పంచారామ క్షేత్రాలుగా వెలసిన ఆలయాలలో ఇది కూడా ఒక ఆలయంగా చెబుతారు. ఇక్కడి ఆలయంలో విశేషం ఏంటంటే పూర్వము ఇక్కడి శివలింగం పెరుగుతుంటే ఆ శివలింగం పైన మేకు కొట్టారని చరిత్ర చెబుతుంది. మరి ఏ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయంలో గల విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా, సామర్ల కోటకు కొంత దూరంలో భీమవరం లో కుమార భీమారామము అనే క్షేత్రం ఉంది. ఇక్కడ ఆలయం 60 అడుగుల ఎత్తైన రెండంతస్తుల మండపంగా ఉంటుంది. ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధిచెందగా, అమ్మవారు బాలాత్రిపురసుందరి గా పూజలు అందుకుంటోంది. ఈ ఆలయాన్ని 9 వ శతాబ్దంలో చాళుక్య రాజైన భీమా మహారాజు నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ కుమార భీమారామము యొక్క దేవాలయ నిర్మాణం పంచారామాలలో ఒక్కటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయంను పోలివుండును. అక్కడిలానే ఈ దేవాలయం చుట్టు రెండు ఎత్తయిన రెండు ప్రాకారాలను కలిగివున్నది. ప్రాకారాపు గోడలు ఇసుక రాయి చే కట్టబడినవి. వెలుపలి ప్రాకారపు గోడకు నాలుగుదిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలున్నాయి.ప్రదాన ప్రవేశ ద్వారాన్ని సూర్య ద్వారం అంటారు. అయితే ఈ ఆలయాన్ని కూడా ఆయనే నిర్మించడం వలన రెండు ఆలయాలు ఒకేరీతిలో ఉండటమే కాకుండా రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి మరియు నిర్మాణ శైలి కూడా ఒకేవిధంగా ఉంటాయి. స్థల పురాణానికి వస్తే, శ్రీ సుబ్రమణ్యస్వామి వారు తరకాసురుణ్ణి సంహరించగా ఆ రాక్షసుని కంఠంలోని ఆత్మలింగం ఐదుభాగాలుగా ఐదు చోట్ల పడింది. ఆ శివలింగం పడిన ఐదు ప్రాంతాల్ని పంచారామ క్షేత్రాలుగా పిలుస్తారు. అమరావతిలోని అమరేశ్వరాలయం, ద్రాక్షారామంలోని శివక్షేత్రం, కోటిపల్లిలోని సోమారామం, పాలకొల్లులో క్షిరారామం, సామర్లకోటలో ఈ కుమారారామం ఈ ఐదు దివ్యక్షేత్రాలు పంచారామాలుగా పిలవబడుతూ భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకొని ప్రసిద్ధి చెందాయి. గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంటుంది. నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ వుంటుంది. స్వామివారికి ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు కూర్చుని ఉంటాడు. గుడిలో స్వామి వారికి ఎదురుగా మండపంలో వున్న నంది విగ్రహం ఏక శిలచే చెక్కబడివున్నది. ఆలయంలోని మండపం నూరు రాతిస్తంభాలంకలిగి వున్నది. ఆలయంలో రెండో అంతస్తువరకు దాదాపు 14 అడుగులున్న శివ లింగం, సున్నపు రాయి వలె తెల్లగా ఉంటుంది. శివలింగఆధారం క్రింది గదిలో వుండగా,లింగ అగ్రభాగం పై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకు ఉంటుంది. భక్తులు పూజలు,అర్చనలు ఇక్కడే చేస్తారు. ఇక మొదట మొదటి అంతస్తులో వున్న లింగ దర్శనం తరువాత క్రిందవున్న లింగ పాద భాగాన్ని దర్శించుకుంటారు. ఇక్క మరో విశేషం ఏంటంటే, ప్రధాన ఆలయానికి పశ్చిమ దిశలో ఉన్న నూరు స్థంబాల మండపంలో ఏ రెండు స్థంబాలు కూడా ఒకే పోలికతో ఉండవు. అప్పటి శిల్పుల నిర్మాణ చాతుర్యానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చును. ఇంకా ఇక్కడ ఉన్న ఊయలమండపంలోని రాతి ఊయలను ఊపితే ఊగుతుంది. ఇప్పటికి ఈ చిత్రాన్ని మనం చూడవచ్చును. ఇక్కడ మరొక అధ్భూతం ఏంటంటే చైత్ర, వైశాఖ మాసాల్లో సూర్య కిరణాలూ ఉదయంపూట స్వామివారి మీద, సాయంత్రం అమ్మవారి పాదాల మీద పడుతుంటాయి. ఇంతటి విశేషం ఉన్న ఈ ఆలయానికి మహాశివరాత్రి రోజున భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వస్తుంటారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.