దేశంలో వీరభద్రుడి ఆలయాలు చాలానే ఉన్న వాటి అన్నింటిలో ఈ ఆలయం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ ఆలయంలోని విగ్రహానికి, నీటి గుండానికి, స్థల పురాణానికి ఇలా చాల విశేషాలు ఉన్నాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఏంటి ఆ ఆలయ విశేషాలు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా, రాయికోడు మండలంలో భద్రకాళీ సమేత వీరభద్రుడి ఆలయం ఉంది. 14వ శతాబ్ది, 15వ శతాబ్ది మధ్యకాలంలో సుమారు విజయనగర, కాకతీయుల మధ్యకాలంలో ఈ పుణ్యక్షేత్రం వెలిసినట్లు స్థానికులు చెప్తుంటారు. ఈ ఆలయ సమీపంలోనే ఆదిశక్తి మహమ్మాయి ఆలయమనే ప్రాచీన కట్టడం ఉన్నది. రాయికోడు శక్తిపీఠంగా ఈ క్షేత్రం వర్ధిల్లుతుంది.
రాయికోడులో వెలిసిన వీరభద్రుడు ఏక పీఠంపై భద్రకాళీ సమేతంగా ఉండడం విశేషం. మిగతాచోట్ల వీరభద్రుడు ఒక్కరే ఉంటాడు. రాయికోడు స్వయంభుగా వెలిసిన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిచెంది ప్రత్యేకతను చాటుకుంటున్నది. ప్రతినెలా అమావాస్యరోజు భక్తులు వేల సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. స్వామివారి మూలవిరాట్ మనదేశంలోనే అతి భారీ విగ్రహంగా పేర్కొనవచ్చు. ఏకశిలా విగ్రహం 6.5 అడుగల ఎత్తు, 6.0 అడుగుల వెడల్పు కలిగి శ్రీ వీరభద్రుడు, భద్రకాళీ సమేతుడుగా ఏ ఆధారం లేకుండా ఉండడం వర్ణనాతీతం. రౌద్రమూర్తిగా విశిష్టతని సంతరించుకున్నది.
స్థల పురాణానికి వస్తే, పూర్వము కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దుకు చెందిన భక్తులు రాయలసీమ నుంచి మూడు ఎడ్లబండ్లలో పోచమ్మ తల్లి భద్రకాళీ సమేత వీరభద్రుడు ఎల్లమ్మ తల్లి విగ్రహాలను తీసుకువస్తుండగా బోరంచ గ్రామ సమీపాన పోశమ్మ తల్లి విగ్రహం ఉన్న బండి ముందుకు కదలకపోవడంతో పోశమ్మ తల్లి విగ్రహం బోరంచ వద్దనే వదిలి ముందుకు సాగారు.
అక్కడి నుంచి రాయికోడు వచ్చేవరకు చీకటి పడడంతో మల్లిఖార్జునస్వామి ఆలయ ప్రాంగణంలో సేద తీర్చుకున్నారు. తెల్లవారి వాళ్లు తిరిగి బయల్దేరే సమయానికి భద్రకాళీ సమేత వీరభద్రుడు ఉన్న బండి కదలకపోవడంతో భక్తులు అవాక్కయ్యారట. మర్నాడు రాత్రి కలలో భక్తులకు ఘంటారావం, మువ్వల సవ్వడి శబ్దాలు వినిపించిన ఈ స్థలమే నాకు అనువైన క్షేత్రం, నేను ఇక్కడ స్వయంభు వెలుస్తానని పలికి అదృశ్యమయ్యాడట. అప్పుడు ఆ ఆలయ ప్రాంగణంలోనే వెలిశాడట. అయితే ఇప్పటికీ కర్ణాటక, మహారాష్ట్ర భక్తులకు ఇలవేల్పుగా ఆ స్వామి పూజలందుకుంటున్నారు. మిగిలిన బండిలో ఎల్లమ్మ తల్లిని బరూర్ కర్ణాటకలో ప్రతిష్టించారు. ఇలా వేల సంవత్సరాల ప్రాశస్తత కలిగిన రౌద్రరూప రాయికోడు భద్రకాళీ సమేతుడైన వీరభద్రుడు శక్తిపీఠంగా రాయికోడులో వెలిసాడు అని స్థలం పురాణం.
ఇక ఆలయ విషయానికి వస్తే ఇక్కడ ఒక గుండం ఉంటుంది. గుండంలో నీటిధారలు నాలుగు దిక్కుల నుంచి ఉన్నాయి. ఒక్కొక్క దిక్కు నుంచి ఒక్కో రుచి ఉంటుంది. తియ్యగా, ఉప్పుగా, వగరుగా, చప్పగా ఉంటాయి. అందుకే ఈ గుండం అమృత గుండంగా ప్రసిద్ధి చెందింది.
రుద్ర రౌద్ర అవతారుడైన రాయికోడు వీరభద్రుడు ఉదయం బాల వీరభద్రునిగా, సాయంత్రం వృద్ధ వీరభద్రునిగా నేటికి వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాడు. వీరభద్రేశ్వరుని పేరున ముడుపులు, మొక్కులు మొక్కిన భక్తులకు మువ్వల సవ్వడి ఘంటారావం శబ్దంతో కలలో ప్రత్యక్షమై వారి కోరికలను తీర్చుతాడు. భద్రకాళీ సమేత వీరభద్రుడిని పూజించిన ఐశ్వర్య, ఆయురారోగ్యాలు, దుష్టగ్రహ దోషాలు, భూత ప్రేత పిశాచాది భయాలు పోతాయని భక్తుల నమ్మకం.
ఇలా భద్రకాళీ సమేత వీరభద్రుడు కొలువై ఉన్న ఈ ఆలయం రాయికోడు శక్తిపీఠంగా విరాజిల్లుతుంది.