దేవతలందరూ ఇంద్రునితోనూ అగ్నిహోత్రునితోనూ కలిసి బ్రహ్మదగ్గిరికి వెళ్లి, నువ్వు మాకు శత్రుసంహారదక్షుడైన సేనాధిపతిని అనుగ్రహించావు. కాని అతను ఇంకా పుట్టనేలేదు. పైగా, భగవంతుడైన శివుడు హిమవచ్చిఖరం మీద ఉమాదేవితో కూడా గొప్ప తపస్సు చేస్తున్నాడు. అందుకే ఈ లోకాలను నువ్వే రక్షించాలి అంటూ ప్రార్ధించారు.
అప్పుడు బ్రహ్మ వారిని ఓదార్చి ఉమాదేవి మిమ్ము శపించింది. కనక, మీభార్యలయందు మీకు సంతానం కలగదు. ఉమాదేవి మాట జరిగి తీరుతుంది. అయితే ఆకాశంలో ప్రవహించే గంగానది చూడండి. మీకు సేనాధిపతి కావలసిన మహావీరుణ్ణి అగ్నిహోత్రుడు అకాశ గంగయందు పుట్టించగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ యందు పుట్టించగలడు. గంగ అగ్ని వల్ల తప్పకుండా కుమారుణ్ణి కంటుంది. అని వారికీ చెప్పాడు.
అప్పుడు దేవత లందరూ బ్రహ్మను పూజించి ధాతుశోభితం అయిన కైలాసపర్వతానికి వెళ్లి దేవా ఇది దేవకార్యం. కనుక, ఇది నెరవేర్చు. శైలపుత్రిక అయిన గంగాదేవియందు నువ్వు ధరించి వున్న మహాదేవుని రేతస్సు విడిచి పెట్టు అని కోరారు. వెంటనే అగ్ని గంగదగ్గరికి వెళ్లి దేవీ! నువ్వు గర్భం ధరించు, ఇది దేవతలకు మిక్కిలి ప్రియమైనది అని చెప్పాడు. ఆ మాట విని గంగ చక్కని స్త్రీరూపం ధరించి రాగా అగ్ని ఆ సౌంధర్యం చూసి అన్ని అవయవాలనుంచీ విడిచి గంగ స్రోతస్సులన్నీ శివరేతస్సుతో నింపాడు. కాని అగ్నీ, నే నీ తేజస్సు భరించలేను అంది. అయితే , ఈ హిమవత్పర్వత పాదంమీద గర్భం ఉంచు అని అగ్ని చెప్పాడు.
ఆమాట మీద గంగాదేవి పరమభాస్వరం అయిన గర్భం స్రోతస్సుల నుంచి విడిచిపెట్టింది. గంగ విడిచిన శివరేతస్సు భూమిమీద పడడం వల్ల బంగారమూ, వెండీ, రాగీ, ఉక్కు, తగరమూ, సీసమూ పుట్టాయి. ఆ శ్వేతపర్వతం అంతా రెల్లువనంతో కూడా బంగారం అయిపోయింది. బంగారం అది మొదలు అగ్నిలాగ మెరుస్తూ జాతరూపం అని పేరుపొందింది.
ఇంద్రాది దేవతలు, కుమారుడు పుట్టగానే పాలిచ్చి పెంచడానికి షట్కృత్తికలనూ ఏర్పాటు చేశారు. గర్భ పరిశ్రావంకాగా స్కన్నుడైన బాలుణ్ణి కృత్తికలు స్నానం చేయించారు. అగ్నిహోత్రంలాగ ప్రకాశిస్తున్న ఆ కుమారుడు స్కన్నుడైనాడు కనుక దేవతలు స్కందుడు అని పేరు పెట్టారు. వెంటనే కృత్తికలకు పాలు పుట్టాయి. కుమారుడు ఆరు మొగాలు కలవాడై ఏకకాలంలో ఆరుగురి పాలూ తాగి, సుకుమారదేహుడే అయినా తన అఖండపరాక్రమం వల్ల రాక్షస సేనలనన్నిటినీ జయించాడు. అగ్నిని పురస్కరించుకుని దేవతలందరూ కుమారుణ్ణి దేవసేనాధిపత్యం యిచ్చి అభిషేకించారు.
పుణ్యప్రదమైన కుమారస్వామి జననం ఈ విధంగా జరిగింది. ఇక్ష్వాకు వంశవర్ధనా! కార్తికేయుడైన కుమారస్వామి యెడల భక్తిగల మానవుడు ఇహలోకంలో దీర్ఘాయువూ అష్టైశ్వర్యాలూ అనుభవించి చివరికి స్కందసాలోక్యసిద్ధి పొందుతాడు.