శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వెలసిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్వామి వెలసిన ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత అనేది ఉంది. అలానే ఈ ఆలయంలో కూడా ఆశ్చర్యాన్ని కలిగించే ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొలువై ఉన్న పంచనారసింహ క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న ఆ ఆశ్చర్యకర విషయం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, దామరచెర్ల మండలం, మిర్యాల గూడా నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో వాడపల్లి అనే గ్రామంలో శ్రీ లక్ష్మినృసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం దక్షిణ ముఖంగా ఉంటుంది. గర్భాలయం, అంతరాలయం, మండపం అను మూడు భాగాలుగా ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయ గర్భగుడిలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి తన తొడపై లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకొని భక్తులకి దర్శనమిస్తారు. స్వామివారి మూలవిరాట్టు చతుర్భుజుడు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, స్వామివారి సమీపంలో రెండు అఖండ దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. అయితే బొద్దు దగ్గర ఉన్న జ్యోతి నిశ్చలముగా ఉండగా, ముక్కు దగ్గర ఉన్న జ్యోతి మిణుకు మిణుకు మని చలిస్తుంటుంది. ఇక్కడ కొలువై ఉన్న నరసింహస్వామి వారి ఉఛ్వాస – నిశ్వాస ప్రక్రియలో భాగంగానే జ్యోతి కదులుతూ ఉంటుందని భక్తుల విశ్వాసం. అందువలనే ఈ స్వామిని దీపాలయ్యా గా పిలుస్తారు. ఇక అంతరాలయంనందు దీపస్తంబము, ప్రథమ మండపంలో ఆళ్వారులు, ఆదిలక్ష్మి అమ్మవారు, ద్వితీయ మండపంలో తూర్పు భాగాన శిలాశాసనాలు, ముందుభాగంలో గరుత్మంతుడు, ఆంజనేయుడు మొదలగు దేవతామూర్తులను మనం దర్శించుకోవచ్చు. ఇలా ఎన్నో ప్రత్యేకతలకి నిలయమైన ఈ దివ్యక్షేత్రంలో నరసింహ జయంతి, తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి మొదలగు పర్వదినాల సందర్భంగా విశేష పూజలు ఇచట ఘనంగా జరుగుతాయి. దీపాలయ్యగా పిలిచే నరసింహ స్వామి కొలువై ఉన్న ఈ ద్వియక్షేత్రానికి అనేక ప్రాంతాల నుండి ఎప్పుడు భక్తులు తరలివస్తుంటారు.