Home Unknown facts అత్తిరాలకు “దక్షిణ గయ” అన్నపేరెందుకు వచ్చింది?

అత్తిరాలకు “దక్షిణ గయ” అన్నపేరెందుకు వచ్చింది?

0

అగ్రతః చతురో వేదా: పృష్టతః సశరమ్‌ ధనుః।
ఇదమ్‌ బ్రాహ్మ్య మిదమ్‌ క్షాత్రమ్‌ శాపాదపి శరాదపి।।

ఎదుట (ముఖంలో) నాలుగు వేదాలు, వీపున బాణాలతో కూడిన ధనుస్సు, బ్రహ్మ తేజస్సూ ఉంది. క్షాత్ర పరాక్రమమూ ఉంది. శాపం చేతనైనా, శరం ద్వారానైనా సాధిస్తాడు. పరశురాముడి గురించి చెప్పే శ్లోకమిది. లోకకల్యాణం కోసం విష్ణువు ఎత్తిన దశావతారాల్లో పరశురామావతారం ఆరోది. ఇది ఆవేశావతారం. పూర్వం సత్యయుగంలో శ్రీమన్నారాయణుడి ఆవర అవతారమైన శ్రీ పరశురాముడు భూమండలంలో రక్తపాతం సృష్టించాడు. ఎడతెరిపి లేకుండా తను ఇరవై ఒక్కసార్లు రక్తపాతం జరపడం వల్ల.. ఆయనకు పాపం చుట్టుకుంటుంది. దాంతో ఆయన గొడ్డలి హస్తానికి అంటుకొని రాలేదు.

Attirala Sri Parashurama Temple Highlightsదీంతో పరశురాముడు, మహేశ్వరుడి ఆజ్ఞమేరకు పుణ్యనదులలో స్నానం చేస్తూ పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకూంటూ చివరకు అత్తిరాల ప్రాంతానికి చేరుకుంటారు. (అప్పట్లో ఆ ప్రాంతానికి ‘అత్తిరాల’ అనే పేరు లేదు). ఈ ప్రాంతంలోనే వున్న బహుదా నదిలో స్నానం చేయగానే.. ఆయన చేతిలో వున్న పరుశువు (గొడ్డలి) రాలి, క్రింత పడిపోతుంది. ఇలా ఈ విధంగా పరశురామునికి చుట్టుకున్న హత్యపాపం రాలిపవడంతో.. ఆ ప్రాంతానికి ‘హత్యరాల’ అనే పేరొచ్చింది. కాలక్రమంలో ఇప్పుడు ‘అత్తిరాల’గా పిలవబడుతోంది.

కురుక్షేత్ర యుద్దానంతరం భంధు మిత్రుల మరణానికి, జరిగిన రక్త పాతానికి తనే కారణం అంటూ ఉదాసీనంగా ఉన్న ధర్మ రాజుకు కర్తవ్యం భోధిస్తూ, రాజ ధర్మాన్ని గురించి తెలియజేసే క్రమంలో శ్రీ వ్యాస భగవానుడు పలికిన పలుకులలో అత్తిరాల ప్రస్తావన వస్తుంది.

చుట్టూ కొండలు, ఒకపక్క చెయ్యేరు ఆహ్లాదకర వాతావరణం, అన్ని పక్కలా ఆలయాలు కనపడుతూ అద్యాత్మికత వెల్లివిరుస్తుంది. మనస్సుకు అనిర్వచనీయమైన శాంతి కలుగుతుంది. కొండ మీద రాజ గోపురం చేరుకోడానికి సోపాన మార్గం. వెనక ఎత్తైన పర్వతం మీద దీపస్తంభం. పైకి చేరుకొంటే శ్రీ త్రేతేశ్వర స్వామి ఆలయం. పడమర ముఖంగా లింగరూపంలో గర్భాలయంలో చందన కుంకుమ లేపనంతో, వీభూతి రేఖలతో, లయ కారకుడు నిరాకారునిగా కనిపిస్తారు. శ్రీ కామాక్షి అమ్మవారికి, వినాయకునికి విడిగా సన్నిధులున్నాయి. కొండ పైనుండే శ్రీ గదాధర స్వామి ఆలయానికి మార్గం ఉంది. రెండువేల ఐదో సంవత్సరంలో పునః నిర్మించబడినది ఈ ఆలయం. పురాతనమైన స్వాగత ద్వారం గుండా ప్రాంగణంలోనికి ప్రవేశిస్తే ఉత్తర ముఖంగా ఉన్న ప్రధాన ఆలయ ముఖ మండపం లోనికి తూర్పు వైపు నుండి మార్గం ఉంటుంది. దానికి ఎదురుగా అంజనా సుతుడు దక్షిణం వైపుకు చూస్తూ ప్రసన్న రూపునిగా దర్శనమిస్తారు. ముఖ మండప పై భాగాన శ్రీ రామానుజాచార్యులు, శ్రీ వేదాంత దేశికులు, ఆళ్వారుల, సప్తఋషుల విగ్రహాలు కనిపిస్తాయి.

