Home Unknown facts పసిబాలుని శవం కోసం నక్క, గద్దల కొట్లాట.. భీష్ముడు చెప్పిన నీతి కథ

పసిబాలుని శవం కోసం నక్క, గద్దల కొట్లాట.. భీష్ముడు చెప్పిన నీతి కథ

0

మహాభారతంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు తన మృత్యువు కోసం ఎదురుచూస్తూ ఉండిపోలేదు.. ఆ కాస్త సమయాన్ని కూడా భగవంతుని ప్రార్థనలో, ధర్మోపదేశాలతో సద్వినియోగం చేసుకున్నాడు. అలా భీష్ముడు రాజనీతి గురించి ధర్మరాజుకి చేసిన ఉపదేశాలతో నిండిన శాంతిపర్వం తృతీయాశ్వాసంలో ఉన్న ఒక అరుదైన ఘట్టం.. మనం వినే ప్రతీ మాట మన మంచికే అనుకోకూడదు అనే సత్యాన్ని బోధిస్తుంది.. మరి ఆ కథేంటో మనం ఇపుడు తెల్సుకుందాం.

Bheeshmuduపూర్వం విదిశా నగరంలో ఒక బ్రాహ్మణు కుటుంబం ఉండేది. ఆ దంపతులకు ఉన్న ఏకైక కుమారుడు ఇంకా ముక్కుపచ్చలైనా ఆరకుండానే.. మృత్యువు కబళిస్తుంది.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లవాడు చనిపోవడంతో బ్రాహ్మణ దంపతుల గుండె పగిలిపోతుంది. ఆ శోకంలోనే పిల్లవాడి శరీరాన్ని తీసుకుని కర్మ కార్యాల కోసం స్మశానానికి చేరుకుంటారు… కానీ ఆ బిడ్డను అక్కడ వదిలి వెళ్లేందుకు వారికి చేతులు రావడం లేదు. ఆ పసి బాలుని దేహం పక్కన ఎంతసేపు ఏడ్చినా వారికి ఓదార్పు దక్కడం లేదు. అయితే ఇదంతా దూరంగా ఉంటున్న ఓ గద్ద గమనిస్తుంది.. బాలుడి శవాన్ని చూడగానే దానికి నోరూరుతుంది.. కానీ బాలుడి తల్లిదండ్రులు మాత్రం ఎంతకీ ఆ శవాన్ని వదిలివెళ్లడం లేదు, చీకటిపడిపోతే తను నేల మీద సంచరించడం కష్టం. ఎలా అని అనుకుని కుటిల పన్నాగంతో నెమ్మదిగా ఆ బ్రాహ్మణ దంపతుల దగ్గరకి చేరి ఇలా అంటుంది..

ఆర్య.. ఎంతసేపని మీరిలా ఏడుస్తూ కూర్చుంటారు? చీకటిపడితే భూతప్రేతాలన్నీ ఇక్కడకు చేరుకుంటాయి. కాబట్టి వెంటనే ఈ శవాన్ని వదిలేసి మీరు బయలుదేరండి అంటూ తొందర పెడుతుంది.. ఇంతలో అటుగా వచ్చిన ఓ నక్క ఈ హడావుడి అంతా గమనిస్తుంది..అక్కడ ఉన్న శవాన్ని చూసి దానికి కూడా నోరూరింది. కానీ అప్పటికే ఆ శవం కోసం గద్ద కాచుకుని ఉండటం దానికి ఇబ్బందిగా అనిపిస్తుంది.. ఆ దంపతుల్ని ఎలాగొలా చీకటిపడేవారకూ ఆపగలిగితే గడ్డ బాధ తొలగిపోతుంది, ఇక తనే ఆ శవాన్ని ఆరగించవచ్చు అని అనుకుని . నిదానంగా బ్రాహ్మణుడి వద్దకు వచ్చి పిల్లవాడిని వదిలి వెళ్లడానికి మీకు మనసెలా ఒప్పుతోంది. కాసేపు వేచి చూడండి. ఎప్పుడేం జరుగుతుందో ఎవరం మాత్రం చెప్పగలము, ఏ దేవతో వచ్చి కరుణించి మీ బిడ్డకు ప్రాణదానం చేయవచ్చు కదా.. అందుకే చీకటిపడేవరకూ వేచి చూసి వెళ్ళండి అని చెప్తుంది..

ఇలా ఆ పిల్లవాడి తల్లిదండ్రులని అక్కడినుండి పంపేందుకు గద్దా.. ఆపేందుకు నక్కా ప్రయతనాలు చేస్తుంటాయి… కొన్ని వందల ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. ఇంతవరకూ పోయిన ప్రాణం తిరిగిరావడాన్ని నేనెక్కడ కూడా చూడలేదు. ఈ గుంటనక్క మాటలు విని మీరు లేనిపోని ఆశలు పెంపుకుని బాధపడొద్దు.. నా మాట విని మీరు ఇక్కడి నుండి వెళ్లిపోండి అంటుంది గద్ద.. ఆ మాటలు విన్న బ్రాహ్మణ దంపతులు బయల్దేరేలోగా… ఈ గద్ద చాల క్రూరమైంది. పూర్వం రాముడు ఒక బ్రాహ్మణుడిని బతికించిన కథ వినలేదా! సంజయుడి కుమారుడైన సువర్ణదీర్గుని నారదుడు బతికించలేదా! అలాగే ఏ దేవతో, యక్షుడో రాకపోరా.. మీ కుమారుడిని బతికించకపోరా.. మీరు చీకటిపడేవరకు వెళ్ళకండి అని వారించి వాళ్ళని నిలువరిస్తుంది నక్క.

అలా అటు నక్కా, ఇటు గద్దా బాలుడి శవం కోసం వాటికి అనువైన వాదనలను అవి వినిపిస్తూ ఉంటాయి… ఈలోగా పరమ శివుడు రుద్రభూములలో విహారం చేస్తూ అక్కడికి చేరుకుంటాడు.. బ్రాహ్మణ దంపతుల అవస్థను చూసి, మీకేం కావాలో కోరుకోమంటాడు… దానికి ఆ భార్యాభర్తలు తమ బిడ్డను బతికించమంటూ కోరుకున్నారు. వారి కోరికను శివుడు మన్నిస్తాడు.. అంతేకాదు అక్కడ ఉన్న గద్ద, నక్కలకు చిరకాలం ఆకలిలేకుండా జీవిస్తాయంటూ వరమిచ్చాడు. అక్కడితో ఆ కథ సుఖాంతమవుతుంది.. కానీ ఈ కథ వల్ల… వినిపించే ప్రతిమాటా, మన మంచి కోసమే అని నమ్మకూడదన్న నీతిని తెలుపుతుంది.. కొంతమంది కపట బుద్దితో ఎదుటివారి కష్టాన్ని కూడా వారికి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తారు.. తియ్యటి మాటలు చెప్తూనే వారి పన్నాగాల్ని అమలుచేస్తుంటారు. ఆ కపటత్వాన్ని మనం గ్రహించగలగాలి. మనం ఏ స్థితిలో ఉన్న ఎదుటి వారి మాటల వెనుక ఉన్న మర్మాన్ని పసిగట్టగలగాలి.

 

Exit mobile version