హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి సంఘీటెంపుల్. పండుగ రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది. ఈ ఆలయంలోని ప్రత్యేకతలు ఏంటంటే, తిరుమల తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఈ ఆలయంలోని విగ్రహం పోలి ఉంటుంది. ఇంకా ఆలయంలోని మూడు గోపురాలు అధ్బుతంగా ఉంటాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఇక్కడ ఉన్న మరిన్ని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నుండి 25 కి.మీ. దూరంలో సంఘీనగర్ లోని పరమానంద గిరి అనే కొండపైన ఈ ఆలయం ఉంది. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై భక్తులకి దర్శనం ఇస్తున్నాడు. దక్షిణ భారత నిర్మాణ శైలిలో ఈ ఆలయం నిర్మించబడింది. ఇక్కడ స్వామివారి విగ్రహం 9 .5 అడుగుల ఎత్తులో ఉండి తిరుమల లోని స్వామివారిని గుర్తు చేస్తుంది. ఈ ఆలయంలో మూడు గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉండి స్వర్గానికి నిచ్చెనల కనబడతాయి. స్వామివారి ఆలయం పక్కనే పద్మావతి దేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారు తామర పుష్పంలో కూర్చొని, చేతిలో కలువలు ధరించి భక్తులకి దర్శనం ఇస్తుంది. అయితే వ్యాపార రంగంలో ప్రసిద్ధి గాంచిన సంఘీ వంశీయులు వారి వ్యాపార సంస్థలకి సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో 1991 వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణంలోనే పరమేశ్వరుడు, శ్రీరాముడు, ఆంజనేయుడు, విజయ గణపతి, నవగ్రహ దేవతామూర్తులు, అష్టలక్ష్మి దేవి, దుర్గాదేవి, కుమారస్వామి, రాధాకృష్ణులు మొదలగు దేవతలందరికీ ఉపాలయాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ పవిత్రవనం అనే ఉద్యానవనం ఉన్నది. ఇందులోని పూలనే స్వామివారి పూజకి ఉపయోగిస్తారు. సోమవారం, శుక్రవారం ఈ ఆలయంలో ఉదయం 8 గంటలకి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించుటకు ఎప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇంకా శని, అది వారాలలో ఈ ఆలయంలో భక్తుల రద్దీ అనేది విపరీతంగా ఉంటుంది.