Written By Karthik K
The psychology of Joaquin Phoenix’s ‘Joker’.
పోయిన ఏడాది జోకర్ సినిమా రిలీజైన కొత్తలో రివ్యూలు చదువుతుంటే చాలామంది చాలా రకాలుగా స్పందించడం చూశాను. కొంతమంది అందులో వయలెన్స్ ప్రమోట్ చేశారని చెప్పి ‘irresponsible film’ అని దుమ్మెత్తి పోస్తే మరికొందరు ‘hauntingly beautiful’ అని ఆకాశానికెత్తేశారు. నాకు మాత్రం సినిమా చూస్తున్నంతసేపూ నాకది మెంటల్ హెల్త్ ఇష్యూలతో బాధపడుతూ, స్టాండ్-అప్ కామిగ్గా రాణించాలని ఉన్నా ట్యాలెంట్ లేక సతమతమవుతూ, పర్సెక్యూషన్ కాంప్లెక్స్ వల్ల కనిపించని శత్రువుపై పగ తీర్చుకోవాలనుకునే లక్షణాలు పుష్కలంగా ఉన్న ఒకానొక వ్యక్తి యొక్క క్యారెక్టర్ స్టడీగా మాత్రమే కనబడింది.
సినిమా మొదలవగానే మున్సిపల్ వర్కర్ల స్ట్రైక్ మూలాన చెత్త ఎక్కడికక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన గాథం నగరం కనిపిస్తుంది. సంపద ఉన్నోళ్లు, లేనోళ్ల మధ్య అంతరాలు విపరీతంగా పెరిగిపోయిన సమాజం అది. అలాంటి నగరంలో ఆర్థర్ ఫ్లెక్ (వకీన్ ఫీనిక్స్) ఒక పార్ట్-టైం రెంటెడ్ clownలా పనిచేస్తుంటాడు. తను మానసికపరమైన సమస్యలతో బాధపడుతూ స్టేట్-స్పాన్సర్డ్ థెరపీ తీసుకుంటుంటాడు. ఏడు రకాల మందులు వాడుతుంటాడు. ఇక్కడ అతని దినచర్యను ప్రత్యేకంగా గమనించాల్సిన అవసరం ఉంది. అతని బాస్ అతన్ని అవమానిస్తుంటాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని విపరీతంగా కొట్టి పారిపోతారు. అతను ఎంతగానో అభిమానించే టాక్-షో హోస్ట్ మర్రీ (రాబర్ట్ డెనిరో) పైకి స్నేహంగా ఉంటూనే వెనుక అతన్ని ఎగతాళి చేస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ నగరం ఉన్నపళంగా అతని కౌన్సెలింగ్ నిధులు రద్దు చేసి, బాగుపడటానికి అతని వద్ద ఉన్న ఏకైక ఆసరా లాగేసుకున్నప్పుడు అతని చేతికొక గన్ దొరికితే పరిస్థితి ఏంటి? అలాంటి రెటరికల్ ప్రశ్నలకొక సమాధానం వెతకడానికి ప్రయత్నిస్తుందీ సినిమా.
కానీ గన్ చూడగానే అతను తటపటాయిస్తాడు. ‘అయాం నాట్ సపోస్డ్ టు హేవ్ ఎ గన్’, అనేది అతనిచ్చే మొదటి సమాధానం. పిస్టల్ తీసుకుని వయలెన్సును నమ్మడం అనేది అతని ప్రైమరీ రెస్పాన్స్ కాదు. ఇక్కడ అతని చేతికి గన్ వచ్చేలా చేసేది ఎవరంటే అతని ట్రీట్మెంటుకు నిధులు కట్ చేసి, సహజ విక్టిమ్ అయిన ‘ఆర్థర్ ఫ్లెక్’ను ఒక హత్యలు చేసే ‘మేనియాక్’ లాగా మార్చేసే సిస్టమే. కానీ ఈ క్రమంలో సినిమా సాంతమూ ఆర్థర్ మెల్లగా ఒక నిహిలిస్టిక్ మర్డరర్లాగా మారుతాడనే విషయాన్ని నిజాయితీగా చూపించడం ఎక్కడా మర్చిపోదు. ఈ సినిమా వయలెన్సును ప్రమోట్ చేస్తుందని విరుచుకుపడినవారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆర్థర్ ఫ్లెక్ అనబడే ఒక మర్డరర్ హెడ్-స్పేస్లోకి వెళ్లి చూడటమంటే అతని చర్యలను సమర్థించినట్టు కాదు. అలాగే అతను మానసికపరమైన సమస్యల వల్ల బాధపడుతున్నాడని గుర్తించినంత మాత్రాన అది అతని చర్యల పట్ల ఎకౌంటబిలిటీ లేకుండా ఉండాలని చెప్పడం అసలే కాదు.
