నోములు వ్రతాలు అనగానే స్త్రీలు చేసేవి అనే అభిప్రాయం కలుగుతుంది ఎవరికైనా. ఈ మాట కొంత వరకు నిజం. ఎక్కువగా వ్రతాలు చేసేది మహిళలే. వారికి ప్రతి అవసరానికి ఒక వ్రతమో, నోమో సిద్ధంగా ఉంటుంది. వ్రతాలు చాలా వరకు స్కాందపురాణాంతర్గతమైనవిగా కనపడతాయి. సాధారణంగా ఆడవారు చేసే పూజలు, వ్రతాలు నోములు చాలా వరకు అయిదోతనం కోసం అయి ఉంటాయి. కొన్ని మాత్రం పిల్లలు కావాలనో, ఉన్న పిల్లలు బాగుండాలనో, వారి భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండాలనో చేయటం జరుగుతుంది. చిత్రమైన వాస్తవం ఏమంటే స్త్రీలు చేసే వ్రతాల్లో ఏ ఒక్కటీ తమ కోసం చేసుకునేది లేదు.
సాధారణంగా మహిళలకు భక్తి భావం అధికంగా ఉంటుంది. పూజలు, వ్రతాలు చేయడంలో శ్రద్ధ చూపిస్తారు. నిత్యం పూజ కోసం పూలు కోసి మాలగా కట్టి భగవంతునికి సమర్పించడంలో సంతోషాన్ని, సంతృప్తిని పొందుతారు. పూజలు, వ్రతాలు, అభిషేకాలంటూ చుట్టుపక్కల వారితో కలిసి దేవాలయాలకు వెళుతూ ఉంటారు. ఇక శ్రావణ.. కార్తీక వంటి మాసాల్లో అయితే వాళ్లు మరింత తీరిక లేకుండా దేవుని సన్నిదానంలోనే గడుపుతుంటారు.
అయితే గర్భం ధరించినప్పుడు కూడా పూజలు, వ్రతాలు విధివిధానాలు అలాగే ఉంటాయా? ఇప్పుడు తెలుసుకుందాం… గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయ కొట్టకూడదు స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా? లేదా ? అనే సందిగ్ధంలో పడుతుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇవ్వడంతో వాళ్లు మరింత తికమకపడుతుంటారు. ఈ సందేహానికి సమాధానం శాస్త్రంలో కనిపిస్తుంది. గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంభించాలనీ కొబ్బరికాయను మాత్రం కొట్టకూడదని, గుడి చుట్టు ప్రదక్షిణాలు చేయకూడదని చెబుతోంది. కొత్త పూజా విధానాలను ఆరంభించడం గానీ పుణ్యక్షేత్రాల దర్శనం చేయకూడదు.
కొబ్బరి కాయను కొట్టకూడదు, ప్రధక్షిన చేయకూడదు అంటున్నారు మరి తేలిక పాటి పూజ అంటే ఏమిటి అనే సందేహం వస్తుంది. కోటిసార్లు పూజచేయడం కన్నా ఒక స్తోత్రం చదవడం, కోటి స్తోత్రాలు చదవడంకన్నా ఒకసారి జపం చేయడం, కోటిసార్లు జపం చేయడం కన్నా ఒకసారి ధ్యానం చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. అందువల్ల గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని సూచిస్తోంది. గర్భవతులకి పూజల విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి కనిపించదు.
5వ నెల వచ్చే వరకు వ్రతాలు చేయవచ్చని, ఆ తర్వాత చేయకూడదని శాస్త్రం చెబుతోంది. పూజలు, వ్రతాలు పేరుతో వాళ్లు ఎక్కువ సేపు నేలపై కూర్చోవడం మంచిది కాదనే ఈ నియమం చేసినట్టు తెలుస్తోంది. ఇక పుణ్య క్షేత్రాలు చాలా వరకూ కొండలపై వుంటాయి. అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వల్ల ఇబ్బందులుపడే అవకాశం ఎక్కువగా ఉన్నందు వల్లనే ఈ నియమాన్ని విధించినట్టు స్పష్టమవుతోంది.
పూజలు, వ్రతాలతో పాటుగా ఈ సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. గర్భవతి స్త్రీ ఉండే గృహ ప్రభావం ఆమె పైన, ఆమె గర్భస్థ శిశువుపైనా పడుతుందని శాస్త్రం చెబుతోంది. అందువల్ల మూడు నెలలు పైన గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటికి సంబంధించిన మార్పులు, కొత్త నిర్మాణాలు చేయకూడదు. ఇంటికి మార్పులు చేసేటపుడు పూర్తిగా చేయకపోయినా, కొత్త నిర్మాణాలు మధ్యలో ఏదైనా కారణం వల్ల ఆగిపోయినా వీటి వల్ల ఏర్పడే వాస్తు దోషాలు గర్భస్త శిశువుపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఇంటికి మార్పులు, చేర్పులు కాని, కొత్త నిర్మాణం చేపట్టడం గానీ మంచిది కాదు.