శివుడి యొక్క వాహనం నందీశ్వరుడు. ప్రతి శివాలయంలో అడుగు పెట్టగానే మనం ముందుగా నందిని దర్శనం చేసుకుంటాం. కొందరు నంది కొమ్ములో నుండి శివుడిని దర్శనం చేసుకుంటే, కొందరు నంది చెవిలో వారి వారి కోరికలను విన్నవించుకుంటారు. ఈ ఆలయ విశేషం ఏంటంటే ఇక్కడి కొండ పడుకున్న నంది ఆకారంలో ఉంటుంది. మరి అతి పురాతన ఆలయమని చెప్పబడే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రం, చిక్కబళ్లాపుర్ జిల్లా, బెంగుళూరు నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో నంది దుర్గ ఉండగా ఇక్కడే భోగనందీశ్వరుని ఆలయం ఉంది. ఇది అతిప్రాచీన పర్వత కోట గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న కొండలు మూడు గ్రామాలను కలుపుతూ విస్తరించి ఉన్నవి. ఒకప్పుడు ఈ నందికొండల గ్రామాన్ని ఆనందగిరి అని పిలిచేవారట.
ఇక్కడి నంది కొండ, కొండమీద ఉన్న ఆలయంలోని శిల్పకళానైపుణ్యం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈవిధంగా పడుకున్న నంది ఆకారంలో ఉన్న కొండపైన కొలువై ఉన్న భోగనందీశ్వరుడని దర్శనం చేసుకోవడానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.