అతని ఆలోచనాసరళిని దగ్గరగా చూపిస్తూ ఒక్కో మెట్టు దగ్గర ఆర్థర్ నుంచి జోకర్ వైపు అతని పతనాన్ని చూపడానికి ప్రయత్నిస్తుంది ఈ సినిమా. అసలు తన కౌన్సెలర్ తప్ప గాథం నగర వాసుల్లో ఏ ఒక్కరికీ ఆర్థర్ ఫ్లెక్ పట్ల సహానుభూతి లేకపోవడం ఒకింత నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. అందుకే The worst part of having a mental illness is people expect you to behave as if you don’t అంటాడు ఆర్థర్. ప్రస్తుతం ఊరూపేరూ లేకుండా బూతులతో దాడిచేసే ఫేక్ ఎకౌంట్లు, ట్రోల్సు, బుల్లీలతో నిండిపోయిన మన సోషల్ మీడియాకు గాథం నగరం ఒక మెటఫార్ కూడా కావచ్చు. చెప్పలేం. కానీ ఇక్కడ ఆర్థర్ తనకు జరిగే పెద్ద పెద్ద అన్యాయాలు, చిన్నపాటి అవమానాలు రెండింటినీ ఒకే త్రాసులో తూచి బేరీజు వేస్తాడని, అతనిది తప్పొప్పుల వివేచన సరిగ్గా లేని మైండ్-సెట్ అని సినిమా నిక్కచ్చిగా చూపిస్తుంది కాబట్టి అతని వయలెన్సును డైరెక్టర్ జస్టిఫై చేయడానికి ప్రయత్నించలేదని నా నమ్మకం. (ట్రైన్లో అతను మర్డర్లు చేసినప్పుడు వెనుక ‘వనవౌవౌ వనవౌవౌ వనవౌ’ లాంటి హీరోయిక్ బీజీఎం ప్లే చేసుంటే అది వేరే సంగతి. తేడా అర్థమైందనుకుంటాను.)
ఈ సినిమాలో చూపించిన ఒకప్పటి గాథం నగరం, డోనాల్డ్ ట్రంప్ లాంటి పక్కా నార్సిసిస్టిక్ క్యాపిటలిస్టును ప్రెసిడెంటుగా ప్రసాదించినటువంటి ఈనాటి అమెరికాకు మెటఫార్ అని కూడా అనుకోవచ్చు. This America feels no need to help the outcast and the destitute. In this America, the filthy rich just get richer and filthier. ఆర్థర్ ఫ్లెక్ యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి సైకియాట్రిస్ట్ Carl Jung ప్రతిపాదించిన ‘Shadow’ థియరీ కూడా తోడ్పడుతుంది. ‘Shadow’ అంటే ‘the thing a person has no wish to be’. మనిషిలోని చీకటి కోణాలన్నిటి సమాహారమే Shadow. ఈ లెక్కన ఈ సినిమాలో జోకర్ పాత్ర ఈ Shadowకి ప్రతిరూపం. ‘All I’m having are negative thoughts only’ అని ఆర్థర్ అన్నప్పుడు వాటిని ఎప్పటికప్పుడు గుర్తించడం చాలా ముఖ్యం అంటాడు Carl Jung. అలా గుర్తించలేని పక్షంలో పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. జోకర్ సినిమాలో చూపిందదే.
