మన దేశంలో ఎన్నో గుహలు ఉన్నాయి. అయితే ఎక్కువగా జైన మతానికి చెందిన వారే పూర్వం గుహలలో ఉండే వారని చెబుతారు. ఈ బాదామి గుహలు హిందూ, జైన మరియు బౌద్ధులకు చెందిన గుహాలయాల సముదాయం అని చెబుతారు. మరి రాతి గుహాలని కూడా పిలిచే ఈ బాదామి గుహల గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.కర్ణాటక రాష్ట్రము, బగల్ కోట్ జిల్లాలో బాదామి అనే ఊరు ఉంది. దీనినే కొంతమంది వాతాపి అని కూడా అంటారు. ఇది క్రీ.శ. 540 నుండి 757 ప్రాంతంలో పరిపాలించిన చాళుక్యుల రాజధాని నగరంగా అభివృద్ధి చెందినది. బాదామి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాతి గుహాలకి, గుహాలయాలకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న ఎర్ర కొండలు ఎవరో మలిచినట్లుగా ఎంతో అందంగా ఉంటాయి. పూర్వము ఈ ప్రాంతానికి వాతాపి అని పేరు రావడం వెనుక రామాయణ కాలంలో అగస్త్య మహామునితో కూడిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షస అన్నదమ్ములు ఇక్కడ ఉండేవారు. వాళ్ళు ఆ దారిన పోయేవారిని చాకచక్యంగా ఒక పద్దతిలో చంపుతూ ఉండేవారు. వారిద్దరూ బాటసారులని విందుకి పిలిచేవారు. పెద్దవాడైన ఇల్వలుడు, వాతాపిని మాంసంగా వండి వారికీ వడ్డించేవాడు. తిన్న తరువాత ఆ అతిధి పొట్టని చీల్చుకొని వాతాపి బయటకి రావడంతో అతడు చనిపోయేవాడు. ఈ విధంగా ప్రజల్ని మాయతో చంపుతూ ఉండేవారు. ఒకనాడు ఆ మార్గాన వస్తున్న అగస్త్య మునిని కూడా ఇలాగె మాయ చేద్దాం అనుకుంటారు. అది గమనించిన ఆ ముని ఏమి మాట్లాడకుండా వారు పెట్టిన ఆహారాన్ని భుజించి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అనెను. ఆ తరువాత ఇల్వలుడు ఎన్ని సార్లు పిలిచినా వాతాపి రాలేదు. అయితే బాదామిలో ఇప్పటికి రెండు కొండల్ని వాతాపి, ఇల్వలుడు అని వారి గుర్తుగా పిలుస్తారు. బాదామి లో ప్రముఖంగా చెప్పుకోవలసినది గుహాలయాలు. నాల్గు అంతస్తులుగా ఉండే ఈ గుహాలయంలో చాళుక్యుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యాన్ని చూడవచ్చు. అందులో మొదటి మూడు గుహాలయాలను హిందూ దేవతల కోసం, మిగిలిన గుహాలయం జైనుల కోసం నిర్మించినారు.నటరాజస్వామి, మహిషాసుర మర్దని, గణపతి, నెమలి వాహనంపై కుమారస్వామి, విష్ణుమూర్తి శిల్పాలు మనోహరంగా ఉంటాయి. జైనమతానికి చెందిన ప్రసిద్ధ వ్యక్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. జైన తీర్థంకరులు ఇక్కడ నివసించారని చెబుతారు . విశాలమైన గుహలు, ఆలయాలతోపాటు పెద్ద సరోవరం ఉన్న అందమైన ప్రదేశం ఇది. ఇక్కడ మొత్తం నాలుగు గుహ లు ఉంటాయి. అందులో మొదటి గుహాలయం అన్నింటికంటే ప్రాచీనమైనది. ఇది అయిదవ శతాబ్దంలో నిర్మించబడింది. దీనిలో శివుడిని అర్ధనారీశ్వర, హరి హర అవతారాలలో చెక్కారు. నాట్యం చేస్తున్న నటరాజుగా కూడా చూపారు. శివుడికి కుడిభాగంలో హరిహర అవతారం, ఎడమ భాగంలో విష్ణు మూర్తి అవతారం చెక్కబడ్డాయి. దీనిలో మహిషాసుర మర్దిని, గణపతి, శివలింగం , షణ్ముఖ శిల్పాల చెక్కడాలు కూడా చూడవచ్చు.రెండవ గుహాలయం:ఇది పూర్తిగా విష్ణుమూర్తి చెక్కడాలతో ఉంటుంది. వరాహ, త్రివిక్రమ అవతారాలలో చూపబడింది. విష్ణుమూర్తి, గరుడ అవతారాలు దేవాలయ పై భాగాన చూడవచ్చు. మూడవ గుహాలయం:100 అడుగుల లోతు ఉన్న మూడవ గుహ దేవాలయంలో విష్ణుమూర్తి త్రివిక్రమ, నరసింహ అవతారాలలో కనపడతాడు. ఇంతేకాక పర్యాటకులు అదనంగా శివ పార్వతుల కళ్యాణ చిత్రాలు కూడా చూడవచ్చు. నాలుగవ గుహాలయం:నాలుగవ గుహ దేవాలయం పూర్తిగా జైనులకు సంబంధించినది. మహావీరుడు కూర్చుని ఉన్న భంగిమలో, తీర్థంకరుడు పార్శ్వనాధుడు చిత్రీకరించబడ్డాయి.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ గుహలను చూడటానికి అనేక ప్రాంతాల నుండి సందర్శకులు తరలి వస్తుంటారు.