Home Life Style This Post On ‘ఆకలిరాజ్యం’ Compared To Present Situations Proves Nothing Has Changed...

This Post On ‘ఆకలిరాజ్యం’ Compared To Present Situations Proves Nothing Has Changed Over The Years

0

నీ మెదడు నీది కాదు నిన్ను నడిపే వ్యవస్థది, స్వేచ్ఛ నీ హక్కు అంటూనే నిన్ను ఊరకుక్కని చేసి ఉసిగొల్పుతుంది. ఒకవేళ ఇదంతా బానిసత్వం అని నువ్వు పొరపాటున తెల్సుకున్నావో ఇక నీకు మిగిలేది కాలిపోయిన పేగులు, రాలిపోయిన కలలు. అందుకే ఎప్పుడు మనిషిని వాడికి తెలీకుండానే అదుపులో ఉంచుకుంటుంది సమాజం. ఆలా సమాజానికి తలఒడ్డాక విశ్వం అంత ‘ఆకలి ఘోష’ నిండిన యువకుడి కథే ఈ ‘ఆకలిరాజ్యం’

ఆకలిరాజ్యం సినిమా గురించి అద్భుతమైన విశ్లేషణ…

ఆకలిరాజ్యం!

ఈ సినిమా నా టీనేజీ చివర్లో రిలీజైంది. అప్పటి నా నేపధ్యం కూడా చెప్పాలి ఆ సినిమా నా మీద చూపించిన ప్రభావాన్ని వివరించాలంటే. అప్పటికి యూత్ ఐకాన్ గా వున్న కమల్ హాసన్ అంటే ఆరాధన. అప్పుడే నేను ఆరెస్సెస్స్ కి గుడ్ బై చెప్పిన కాలం. (ఆరెస్సెస్స్ తో నా అనుబంధం మరోసారి చెబుతాను). చలాన్ని చదివి వున్నాను. మ్యూజింగ్స్, మైదానం, బ్రాహ్మణీకం వంటి నవలలు చదివి ఏదో లోకంలో ఉన్నట్లుండేవాణ్ని. నా స్నేహబృందంలో అందరికీ చలం అంటే పెద్ద క్రేజ్.

అదే సమయానికి జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ కూడా పరిచయం అయింది. అయితే నా మిగతా ఫ్రెండ్సందరూ జెకె అంటే పెద్ద ఆసక్తి చూపించ లేదు. కానీ నాకు మాత్రం ఆయన ఫిలాసఫీతో పిచ్చ కిక్కెక్కింది. ఆయన జీవితం మీద మేరీ లుటైన్స్ రాసిన రెండు భాగాల బయోగ్రఫీ (కృష్ణమూర్తి – ద ఇయర్స్ ఆఫ్ అవేకెనింగ్, కృష్ణమూర్తి – ద ఇయర్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్) నన్ను మంత్రముగ్దుణ్ని చేసింది. వ్యక్తి స్వాతంత్ర్యం, స్వేచ్చ లేకపోవటం, మానసిక బంధనాలు, భయంకర అభద్రతా భావాలు, ప్రేమ, కుటుంబసంబంధాల పేరుతో మనుషులు ఒకర్నొకరు బానిసలుగా మార్చుకునే తీరు…ఇవన్నీ నాకు జెకె వల్లనే అర్ధం అయ్యాయి అనేదానికంటే ఆలోచింపచేసాయని చెప్పొచ్చు. (ఆ తరువాత కాలంలో ఏం జరిగిందంటే – ఒక చోట చదివాను తనని తాను ఒక అద్దంగా అభివర్ణించుకొన్న జేకే అందులో పాఠకుడు చూసినప్పుడు పాఠకుడు కాక జేకే కనబడితే ఆ అద్దాన్ని పగలగొట్టమన్నాడు. ఎందుకంటే అది దుష్ప్రభావం. అలా కాక ఆ అద్దంలో పాఠకుడే కనబడితే అప్పుడు కూడా ఆ అద్దాన్ని పగలకొట్టమన్నాడాయన. ఎందుకంటే ఇంక జేకే అవసరం లేదు కనుక! ఆ అద్దంలో నాకు నేనే కనిపించాను. అందుకే జేకే అనే అద్దాన్ని అప్పుడే పగలకొట్టాను. మళ్లీ ఆయన జోలికెళ్లలేదు. )

మళ్లీ అప్పటి జీవితం దగ్గరకొస్తాను. జీవితం ఎంత అశాంతికరంగా ఉండేదో అంత ఆసక్తిగానూ కనిపించేది. రోడ్ల మీదకొస్తే గోడల మీద “విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనది” “మీ దోపిడి కొట్టాలకు నిప్పులంటుకున్నాయి. మా ఊపిరితిత్తులతో ఊదిఊది మండిస్తాం” వంటి నినాదాలు కనిపించేవి. ఆర్.ఎస్.యు., పి.డి.ఎస్.యు. వంటి పేర్లు కనిపించేవి కింద. మాదాల రంగారావు వంతి వారు “ఎర్రమల్లెలు”. “యువతరం కదిలింది”, “విప్లవశంఖం” వంటి ఉద్రేకపూర్వక సందేశాత్మక సినిమాలు తీసేవారు. ఆ సమయానికి శ్రీశ్రీ అంటే గొప్ప సినిమా పాటల రచయిత, మహాప్రస్థానం అనే గొప్ప పుస్తకమేదో రాసాడని తెలుసు. ఆయన రాసిన “ఎవరివో నీవెవరివో”, “బొమ్మని చేసి ప్రాణము పోసి” వంటి గొప్ప పాటలు అనేకం విన్నాను. కానీ ఆయన కవిత్వం పెద్దగా తెలియదు. కవిత్వం చదివే అలవాటు లేదు. ఎక్కేది కాదు. ఆంధ్రజ్యోతిలోనో మరో పత్రికలోనో ఆయన ప్రశ్నలు జవాబులు వచ్చేవి.