ఈ సినిమా ‘historical trauma’ అనే ఇంకో ముఖ్యమైన సైకలాజికల్ థియరీ గురించి కూడా చర్చిస్తుంది. సినిమాలో ఆర్థర్ ఫ్లెక్ తల్లి పెన్నీ (ఫ్రాన్సెస్ కోన్రాయ్) అనారోగ్యంతో మంచంపడుతుంది. కానీ తను కూడా స్వాభావికంగా ఒక డెల్యుషనల్ నార్సిసిస్ట్ అనే విషయం మనకు తర్వాత తెలుస్తుంది. ఆమె తన కొడుకును తన బాయ్ ఫ్రెండ్ ఎబ్యూజ్ చేస్తున్నప్పుడు అడ్డుచెప్పకుండా చోద్యం చూస్తూ అతని పక్కనే నిలబడుతుంది. అసలు జీవితంలో ఎవరితోనూ ఒక మీనింగ్-ఫుల్, సక్సెస్ఫుల్ రిలేషన్-షిప్ సంపాదించుకోలేక, మానసిక అసమర్థత వలన ఏకాకిగా మిగిలిపోయి ‘ఆర్థర్ నుంచి జోకర్’గా రూపాంతరం చెందే అతని ప్రయాణానికి బీజాలు అతని బాల్యంలోనే పడ్డాయని మనకు అర్థమవుతుంది. ‘What human beings cannot contain of their experience – what has been traumatically overwhelming, unbearable, unthinkable – falls out of social discourse, but very often onto and into the next generation as a chaotic urgency’ అంటారు. ఈ లెక్కన పేట్రియార్కీ, ఎనార్కీ లాంటివి ఇంట్లోనే మొదలౌతాయనే వాదనకు బలం చేకూరుస్తుందీ సినిమా. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ‘Bojack Horseman’లో కూడా ఈ విషయంపై చర్చ జరిగింది.
ఈ సినిమా చూసినప్పుడు నాకు మైండ్-బ్లోయింగ్ అనే ఫీలింగ్ రాలేదు (not about Phoenix’s performance, దీని గురించి చెప్పాల్సింది వేరే ఉంది) గానీ ఆర్థర్ లాంటి వ్యక్తుల ప్రవర్తనను అర్థం చేసుకోవాలనే కోరిక మాత్రం బలంగా కలిగింది. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు బలంగా చూపించిన ‘Joker is a disease that has infected the society’ అనే notionను కాదని మొదటిసారి దర్శకుడు Todd Phillips ‘Society itself is the disease, Joker is just a symptom’ అనే కొత్త నిర్వచనాన్ని తెరమీద ఆవిష్కరించాడు. జోకర్ అనే క్యారెక్టరును larger-than-life Clown Prince of Crimeలా కాకుండా ఒక disturbed lonerలా చూపించిన తీరు ఆసక్తికరంగా అనిపించింది. ఆర్థర్ ఫ్లెక్ అనే వ్యక్తికి వేళ్ల మీద లెక్కపెట్టలేనన్ని సమస్యలుంటే ఉండచ్చు గాక…కానీ గాథం నగరం థామస్ వేన్ లాంటి బడాబాబుల ఇంట్రస్టుల గురించి కేటాయించే బడ్జెట్లో కొంచెమైనా ఆర్థర్ లాంటి వాళ్ల బాగుకోసం ఖర్చు చేసుంటే అతని సమస్యలు కొన్నైనా ఖచ్చితంగా తగ్గేవని నా బలమైన నమ్మకం. కానీ అతనే కాదు, మనం కూడా అంత సహానుభూతి ఉన్న సమాజంలో బ్రతకడంలేదనేది కూడా కాదనలేని వాస్తవం. ఇప్పటికైనా ఎంపథీ అలవర్చుకోకపోతే భవిష్యత్తులో haves and have-nots మధ్య జరగబోయే యుద్ధంలో సమాజం నిర్లక్ష్యం చేసిన ఎంతమంది ‘జోకర్’గా మారి అగ్నిపర్వతంలా బద్దలై మనవైపు దూసుకొస్తారనేది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. It would probably take that fateful moment for us to finally realize – ‘We get what we fucking deserve.’