“బాగుండని కార్టూనే నేను ప్రతిరోజూ వేస్తున్నాను. వేసినందుకు విచారిస్తాను. రేపు మంచిది వేద్దామని ఆశపడతాను.”
ఈ మాట ఆర్.కె. లక్ష్మణ్ గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇదొక్కటి చాలు ఆయన ఎన్ని అద్భుతమైన వ్యంగ్య చిత్రాలు గీసిన ఇంకా ఇంకా మంచి కార్టూన్ లు రూపొందించటానికి ఎంత తపన పడతారో చెప్పటానికి.
రాశిపురం కృష్ణ స్వామి అయ్యర్ లక్ష్మణ్. మనకి తెలిసిన పేరుతో చెప్పాలంటే, కార్టూనిస్ట్ లక్ష్మణ్. ( అక్టోబర్ 23 1924 – జనవరి 26 2015 ) ఈయన మైసూర్ లో జన్మించారు. ఈయన తండ్రి ఒక ఉపాధ్యాయుడు. మాల్గుడి కథల సృష్టికర్త అయిన ఆర్కే.నారాయణ్ ఇతని సోదరుడు. కన్నడ వ్యంగ్య పత్రిక కొరవంజిలో ఎలస్త్రెట్ గా కెరీర్ ప్రారంభించి క్రమ క్రమంగా ముంబై నుంచి ప్రచురించే ఇంగ్లీష్ దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో కార్టూూనిస్ట్ గా ఎన్నో వ్యంగ్య చిత్రాలు రూపొందించారు. అసలు ఈయన పేరు చెప్పగానే మనకి ముందు గా గుర్తొచేేది కామన్ మ్యాన్ కారెక్టర్.
బట్టతల, బుర్ర మీసాలు, గళ్ల చొక్కా, దోతి, సాక్స్ లేని బూట్లు, చేతిలో గొడుగు, కళ్లజోడు. ఇది కామన్ మ్యాన్ రూపం. బజారులో, ఆఫీస్ లో , రోడ్డు మీద, బహిరంగ సభ, రాజకీయ రహస్య సమావేశం, అంతరిక్షం ఇలా కామన్ మ్యాన్ ప్రతిచోటా ఉంటాడు. ప్రజల చేత ఎన్నికై ఆ పజలనే ఇబ్బందులు పెడుతూ, ఏమరుస్తున్న రాజకీయ నాయకులను ఈ కామన్ మ్యాన్ తో ఏకిపారేసాడు లక్ష్మణ్. ఇవే కాకుండా బిచ్చ గాళ్లు, రోడ్లపై గుంతలు, ట్రాఫిక్ దిగ్బందాలు ఇలా ప్రతి సమస్యని ఆయన తన కార్టూన్ లలో చూపించారు. మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఈ కామన్ మ్యాన్ అస్సలు మాట్లాడాడు. ఎందుకు అని లక్ష్మణ్ నీ అడిగితే ఆయన చెప్పే సమాధానం, ” బడ్జెట్ మీద కార్టూన్ వేయాలంటే మీ సమీక్ష నేల బారు మనిషి కి చేరాలి ఆర్థిక మంత్రి కి కాదు. కార్టూన్ దృశ్యం. బొమ్మ మాట్లాడాలి, వాక్యం కాదు. వాక్యమే కావాలంటే వ్యాసం రాయి. బొమ్మ అక్కర్లేదు “, అయిన నాకు అల చుపించటమే ఇష్టం అని అంటారాయన. ఈ కామన్ మ్యాన్ కారెక్టర్ ఎంతగా పాపులర్ అంటే ముంబై వర్లీ సముద్ర తీరంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేటంత. మన దేశం లో ఒక కార్టూన్ పాత్ర కి ఒక విగ్రహం వుండటం ఇదే తొలిసారి.
ఇదే కాకుండా ఈయన కి కాకులంటే బాగా ఇష్టం ఎంతలా అంటే నెమలి, చిలుక, పావురాలు కూడా కాకి ముందు దిగదుడుపే అని అంటారాయన. లోకంలో కాకి చాలా తెలివైనది అని ఆయన అభిప్రాయం.
తన శైలి కార్టూన్ లతో సుమారు ఆరు దశబ్ధాలుగా తిరుగు లేని కార్టూన్ సూపర్ స్టార్ గా వెలిగారు. ఆయన కార్టూన్ లతో మూడు పుస్తకాలు, రచనలతో మూడు పుస్తకాలు వచ్చాయి. తన ప్రతిభను ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది.