Home Unknown facts శివుడు ఇసుకతో ఒక కుండను తయారుచేసి అందులో అమృతబిందువు పడేట్లు ఎందుకు చేసాడు?

శివుడు ఇసుకతో ఒక కుండను తయారుచేసి అందులో అమృతబిందువు పడేట్లు ఎందుకు చేసాడు?

0

పరమశివుడు ఇక్కడ లింగరూపంలో స్వయంభువుగా వెలిసాడు. అయితే ఈ శివలింగానికి విశేషము ఏంటంటే ఈ ప్రాంతంలో అమృతపు చుక్క జారి పడుతుంటే శివుడు ఆ అమృతాన్ని ఒక కుండలో పడేలా చేసి, ఆ కుండలోని స్వయంభువుగా వెలిశాడని స్థలపురాణం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఇక్కడి శివలింగం ఎడమవైపు కొంచెం వంగినట్లుగా ఉంటుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆ శివలింగం ఎందుకు అలా ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

amruthabindhuvuతమిళనాడు రాష్ట్రం, కుంభకోణంలో శ్రీ ఆది కుంభేశ్వరాలయం ఉంది. కుంభకోణంలో గల శివాలయాలలో ఇది అత్యంత ప్రాచీన ఆలయంగా చెబుతారు. అయితే కావేరినది అరసలార్ నదుల మధ్య ఈ క్షేత్రం ఉంది. శైవులకు అతి ముఖ్యమైన దేవాలయాలలో శ్రీ ఆది కుంభేశ్వరాలయం ఒకటిగా చెబుతారు.

ఈ ఆలయ విషయానికి వస్తే, మూడు పెద్ద ప్రాకారాలు, మూడు గోపురాలు ఉన్నాయి. తూర్పు గోపురమునకు తొమ్మిది అంతస్తులు ఉంటాయి. దీని ఎత్తు 128 అడుగులు. ఇక్కడి శివలింగం పేరు ఆది కుంభేశ్వర లింగం. అమ్మవారు మంగళంబికాదేవి. దీనిని 51 శక్తి పీఠాలలో ఒకటిగా భక్తులు చెబుతారు.

ఇది ఒక బ్రహ్మాండమైన శివాలయం. సుమారు 350 అడుగుల పొడవు, 156 అడుగుల వెడల్పు, 10 అంతస్థుల ఎత్తైన గోపురంతో వెలుగొందుచున్నది. ఈ ఆలయానికి కుంభకోణం అనే పేరు రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడి శివలింగం పైభాగాన ఎడమవైపుకు కొంచెం వంగి ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే దీనిని కుంభకోణం అంటారు. కుంభం అంటే కుండ, కోణం అంటే వంపు.

ఇక ఆలయ పురాణానికి వస్తే, గరుత్మంతుడు అమృతబాండం తీసుకొని వెళుతుండగా, ఇక్కడ ఒక అమృతపు చుక్క జారి పడిపోతుంటే శివుడు స్వయంగా అక్కడి ఇసుకతో ఒక కుండను తయారుచేసి అందులో అమృతబిందువు పడేట్లు చేసాడట. ఆ తరువాత తానే ఆ కుండలో స్వయంభులింగంగా ఉండిపోయాడట. అది తయారుచేస్తునప్పుడు పైన ఎడమవైపు కొంచెం వంగినట్లు వచ్చిందట. అందుకే కుంభకోణం అని పేరు వచ్చినదని చెబుతారు. ఈ ఆలయాన్ని కాశి విశ్వనాథాలయం అని కూడా అంటారు.

ఈ ఆలయంలో కాశీవిశ్వనాథుడు మూలవిరాట్టు. రావణుడు సీతను అపహరించిన తరువాత శ్రీరాముడు సతి వియోగ దుఃఖముతో ఈ ఆలయానికి వచ్చి కాశీవిశ్వేశ్వరుని ఆరాధించాడు. ఈశ్వరుని కరుణతో ఈశ్వరాంశ సంభూతమైన రుద్రాంశను తన రుద్రాంశ వల్లనే రావణుని రాముడు యుద్ధంలో గెలవగలిగాడని చెబుతారు.

ఈ ఆలయంలో నవరాత్రి మండపంలో 27 నక్షత్రాలు, ద్వాదశ రాశి చిత్రాలు, నవగ్రహాలు, నల్లరాతి స్థంభంపైన శిల్పీకరించి ఉండి, చూపురులకు సంభ్రమం కలిగిస్తాయి. ఇంకా ఈ ఆలయంలోని శివలింగానికి సుగంధ ద్రవ్యాలలేపనం తప్ప నిత్యాభిషేకాలు జరగవని చెబుతారు.

ఇలా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివాలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తూ స్వామివారిని దర్శించుకుంటారు.

Exit mobile version