Home Health తన విజయానికి కారకుడైన విఘ్నేశ్వరుని స్వయంగా శంకరుడే ప్రతిష్టించిన క్షేత్రం!!

తన విజయానికి కారకుడైన విఘ్నేశ్వరుని స్వయంగా శంకరుడే ప్రతిష్టించిన క్షేత్రం!!

0

శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు. ఆ స్వామిని తలచుకుంటే చాలు తలపెట్టిన కార్యక్రమం ఏదైనా ఎలాంటి విఘ్నం లేకుండా విజయం సాధిస్తుంది. ఏటా భాద్రపద చవితి నాడు ప్రతి ఇంట్లో పాలవెల్లి కట్టి గణేషుని పూజించి, వీధుల్లో పందిళ్లు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకోవడం ఆనాదిగా వస్తున్న ఆచారం. ఏ కార్యంలోనైనా ప్రథమ పూజలందుకునే వినాయకుడంటే అందరికి ఎంత భక్తిభావమో, తన భక్తుల పట్ల గణపతికి కూడా వల్లమాలిన వాత్సల్యం. ఆ స్వామి రూపం, ఆ స్వామి నామాలు మనకు ఎన్నో విషయాలను ప్రబోధిస్తాయి.
అయితే తన విజయానికి కారకుడైనందుకు స్వయంగా శివుడే వినాయకుడిని ప్రతిష్టించిన ఆలయం గురించి తెలుసుకుందాం…

2-Rahasyavaani-1099శ్రీ వరద వినాయక కథలో గృత్స్నమడుడు తన తల్లిని శపించి, ఆమెచేత ప్రతిశాపమును పొందినట్లు మనకు తెలుసు. “మహా బలపరాక్రమవంతుడు, త్రిలోక కంటకుడు, క్రూర రాక్షసుడు అయిన కుమారుడు జన్మించుగాక” అని ఆమె శాపం. ఇది ఇలా ఉండగా, గ్భతమదుడు అత్యంత భక్తితో విఘ్నేశ్వరుని ధ్యానించి, ఆతనిని ప్రసన్నుని చేసుకున్నాడు.

వినాయకుని వరప్రసాదం వల్ల అతడు మునులలో పరమశ్రేష్టుడైయ్యాడు. ఒకనాడు ఏకాగ్రతతో వినాయకుని జపంలో మునిగి ఉండగా, అతనికి పర్వతాలు సైతం అదిరిపడేటంత పెద్దధ్వనితో ఒక తుమ్ము వచ్చింది. తక్షణమే తన ఎదుట ఒక బాలకుడు కనిపించాడు.

ముని శ్రేషుడు, “నీవు ఎవరు?” అని అడుగగా ఆ బాలకుడు, “నీ తుమ్ములో జన్మించాను. కాబట్టి నీవే నాకు తల్లివి, తండ్రివి” అని జవాబు చెప్పాడు. ఆ బాలకుని మాటలకు ఆశ్చర్యపడిన ముని అతని శక్తియుక్తులకు సంతోషించి, “గణానాంత్వా అనే గణపతి మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ గణపతి మంత్రాన్ని ఆ బాలుడు 5 వేల సంవత్సరాలు జపించాడు. గణపతి సాక్షాత్కరించి, వరాన్ని కోరుకోమన్నాడు.

“మూడు లోకాలలోను నాకు ఎవరూ ఎదురు ఉండరాదు. దేవతలు నాకు వశులై ఉండాలి. నేను దేనిని సంకల్పించినా అది తక్షణమే సిద్దించాలి. ఇహములో సుఖాలనుభవించి పరములో మోక్షాన్ని పొందాలి” అని వరాలను అతడు గణపతిని కోరాడు. గజాననుడు ఆ వరాలను ప్రసాదించాడు.

కామగమనం గల మూడు పురాలను బంగారముతో, వెండితో, ఇనుముతో నిర్మించి అతనికిచ్చాడు. ఆ ప్రాంతాలు ఒక్క శంకరునిచేత తప్ప ఎవరిచేత ఛేదించబడవు. నీకు త్రిపురాసురుడు అనే ఖ్యాతి లభిస్తుంది. శంకరుడు తన ఏకైక బాణంతో ఈ మూడు పురాలను చేదించినప్పడు, నీకు ముక్తి లభిస్తుంది” అని వరాలను అనుగ్రహించాడు.