మహా భారత పురాణంలో పేర్కొన్న క్షేత్రం. సుమారు వెయ్యేళ్ళ చరిత్రను సొంతం చేసుకొన్న ప్రాంతం. లోకాలను పాలించే స్థితి లయకారులు, అవతార పురుషులు, మహా మునులు, మహోన్నత వ్యక్తిత్వం గల వారు నడయాడిన పుణ్యభూమి. కలియుగంలో శివ కేశవుల ఉమ్మడి నిలయం. ఆధునిక యుగంలో గత చరిత్రను భావి తరాలకు సవివరంగా తెలియ చెప్పడానికి పరిరక్షిస్తున్న కట్టడాల కేంద్రం.

ద్వాపర యుగానికి పూర్వం శంఖుడు మరియు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఈ ప్రాంతంలో ఉండేవారు. సకల విద్యలలో, వేద వేదాంగాలలో నిష్ణాతులు. విడివిడిగా ఆశ్రమాలు ఏర్పాటుచేసుకోని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఒకనాడు లిఖితుడు అన్నను చూడాలని వెళ్ళాడు. ఆ సమయంలో శంఖుడు ఆశ్రమంలో లేడు. సోదరుని రాకకు ఎదురు చూస్తూ, అక్కడి చెట్లకు కాసిన ఫలాలను కోసి తినసాగాడు. ఇంతలో తిరిగి వచ్చిన అన్న శంఖుడు తమ్ముని చూసి “ఎవరి అనుమతితో ఫలాలను తింటున్నావు?” అని ప్రశ్నించగా, తన తప్పు అర్ధమైన లిఖితుడు పరిహారం చూపమని అర్ధించాడు.

“ఏదైన, ఎవరిదైన వస్తువు అనుమతి లేకుండా తీసుకుంటే అది దొంగ తనం క్రిందకు వస్తుంది. నువ్వు చేసినది అదే కనుక రాజు వద్దకు వెళ్లి నీ నేరానికి సరియైన శిక్షను అనుభవించు.” అన్న మాట శిరసావహించి రాజ భవనానికి వెళ్ళాడు లిఖితుడు. అతని రాక తెలిసిన సుదుమ్న్య రాజు ఘనంగా ఆహ్వానించబోగా తిరస్కరించి, తన నేరం తెలిపి, శిక్షను విధించామని కోరాడు. ఒక మహా తపస్విని చిన్న నేరానికి దండించవలసిన పరిస్థితిని తెచ్చిన రాజాధికారాన్ని నిందించుకొంటూనే, అతని చేతులు నరకమని ఆజ్ఞాపించాడు రాజు. సంతోషంగా శిక్షను స్వీకరించి అన్న వద్దకు వెళ్ళాడు లిఖితుడు. శంఖుడు “నీవు చేసిన నేరాన్ని అంగీకరించి, శిక్షను పొంది పునీతుడవయ్యావు. ఇప్పుడు నీవు నదిలో భగవంతునికి, పిత్రు దేవతలకు అర్ఘ్యం సమర్పించు” అని ఆదేశించాడు. నదిలో మునిగి లేచిన లిఖితునికి చేతులు వచ్చాయి. బాహువులను ప్రసాదించిన పవిత్ర నదికి నాటి నుండి “బహుదా ” అన్న పేరొచ్చినది. నాటి బహుదానదే నేటి “చెయ్యేరు”.

అంతేకాదు ప్రజాపతులలో ఒకరైన “పులస్త్య బ్రహ్మ” ఈ పవిత్ర క్షేత్రంలో తపమాచరించి శివ సాక్షాత్కారం పొంది, కోరిన కోర్కె మేరకు సదాశివుడు “శ్రీ త్రేతేశ్వర స్వామి” అన్న నామంతో పర్వతం మీద స్వయంభూగా వెలిశారు. సప్త మహర్షులలో ఒకరైన “భ్రుగు” కూడా ఈ పుణ్య స్థలిలో తపము చేసి శ్రీ హరిని ప్రసన్నం చేసుకున్నారు. ముని కోరిక మేరకు ఒక పాదాన్ని గయలొను, రెండో పాదాన్ని అత్తిరాలలో ఉంచి “శ్రీ గదాధర స్వామి” గా ప్రకటితమయ్యారు. చెయ్యేరు నదిలో గతించిన రక్త సంభందీకులకు చేసే పిండ ప్రధానము, తర్పణం గయలో చేసిన వాటితో సమానం అని ప్రతీతి. అందుకే అత్తిరాలకు ” దక్షిణ గయ” అన్న పేరొచ్చినది.

 

Exit mobile version