ని తనకు అప్పగించమని కార్తవీర్యార్జునుడు ఒత్తిడి చేశాడు. మహర్షి కాదనడంతో, బలవంతంగా తనతో తీసుకెళ్లాడు. ఆ విషయం తెలిసిన పరశురాముడు వేయి చేతుల కార్తవీర్యార్జునుడిని ఒక్క పెట్టున నేల కూల్చి, గోమాతను వెనక్కి తీసుకొచ్చాడు. ఒకానొక సందర్భంలో అర్ధాంగి మీద ఆగ్రహించిన జమదగ్ని మహర్షి ఆమె తలను తెగనరకమని కన్నకొడుకును ఆదేశించాడు. తండ్రిమాటను శిరసావహించాడా తనయుడు. పితృభక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమని అడిగితే, తల్లి ప్రాణాల్ని తిరిగి ప్రసాదించమని వేడుకున్నాడు పరశురాముడు. అలా తండ్రి మాట జవదాటకుండానే, తల్లి ప్రాణాల్ని కాపాడుకున్నాడు.అయితే కార్తవీర్యార్జునుడి అహంకారం కారణంగా మొత్తం క్షత్రియజాతి మీదే కోపాన్ని పెంచుకున్న పరశురాముడు ఇరవై ఒక్కసార్లు దండెత్తి క్షత్రియుల్ని అంతమొందించాడు. ఆ తర్వాత తాను గెలిచిన భూభాగాన్నంతా కశ్యపుడికి దానంగా ఇచ్చి తపస్సు చేసుకోడానికి వెళ్లాడు. మళ్లీ సీతాస్వయంవర సమయంలో వచ్చి తన ఆరాధ్యదైవమైన శివుడి చాపాన్ని విరిచిన రాముడి మీద ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. తానూ శ్రీరాముడూ వేరుకాదని గ్రహించాక, అహాన్ని త్యజించి అడవిబాట పట్టాడు. తన ఆధ్యాత్మిక యాత్రలో అనేక ప్రాంతాల్లో శివలింగాల్ని ప్రతిష్ఠిస్తూ, త్రిలింగదేశంగా పేరొందిన ఆంధ్ర రాజ్యానికి కూడా వచ్చాడు. స్వయంభూమూర్తిగా వెలసిన పార్వతీరామలింగేశ్వరస్వామిని దర్శించుకుని వేదోక్తంగా పునఃప్రతిష్ఠంచినట్టు స్థానికుల విశ్వాసం. అదే సమయంలో కొండపై నుంచి నదీ ప్రవాహం వరకూ మొత్తం నూటొక్క లింగాలను ప్రతిష్ఠించాడని అంటారు. కాలక్రమంలో అవి భూగర్భంలో కలసిపోయాయి. విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు పూజించిన లింగం కాబట్టి ఇది శివకేశవ క్షేత్రంగానూ ప్రసిద్ధమైంది. ఈ ఆలయంలో సంతానప్రాప్తికై భక్తులు ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారికి నివేదించిన నందిముద్దలు అర్చకస్వాములు ధ్వజస్థంభం వద్ద ఎగురవేయగా ఆ ముద్దా ఎవరి కొంగున పడితే వారికీ సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాడ విశ్వాసం.
ఇంకా ఇక్కడి ఆలయంలో వేయిమంది మునులు తపస్సుచేసిన స్థలము కనుక వెయ్యి మునుల కుదురని పిలిచేవారు. అది రూపాంతరం చెంది యనమలకుదురుగా పిలువబడుచున్నది. శ్రీ రామలింగేశ్వరుడు వాయులింగాకారంలో అష్టముఖ పానవట్టం మీద దర్శనం ఇచ్చుట ఒక ప్రత్యేకతగా చెప్పబడుతుంది.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.