ఈ అమ్మవారు విజయనగర రాజుల కుల దైవంగా ఆరాదించబడింది. అయితే ఇక్కడ అమ్మవారి ఆలయానికి ఒక కథ వెలుగులో ఉంది. మరి ఆ పురాణ కథ ఏంటి? ఇక్కడ అమ్మవారు ఎలా వెలిశారు? ఇక్కడి ఆలయ విశేషాలు ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో శ్రీ పైడితల్లి అనే గ్రామదేవత ఆలయం ఉంది. ఈమె విజయనగర రాజుల కుల దేవత. 17 వ శతాబ్దానికి చెందిన పూసపాటి రాజుల కాలంలో ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన ఆలయం. ఇక్కడ వెలసిన అమ్మవారికి ఉత్సవాలు 1758 లో ప్రారంభమై ఇప్పటికి కూడా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. క్రీ.శ. 1757 ధాత నమ సంవత్సరం విజయదశమి సమయంలో విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు. ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటినుండి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి చెందినవారే వంశపారపర్యంగా పూజారులుగా ఉంటున్నారు.
స్థల పురాణానానికి వస్తే, పెద విజయరామరాజు చెల్లెలు పైడిమాంబ, ఈమె పసిప్రాయం నుండి ఆధ్యాత్మిక భావాలతో దేవి ఉపాసన చేసేది, బూస్సికుట్రకు లొంగిపోయిన విజయరామరాజు 1757 లో బొబ్బిలిపైనా యుద్ధం ప్రకటించాడు. అయితే విజయరామరాజు విజయం సాధించినప్పటికీ శత్రువులు కుట్రపన్ని ఆయనను హత్య చేస్తారని అతని సోదరి పైడిమాంబకు దుర్గాదేవి కలలో కనబడి తెలియచేసిన వెంటనే ఈ విషయాన్ని చెప్పేందుకు తానే స్వయంగా పతివాడ అప్పలనాయుడు, మరికొందరు అనుచరులతో బొబ్బిలి బయలుదేరుతుంది.
ఆలా కొద్దిదూరం వెళ్లిన తరువాత వియజయరామరాజు హత్యకు గురైనాడని తెలియగానే ఆమె దుర్గాదేవిని స్మరించి ఆమెలో లీనమైపోతు, తన ప్రతిమ పెద్దచెరువు పశ్చిమభాగంలో లభిస్తుందని, దానిని ప్రతిష్టించి నిత్యం పూజలు, ఉత్సవాలు చేయమని చెప్పినట్లు చరిత్ర చెబుతుంది.
ఆనాటినుండి ఈనాటివరకు ఈ పైడితల్లి ఆంధ్రప్రజల ఆరాధ్యదేవతగా పూజలందుకొంటుంది. ఇక్కడ అమ్మవారి జాతర సందర్భంగా సిరిమానోత్సవం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సిరిమా ఉత్సవం అనేది భక్తి పూర్వకంగా జరుపుకునేది. అయితే ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూర్చొని గుడికి ప్రదిక్షణ చేయడం ఈ ఉత్సవంలో ప్రధాన భాగం. ఇలా ప్రతి సంవత్సరం విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు సిరిమాను ఉత్సవం ఘనంగా జరుగుతుంది.