కరోనా కాలంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా అనుమానిస్తున్నారు. ఇక పాలిచ్చే తల్లుల్లో లెక్కలేనన్ని భయాలు, అనుమానాలకు తెరలేపింది. నిజానికి తల్లి పాలు బిడ్డకు అమృతసమానం. కానీ బిడ్డకు వెలకట్టలేని పోషకాలను అందించే తల్లిపాల చుట్టూ ఇప్పుడు బోలెడన్ని అపోహలు అలుముకున్నాయి. మరీ ముఖ్యంగా కొవిడ్ సోకిన మహిళల్లో పాల ద్వారా బిడ్డకు ఇన్‌ఫెక్షన్ సోకుతుందేమోననే భయాలు ఎక్కువ.
గర్భిణులు, పాలిచ్చే తల్లులకు కూడా వ్యాక్సిన్ అనుమతి లభించినా, బిడ్డకు పాలిస్తున్నంత కాలం వ్యాక్సిన్‌కు దూరంగా ఉండడమే మేలనే ఆలోచనతో ఉంటున్నారు. నిజానికి గర్భిణిగా ఉన్న సమయంలో వ్యాక్సిన్ తీసుకోగలిగితే, ప్రసవ సమయానికి కొవిడ్ సోకే పరిస్థితి తప్పుతుంది. కొవిడ్ ఇన్‌ఫెక్షన్ సోకడం మూలంగా శరీరంలో తయారయ్యే యాంటీబాడీల కంటే వ్యాక్సిన్‌తో తయారయ్యే యాంటీబాడీల మోతాదు ఎక్కువ.
గర్భిణులూ, పాలిచ్చే తల్లులూ కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌కు మినహాయింపు కాదు. అయితే కొవిడ్ సోకినంత మాత్రాన బిడ్డకు పాలివ్వకూడదనే నియమం లేదు. వెంటిలేటర్ మీద ఉన్న తల్లులు మినహా కొవిడ్ సోకిన తల్లులందరూ బిడ్డకు పాలివ్వవచ్చు. కొవిడ్ లక్షణాలు తగ్గిపోయి, కోలుకుంటున్న తల్లులందరూ బిడ్డలకు నిక్షేపంగా పాలివ్వవచ్చు. గర్భిణులు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు, ప్లాసెంటా ద్వారా గర్భంలోని బిడ్డకు ఇవి చేరుకుంటాయి. పాలిచ్చే తల్లుల్లో చనుపాల ద్వారా ఇవి బిడ్డకు అందుతాయి.
కాబట్టి గర్భిణులు, పాలిచ్చే తల్లులూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. అయితే పాలిచ్చే సమయంలో తల్లులు మూడు పొరల మాస్క్ లేదా ఎన్95 మాస్క్ ధరించాలి. చేతులను 60% ఆల్కహాల్ కలిగిన శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. పసిబిడ్డకు అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతమే ‘అమ్మ పాలు’. సహజ సిద్ధమైన మొదటి వ్యాక్సిన్‌గా పరిగణించే తల్లిపాలు, శిశువులోని అన్ని అవయవాలతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడడంలోనూ ప్రముఖపాత్ర పోషిస్తాయని పరిశోధనలు వెల్లడించాయి.
జీవిత కాలానికి సరిపడే వ్యాధి నిరోధకశక్తిని పెంచే గ్లోబ్యులిన్ అనే ప్రోటిన్ తల్లిపాలలో అధికంగా ఉండగా, అమ్మపాలు బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి. ఎలర్జీ, ఆస్తమా ఇతరత్రా అనారోగ్యాలు రాకుండా అడ్డుకునే తల్లిపాలు ఇకపై కొవిడ్ మహమ్మారిని కూడా నిరోధించగలవని కొత్త అధ్యయనంలో తేలింది. పిల్లలకు పాలిచ్చే మహిళలు కొవిడ్ బారిన పడి కోలుకుంటే, వారి పాలలో 10 నెలల వరకు ప్రతిరోధకాలను స్రవిస్తూనే ఉంటాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది.
తల్లి పాలలో ప్రధాన యాంటీబాడీ ఇమ్యునో గ్లోబ్యులిన్ A (IgA) కాగా ఇది పిల్లల శ్వాసకోశ, పేగు మార్గాల లైనింగ్‌కు అంటుకుని, వైరస్, బ్యాక్టీరియాలు వారి శరీరంలోకి రాకుండా అడ్డుకుంటుందని తెలిసిన విషయమే. అయితే కొవిడ్ విషయంలో ‘తల్లిపాలు’ ఎలా పనిచేస్తాయనే విషయంలో ఇటీవలే ఓ అధ్యయనం చేపట్టారు. అధ్యయనం కోసం కొవిడ్ నుంచి కోలుకున్న 75 మంది మహిళల రొమ్ము పాల నమూనాలను విశ్లేషించారు. వాళ్లు 88 శాతం IgA యాంటీబాడీస్ కలిగి ఉన్నట్లు కనుగొన్నారు.
అంతేకాదు టీకాలు వేసిన మహిళలకు, వారి పాలలో వైరస్-స్పెసిఫిక్ యాంటిబాడీలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. పిల్లలకు ఆయా తల్లులు ఇప్పటికే పాలను పట్టిస్తుంటే, ఆ చిన్నారులకు ఆ ప్రతిరోధకాలను అందిస్తున్నట్లే. ఇది నమ్మశక్యం కాని చికిత్స కావచ్చు కానీ వాస్తవంగా కొవిడ్‌ను ఇవి అడ్డుకోగలవు. ఈ ప్రతిరోధకాలు శిశువులకు రోగనిరోధక శక్తిని అందించడంతో పాటు ఈ యాంటీబాడీలను తీవ్రమైన కొవిడ్ ఉన్న వ్యక్తులకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.
అయితే కొవిడ్ ఇన్‌ఫెక్షన్ చికిత్సలో తల్లి పాల నుంచి పొందిన IgA వ్యాల్యును తనిఖీ చేయడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం. కాబట్టి పాలిచ్చే తల్లులకి కరోనా సోకితే ‘బిడ్డకి పాలు ఇవ్వడం ఎలా?’ అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కరోనా సోకినప్పటికీ ఎలాంటి భయం లేకుండా బిడ్డకు పాలివ్వొచ్చు. అంతేకాదు కరోనా తీవ్రత ఎక్కువ ఉన్నవాళ్లకి ట్రీట్మెంట్లో తల్లి పాలలోని ఈ యాంటీబాడీలు పనికొస్తాయట కూడా. ఆ పాలలో దాదాపు పది నెలలు యాంటీ బాడీలు తయారవుతూనే ఉంటాయి.