కుంతీదేవికి వాయుదేవుని వరప్రసాదంగా పుట్టినవాడు భీముడు. ఈయన పాండవులలో మధ్యముడు. అన్యాయాన్ని అసలు సహించని భీముడు బలశాలి మాత్రమే కాదు మంచి మనసు ఉన్న వాడు. అయితే మహాభారతంలోని కొన్ని సంఘటనల ఆధారంగా భీముడు ఎంతటి బలశాలి, అయన ఎలాంటి మనసు ఉన్నవాడు అనే ఆసక్తి కర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. భీముడు పుట్టిన పదో రోజే కుంతీపాండురాజులు ఆ బాలుణ్ని తీసుకొని వనదేవత ఆశీర్వాదానికై వెళుతుంటే ఒక పులి వారిపై దూకపోయింది. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో బాల భీముడు కుంతి చేతుల నుండి జారిపోయి రాయిమీద పడిపోతాడు. కుంతీ పాండు రాజులు భీమునికేమయిందోనని చూడగా, ఆ రాయి తునాతునకలైంది. అప్పుడు నవ్వుతూ కనిపించాడు భీముడు. అంతటి బలం భీమునిది. అయితే కౌరవులు చిన్నతనంలో భీమునికి విషం పెట్టి, బంధించి నదిలో పడేస్తారు. కానీ అవి భీమున్ని ఏ మాత్రం బాధించలేకపోయింది. ఎందుకంటే భీముని హృదయం చాలా సరళమైంది. ఎత్తులు, యుక్తులు అతనికి చేతకావు. మంచికి సహకరించడం, చెడును నిర్మూలించడం మాత్రమే భీమునికి తెలుసు. అందుకే కౌరవులు ఎన్ని పన్నాగాలు పన్నినా వారిపై ఏ మాత్రం ద్వేషం కలగలేదు. కానీ భీముడు వారిలోని చెడును తట్టుకోలేకపోయేవాడు . వారి పక్షాన మాట్లాడే పెద్దలపట్ల కూడా ద్వేషం కాక కోపం ప్రదర్శించే వాడు భీముడు.తల్లిని అమితంగా ప్రేమిస్తూ, అన్న మాటకు కట్టుబడి, సోదరులను ఆదరిస్తూ బతికిన భీముడు ప్రతీ అనుకూల, ప్రతికూల సమయాలలో వారందరికీ అండగా నిలబడ్డాడు. లక్క ఇంటిలో తమ చావును నిర్ధారించిన కౌరవుల పన్నాగాన్ని పసిగట్టినవాడై గట్టి కాపాలా ఇచ్చాడు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని అడవిమార్గంలో వెళుతున్న వారందరూ అలసిపోతే భీముడు కుంతిని భుజంపై ఎక్కించుకొని నకుల సహదేవులను చంకనెత్తుకొని అర్జున ధర్మరాజులకు చెరో చేయినీ సాయమందించి ముందుకు నడిపిస్తాడు. ఆదమరచి అలసి సొలసి వారంతా నిద్రిస్తే కంటికి రెప్పలా కాపుకాసాడు భీముడు.భీముని భుజపరాక్రమం వల్లనే కుంతీ పాండవుల జీవితం అడుగడుగునా రక్షించబడుతూ వచ్చింది. ధర్మరాజు జూదంలో తమనూ, రాజ్యాన్నీ ఓడినా మారుమాట్లాడని భీముడు, ద్రౌపదిని పణంగా పెట్టడం సహించలేకపోయాడు. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయడం భీమునికి బొత్తిగా ఇష్టం లేదు. ఎందుకంటే, క్షత్రియధర్మం అన్యాయాన్ని ఎదిరించి పోరాడి గెలవమనే చెబుతుందనేది భీముని నమ్మకం. అరణ్యవాసంలో పాండవులకు ఎదురైన అనేక సమస్యలకు భీముడే పరిష్కారం చూపించాడు.అజ్ఞాతవాసంలో ద్రౌపదిని హింసించిన కీచకుణ్ని అత్యంత భయంకరంగా చంపిన భీముడు పరాయి స్త్రీలను వంచిస్తే ఇదే గతని చరిత్ర సాక్షిగా నిరూపించాడు. ఆనాడు సభలో ద్రౌపదిని పరాభవించిన దుశ్శాసన, దుర్యోధనులను చంపి వారి రక్తంతో ద్రౌపది కురులను ముడిచి, వారి పాపానికి తగిన శిక్ష వేసాడు. మహాబలవంతులైన దుష్టులందరూ భీముని చేతిలోనే చనిపోయారంటే భీమసేనుని ఆవేశం అన్యాయాన్ని బలి కోరుతుందని చెప్పకనే చెప్పింది. అందుకే మహాభారతంలో భీముడు అంటే అందరు అమితంగా ఇష్టపడతారు.