త్రిపురాసురుడు గజాననుని వల్ల పొందిన శక్తులతో, భూమండలాన్ని అంతా ఆక్రమించాడు. తరువాత అతను దేవలోకంపై దండయాత్రచేసాడు. ఇంద్రుని ఓడించాడు. అమరావతిని తనరాజ్యంగా చేసుకున్నాడు. అక్కడి నుండి, త్రిపురుడు బ్రహ్మలోకం మీదికి దండెత్తి వెళ్ళాడు.

బ్రహ్మ విష్ణువు యొక్క నాభి కమలంలో లీనమైపోయాడు. విష్ణువు కూడ ఆ రాక్షసునికి కనపడకుండా క్షీరసముద్రానికి చేరాడు. ఈ విధంగా అతను బ్రహ్మలోకమును, విష్ణులోకమును (రెండిటిని) ఆక్రమించుకున్నాడు. త్రిపురాసురుడు బ్రహ్మలోకానికి తన పెద్దకుమారుడైన ప్రచండుని, విష్ణులోకానికి తన రెండవ కుమారుడైన చండుని, అధిపతులుగా నియమించాడు.

ఇక శివలోకాన్ని ఆక్రమించుకోవడానికి అతను కైలాసానికి వెళ్ళాడు. శివుడు కూడా కైలాసాన్ని వదలి మంథర పర్వతానికి చేరుకున్నాడు. తరువాత, రసాతలము, సప్త పాతాళ లోకాలు త్రిపురాసురుని వశమయ్యాయి. ఈ కారణంగా సమస్త దేవతలకు నారద మహర్షి గణేశానుగ్రహం పొందటమే సరైన మార్గమని ఉపదేశించాడు. అప్పుడు దేవతలందరు అత్యంత భక్తితో పరిపూర్ణ శరణాగతితో సంకటమోచన గణేశ్వరుని ప్రార్జించారు.

శంకరుడు త్రిపురాసురునిచేతిలో ఓడిపోయాడు. అప్పడు నారదుడు శివునితో, “గణేశుని పూజించి ఆయన అనుగ్రహం పొందక పోవటం చేతనే ఈ పరాజయం నీకు సంభవించింది, కాబట్టి గణేశుని పూజించి, ఆతని అనుగ్రహం సంపాదించుకొండి.” అని చెప్పాడు.

అదికాకుండా వినాయకుడు త్రిపురాసురునికి ఇచ్చిన వరం ప్రకారం, ఆరాక్షసుడు శివునిచేతనే వధించబడుతాడు అని శంకరునికి తెలియచేసాడు.
అప్పడు శంకరుడు ౧౦౦ సంవత్సరాల కాలం ఏకాగ్రతతో గణేశుని గురించి తపస్సు ఆచరించాడు. విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై ఒక బాణాన్నిచ్చి తన సహస్రనామాలను శివునికి ఉపదేశించాడు. శివుడు ఆ సహస్రనామాలను జపించి, త్రిపురాసురునిపై యుద్ధానికి బయలుదేరాడు .
అప్పడు శంకరుడు పృథ్విని రథముగాను, సూర్యచంద్రులను చక్రములుగాను, బ్రహ్మను రథసారథిగాను, వేదాలను గుర్రాలు గాను, మేరువును ధనుస్సుగాను, విష్ణువును బాణంగా చేసుకున్నాడు. శంకరుడు వినాయక – అష్టకాన్ని పఠించి, విఘ్నేనుశ్వరుని అభయం పొంది, విష్ణువు అంశతో కూడిన పాశుపతాస్త్రమును త్రిపురాసురునిపై ప్రయోగించాడు.

ఆ అస్త్రంతో త్రిపురాలు దహించబడగా త్రిపురాసురుడు మరణించాడు. ఆతని శరీరం నుండి ఒక తేజస్సు వెలువడి శంకరునిలో లీనమయింది. ఆ విధంగా త్రిపురాసురుడు మోక్షాన్ని పొందాడు. ఆ రోజు కార్తిక పౌర్ణమి. ఈ విజయానికి కారకుడైన విఘ్నేశ్వరుని స్వయంగా శంకరుడే ఒక క్షేత్రంలో ప్రతిష్టించాడు . ఆ మూర్తియే ఈ మహాగణపతి. ఈ స్థలమే రంజన్ గామ్ .

రంజన్ గామ్ పూణే – అహ్మద్ నగర్ రహదారిలో పూణే నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Exit mobile version