Home Health ఆర్టిఫిషల్ నవ్వులు ఆరోగ్యానికి చేటు!

ఆర్టిఫిషల్ నవ్వులు ఆరోగ్యానికి చేటు!

0
laugh its good for health

నవ్వడానికేమి ఖరీదు లేదు. కావాల్సినంత సేపు హాయిగా నవ్వుకోవచ్చు. నవ్వు నాలుగు విధాల చేటు అని పెద్దలు అంటారు. కానీ నవ్వు నలభై విధాల గ్రేట్ అని ఇప్పటి వారు అంటున్నారు. నిజమే నవ్వడం కూడా ఒక మంచి అలవాటే. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు నవ్వు పలు విధాలా తోడ్పడుతుంది. సుదీర్ఘకాల ఆరోగ్యకరమైన జీవితానికి నవ్వు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇతరులతో స్నేహ పూర్వక వాతావరణాన్ని కలిగించడంలో నవ్వు కీలకంగా పనిచేస్తుంది.

ఎన్ని బాధలున్నా కొద్దిగా చిరునవ్వు నవ్వితే.. వచ్చే ఆ ప్రశాంతత అంతా ఇంతా కాదు. ఒత్తిడిలో ఉన్నప్పుడు కాస్త నవ్వితే.. ఆ ఒత్తిడిని జయించవచ్చంటున్నారు వైద్యులు. అంతేకాదు.. ఒత్తిడి కారణంగా వచ్చే బీపీ, హైపర్ టెన్షన్, గుండె సంబంధింత సమస్యలను సులువుగా ఎదుర్కొనవచ్చని చెబుతున్నారు. మొత్తానికి నవ్వడం ద్వారా ఇన్ని రకాల ఆరోగ్యసమస్యలను ఎదుర్కొనవచ్చన్నమాట. అది కూడా ఉచితంగానే.

నవ్వు అనేది ఆరోగ్యకరమైన వ్యాయామం. బ్లడ్ ప్రెషర్ ను తగ్గించడంలో నవ్వు ప్రధాన పాత్ర పోషిస్తుంది. నవ్వు వల్ల విడుదలయ్యే ఎండోర్ఫిన్స్ వల్ల మూడ్ లిఫ్ట్ అవుతుంది. నవ్వడం వల్ల హాయిగా ఉంటాం. పని చురుగ్గా చేసుకోగలుగుతాం. తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. ఇంటర్నెట్ లో హాయిగా నవ్వుతున్న చిన్నపిల్లల ఫొటోస్, ముద్దు ముద్దు జంతువుల ఫొటోస్ చూడడం వల్ల ఆనందంగా ఉంటుంది.

వ్యక్తుల మధ్య నమ్మకాన్ని పెంపొందించడానికి నవ్వు ఉపయోగపడుతుంది. మనిషి సంఘజీవి. నవ్వు వల్ల సంఘంతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆనందం వెల్లివిరుస్తుంది. నమ్మకం పెంపొందించబడుతుంది. నవ్వు వల్ల మనుషుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. దానివల్ల స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. ఇతరుల ఆలోచనలకూ గౌరవం ఇవ్వడం వల్ల వారేం అనుకుంటున్నారు అనే దానిపై దృష్టి సారించగలుగుతాము.

హాయిగా నవ్వడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. మల్టీ టాస్క్ కూడా చేయగల శక్తి లభిస్తుంది. మన అంతఃచేతనంపై అలాగే గ్రహణశక్తిపై కంట్రోల్ లభిస్తుంది. మనం నవ్వగానే ఇతరులు కూడా నవ్వేస్తారు. ఒకరినుంచి ఒకరికి నవ్వు సులభంగా సంక్రమిస్తుంది. మనఃస్పూర్తిగా నవ్వే నవ్వు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. నవ్వు ఆకర్షిస్తుంది. నవ్వుతూ ఉండే ఆడవారికే పురుషులు ఎక్కువగా ఆకర్షింపబడతారు. ఆత్మవిశ్వాసం, ధీమా కలిగిన నవ్వు గెలుపుకి సోపానం. వీటి వల్ల డబ్బు సులభంగా సంపాదించవచ్చు.

ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు నవ్వని వారికంటే 7 ఏళ్ళు ఎక్కువగా జీవిస్తారట. అందుకే.. నవ్వడం ఓ భోగం.. నవ్వించడం ఓ యోగం.. నవ్వకపోవడం రోగం అని అంటారు. అలా అని ఊరికే నవ్వితే పిచ్చివారి కింద ట్రీట్ చేస్తుంది సమాజం. కానీ ప్రస్తుత బిజీ లైఫ్‌లో నవ్వుతూ గడపడమనేది కష్టంగా మారిపోయింది. ఇంట్లో, ఆఫీస్‌లో ఎన్నో టెన్షన్స్‌తో జీవితం గడిపేస్తున్నారు. దీంతో ఎన్నో రకాల ఆరోగ్యసమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. నిజాయితీ లేని నవ్వుని ఇట్టే గుర్తుపట్టేస్తారు.

పబ్లిక్ సర్వీస్ లో జాబ్ చేసేవారు 24 గంటలు ముఖంపై చిరునవ్వు చెదరకుండా మెయింటెన్ చేస్తుంటారు. వారి ఉద్యోగం లో అది ఒక అతి ముఖ్యమైన అంశం. కస్టమర్ చెప్పింది చాలా ప్రశాంతంగా వింటూ వారి సమస్య కు చిరునవ్వుతో సమాధానం ఇస్తుంటారు. కస్టమర్ కోపగించుకున్న కూడా వారు నిగ్రహం కోల్పోకుండా బాలన్స్ చేసుకుంటారు. ముఖం మీద నవ్వు మాత్రం పోదు. కానీ అది వారి హెల్త్ కి ఏమాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేయడం వలన వారి జీవన విధానం పూర్తిగా మారిపోతుంది అని తెలియ చేస్తున్నారు.

నవ్వుకి ఖరీదు లేదు. ఫేక్ స్మైల్ తో కొన్ని కండరాలు మాత్రమే ముడిపడి ఉంటాయి. అలా ముఖానికి నవ్వు అంటుకున్నట్టు నవ్వే నవ్వు వల్ల ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఆక్యుపేషనల్ హెల్త్ సైకాలజీ అనే జర్నల్లో ఈ విషయం తెలియజేశారు. నకిలీ నవ్వు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలియచేసారు. వర్క్ కోసం ఫేక్ నవ్వు నవ్వే వాళ్ళు, తమ వ్యక్తిగత భావాలు మనసులోనే దాచి పెట్టేస్తారు అని దీని వల్ల మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది అని తెలియ చేస్తున్నారు. ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి వాళ్లు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం మొదలు పెడతారట.

ముఖ్యంగా రెస్టారెంట్, డీటెయిల్స్ స్టోర్ లో పని చేసే యువతకు ఈ సమస్య ఉందని తెలియచేస్తున్నారు. కాబట్టి అలాంటి జాబ్స్ లో ఉన్నవారు ఎప్పటికప్పుడు మీ మైండ్ సెట్ ని పరీక్షించుకుంటూ ఏదైనా సమస్య ఉంటే వెంటనే నిపుణుల్ని సంప్రదించి సలహాలు సూచనలు పాటించడం మంచిది.

Exit mobile version