Home Health నడుము నొప్పిని తగ్గించే బెస్ట్ హోమ్ రెమిడీస్

నడుము నొప్పిని తగ్గించే బెస్ట్ హోమ్ రెమిడీస్

0

నొప్పి వచ్చే వరకూ తెలియదు మనకొక నడుము ఉందని. ఒకసారి నొప్పి మొదలైందంటే ఆ తర్వాత అది మనల్ని క్షణం కూడా మర్చిపోనివ్వదు. అనుక్షణం అదే కలత. కదిలితే బాధ. కదలకపోతే బాధ. నిటారుగా నిలవలేం. తీరికగా కూర్చోలేం. నాలుగు అడుగులు నడవలేం. కనీసం హాయిగా నిద్ర కూడా పోలేం.

Best Home Remedies To Reduce Back Painఈ మధ్యకాలంలో చాలా మంది నడుము, మెడ, వెన్నునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో ముప్పై ఏళ్లు దాటని వారూ ఉండడం బాధాకరం. అయితే, జీవనఅలవాట్లు, ఉద్యోగ కారణమో, నిరంతరం గ్యాడ్జెట్స్ వాడకమో ఈ సమస్యకు కారణమవుతుంది.

అయితే నొప్పి కొద్దిగా ఉన్నప్పుడే ఇంటి చిట్కాలతో నయం చేసుకోవచ్చు. చిన్నచిన్న వాటికి కూడా మందులపై ఆధారపడకుండా ఇంట్లోనే సైడ్ ఎఫెక్ట్స్ లేని కొన్ని చిట్కాలతో నొప్పిని నివారించొచ్చు. అలాకాకుండా నొప్పి తీవ్రమైనప్పుడు డాక్టర్ని సంప్రదించాలి.

వెల్లుల్లి :

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం వెన్ను నొప్పిని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అందుకే వెల్లుల్లి పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ ఉదయాన్నే రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల నొప్పి తగ్గుతుంది. పచ్చిగా తినలేని వాళ్లు వంటల్లో వేసుకుని తినొచ్చు.

అల్లం :

అల్లం వంటింట్లో ఉండే బెస్ట్ మెడిసిన్. ఇది కూడా వెన్నునొప్పి ఉపశమనానికి సాయపడుతుంది. రోజూ చేసుకునే వంటల్లో కచ్చితంగా అల్లం ఉండేలా చూసుకోవాలి. అలా కుదరనప్పుడు ప్రతిరోజూ ఒకసారి అల్లం టీ తాగినా సరిపోతుంది.

కొబ్బరి నూనె :

ముడి కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జిసిక్, యాంటీ పైరేటిక్ లక్షణాలు ఉంటాయి. కొబ్బరి నూనె అన్నిరకాల వెన్నునొప్పులను తగ్గిస్తుంది. కాబట్టి తక్షణ ఉపశమనం కోసం కొబ్బరి నూనెను అప్లై చేయాలి. పావు చెంచా కొబ్బరి నూనెను నొప్పి ఉన్న ప్రాంతంలో వేసి పది నిమిషాలు మర్దనా చేయాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పసుపు కలిపిన పాలు :

వంటింట్లో అద్భుతమైన ఆరోగ్య లక్షణాలున్న పసుపు కూడా నడుం నొప్పిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే కుర్క్యుమిన్ అనే పదార్థం ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సాయపడుతుంది. అదే విధంగా పాలలోని క్యాల్షియం, విటమిన్– డి ఎముకలను బలంగా ఉంచడంలో తోడ్పడతాయి. రాత్రిళ్లు నిద్రపోయే ముందు పసుపు కలిపిన పాలు తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.

ఆలివ్ ఆయిల్ :

ముడి ఆలివ్ ఆయిల్లో నొప్పి ఉపశమనానికి సాయపడే ఓలియోకాంతల్ అనే పదార్థం ఉంది. ఇది కూడా పెయిన్ కిల్లర్గా పని చేస్తుంది. నొప్పిగా ఉన్న ప్రాంతంలో పావు చెంచా ఆలివ్ ఆయిల్ వేసి, పది నిమిషాలు మర్దనా చేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే నొప్పి మెల్లిమెల్లిగా తగ్గుతుంది.

యోగా:

యోగా శరీరానికి బలాన్ని అందిస్తూ ఫిట్గా ఉండేలా చేస్తోంది. ఇది వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి బాగా ఉపయోగపడుతుంది. యోగాసనాల్లో వెన్నునొప్పికి కొన్ని ప్రత్యేక భంగిమలు ఉంటాయి. వాటిని రెగ్యులర్గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

హాట్ అండ్ కోల్డ్ కంప్రెస్: 

వెన్ను బెణికినప్పుడు లేదా నొప్పిగా ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ని పెట్టుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కోల్డ్ కంప్రెస్ వెన్నునొప్పికి ఒక నంబింగ్ ఎఫెక్ట్ (స్పర్శలేకుండా) అందిస్తుంది. అలాగే హీటింగ్ ప్యాడ్ లేదా వేడినీళ్లు వంటి హాట్కంప్రెస్ గట్టిపడిన లేదా బిగుసుకున్న కండరాలకు ఉపశమనాన్ని అందిస్తాయి. ఐస్ లేదా హాట్ప్యాక్ ఇరవై నిమిషాల కంటే ఎక్కువసేపు అప్లై చేయొద్దు. అలాగే నొప్పిని బట్టి రోజులో సాధ్యమైనన్నిసార్లు వేడి లేదా కోల్డ్ కంప్రెస్ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పి త్వరగా తగ్గిపోతుంది.

డాక్టర్ చికిత్స:

వెన్నునొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు శరీరం కుంగిపోతుంది. అలాంటప్పుడు కచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. అంతేకాదు, ఇంటి చికిత్సలకు నొప్పి తగ్గనప్పుడు, చేతులు, కాళ్లు తిమ్మిర్లెక్కడం లేదా మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్లాలి.

 

Exit mobile version