సరిగ్గా ఆ సమయంలోనే ఆకలి రాజ్యం సినిమా వచ్చింది. కమల్, శ్రీదేవి అంటే ఉన్న క్రేజ్ కారణంగా ఆ సినిమా చూసాను. అయితే ఆ సినిమాలో నాకు కమల్ కన్నా, శ్రీదేవి కన్నా శ్రీశ్రీ అన్న పేరే అత్యంత ఎక్కువగా ఆకర్షించింది. అంతకు మునుపు శ్రీశ్రీ కవిత్వ కోట్స్ చదవక పోలేదు. కానీ ఆ సినిమాలో హీరో పాత్ర ద్వారా శ్రీశ్రీ బాగా దగ్గరయ్యాడు. ఆ సినిమాలో కమల్ నోట “పోనీ పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్” అన్న కవిత వినగానే చెప్పలేని ఉద్వేగం నన్నావరించింది. ఎక్కడో నన్నే అడ్రెస్ చేసినట్లనిపించింది. నా బోటి ఒక మనిషి తన ఆత్మఘోషని చెబుతున్నట్లనిపించింది శ్రీశ్రీ కవిత్వం వింటూంటే. ఆ మరుసటి రోజే మహాప్రస్థానం కొని చదివాను. అదేం కవిత్వమండి? అదసలు కవిత్వమా? దగాపడ్డ మనుషుల ఆత్మఘోషా? అది భాషా లేక ఉద్విగ్న అగ్ని ప్రవాహమా? కోటానుకోట్ల మంది మాట్లాడుతున్న శబ్దమది. (అఫ్ కోర్స్ ఇంత క్లారిటీ అప్పుడు లేదనుకోండి). శ్రీశ్రీ పూర్తిగా అర్ధం కాకపోయినా ఫిదా అయిపోయాను. ఆ సినిమా మళ్ళీ చూసాను. మళ్ళీ మళ్ళీ చూసాను. నచ్చటం అనేది చాలా చిన్న మాట. అదేదో పెనవేసుకుపోయాను. అదేదో అశాంతి. అప్పటివరకు నేను చూసిన జీవితం మీద గత రెండు మూడు సంవత్సరాల నుండి ఏవగింపు. స్థిమితంగా వుండలేనితనం. ఏదో చిరాకు. అది నా అస్తిత్వానికి సంబంధించిన అశాంతి అన్న ఎరుక లేని పరిస్థితి. విపరీతమైన మూడ్ స్వింగ్ వుండేది. శ్రీశ్రీ కవిత్వమే నాలో అశాంతిని పెంచింది, నాకు శాంతిని కూడా కల్పించింది. అందులో హీరో తనకి సమస్య వచ్చిన ప్రతిసారి, ఘర్షణ ఏర్పడిన ప్రతిసారి శ్రీశ్రీ కవిత్వాన్ని మననం చేసుకుంటాడు. జీవితాన్ని అర్ధం చేసుకోవటంలో, నిలదొక్కుకోవటంలో కళలు, కవిత్వం ఎటువంటి పాత్ర పోషిస్తాయో ఆ సినిమా చెబుతుంది. అందులో మనం ఐడెంటిఫై అయ్యే ఎన్నో సన్నివేశాలున్నాయి. రోడ్డు ప్రమాదంలో మూగ కళాకారుడు మరణించినప్పుడు “కూటి కోసం కూలి కోసం” అన్న పాట వస్తుంది. శ్రీదేవి కమల్ ని వెతుకుతున్నప్పుడు “ఓ మహాత్మా! ఓ మహర్షి” అన్న పాట వస్తుంది. భార్య చేత వ్యభిచారం చేయించే వాడిని చూసి కమల్ “పతితులారా భ్రష్టులారా” అన్నప్పుడు ఎక్కడో తాకుతుంది. శ్రీదేవిని తండ్రి ఎక్స్ప్లాయిట్ చేసిన తీరు కదిలిస్తుంది. ఆ పాత్రధారి కృష్ణారావు (గొప్ప మరాఠీ నాటక కళాకారుడు) అద్భుతంగా చేసారా పాత్రని. అన్నీ కష్టాలే, ఘర్షణలే ఆ సినిమాలో! కానీ ఎక్కడో ఓ భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. అందుకే కదలకుండా చూసాం. అన్ని సార్లు చూడగలిగాం.

ఇప్పుడేది ఆ ఘర్షణ? అంతా పలాయనవాదమే! స్పందించే సున్నితత్వమే చచ్చిపోయింది. మనిషి లొంగిపోయాడు. దుర్మార్గాలకి సాష్ఠాంగ పడ్డాడు. పడగ్గదుల్లోకి దూసుకొచ్చిన ఇంపీరియలిజానికి బానిసయ్యాడు. దేహాన్ని వినిమయవాదానికి దాసోహం చేసాడు. మనసుని వస్తుజాలానికి అంకితమిచ్చాడు. మనిషి లేడండీ! మనిషి ఏదో నల్లబిలంలో తప్పిపోయాడు. మీకెక్కడైనా కనబడ్డాడా?

– Aranya Krishna

కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని…

ఏది తెలుపు ఏది నలుపు
ఏది గానం ఏది మౌనం
ఏది నాది ఏది నీది
ఏది నీతి ఏది నేతి
నిన్న స్వప్నం నేటి సత్యం
నేటి ఖేదం రేపు రాగం

ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.- శ్రీ శ్రీ

ఎలాగోలా బతకాలనుకుంటే ఎలాగైనా బతకొచ్చు కానీ ఇలాగే బతకాలి అనుకున్నాను అది వీలు పడదు ఈ దేశంలో…

Exit mobile version