ధృతరాష్ట్రుని వందమంది కుమారులలో మొదటివాడు దుర్యోధనుడు. ఎక్కువ శాతం కౌరవుల పేర్లలో మొదటి అక్షరం దుః అనే ఉంటుంది. దీనికి రెండు అర్దాలు ఉన్నాయి. ఒకటి కష్టం, రెండవది చెడు. అంటే వీరితో యుద్ధం కష్టం మరియు చాలా చెడుకి దారి తీస్తుందని చెబుతారు. అయితే చిన్నతనం నుండే దుర్యోధునికి పాండవులు అంటే చాల అసూయా ఉండేది. ఆ అసూయా, క్రూరత్వమే కురుక్షేత్ర యుద్దానికి దారితీసింది. అయితే దుర్యోధుని వివాహం వెనుక అతని భార్య గురించి ఒక పురాణ గాథ ఉంది. మరి దుర్యోధనుడు అసలు ఎలా వివాహం చేసుకున్నాడో ఆ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మహాభారత విషయానికి వస్తే, పాంచాల దేశ రాజకుమారి ద్రౌపది స్వయంవరానికి వెళ్లి, అక్కడ అర్జునుడి ముందు ఓడిపోతాడు దుర్యోధనుడు. ఆ ఓటమిని తల్చుకుని కుమిలిపోతుండగా కళింగ రాజు కుమార్తె భానుమతి స్వయంవరం జరగనున్న విషయం తెలుస్తుంది. దాంతో తన ప్రియనేస్తం కర్ణునితో కలిసి ఆ స్వయంవరానికి చేరుకుంటాడు. స్వయంవరంలో పాల్గొనేందుకు శశిపాలుడు, జరాసంధుడు, రుక్మి వంటి మహామహులెందరో వచ్చి ఉంటారు.స్వయంవరం ఆరంభమవుతుంది. తన చెలికత్తెలతో కలిసి సభలోకి ప్రవేశిస్తుంది భానుమతి. ఆమె పక్కనున్న చెలురు ఒకొక్క రాజకుమారుడి గురించీ వర్ణిస్తూ ఉండగా, వారిని పరికిస్తూ ముందుకు సాగుతుంటుంది. దుర్యోధనుడి వంతు వచ్చేసరికి అతణ్ని కూడా చూసీ చూడనట్లుగా ముందుకు సాగిపోతుంది. ఆ చర్యతో దుర్యోధనుడి అహంకారం దెబ్బతింటుంది. ఆ తిరస్కారాన్ని భరించలేకపోతాడు. వెంటనే భానుమతిని అమాంతంగా ఎత్తుకుని హస్తిన వైపు బయల్దేరతాడు. దుర్యోధనుడిని అడ్డుకునేందుకు వచ్చిన రాజకుమారులని ఓడించే బాధ్యత కర్ణుడు తీసుకుంటాడు. అలా భానుమతిని బలవంతంగా హస్తినకు తీసుకువచ్చి, అక్కడ ఆమెను వివాహం చేసుకుంటాడు దుర్యోధనుడు. ఇదేమిటంటూ ప్రశ్నించినవారిని ఒకప్పుడు తాత భీష్ముడు కూడా కాశిరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను ఇలాగే ఎత్తుకువచ్చాడు కదా అంటూ నోరుమూయిస్తాడు. కొన్ని కథనాల ప్రకారం స్వయంవరం కోసం దర్బారులోకి ప్రవేశించిన భానుమతి కర్ణుడిని చూసీచూడగానే అతని మీద మనసు పారేసుకుంటుంది. అతడినే వరించాలని అనుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తూ ఆమె దుర్యోధనుడికి నచ్చడంతో ఆమె కోరిక నెరవేరకుండా పోయిందని వివరించారు. భానుమతి, దుర్యోధనులకు ఇద్దరు సంతానం. కూతురు లక్షణ, కొడుకు లక్ష్మణ కుమారుడు. ఈవిధంగా దుర్యోధనుడు స్వయంవరంలో తన అహంకారం దెబ్బతిని భానుమతిని వివాహం చేసుకున్నాడు.