శ్రావణమాసం మొదలైంది. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్రమాసం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి. సనాతన ధర్మంలో (హిందూ) చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.
వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి(భార్య) మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధరకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి.
శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి..ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు మాత్రమే కాకుండా జంధ్యాల పౌర్ణమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి ,దామోదర ద్వాదశి ,వరాహ జయంతి ఇలా అనేక పండుగలు ఉన్నాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసం. మాసాలన్నింటిలో శ్రావణమాసం ప్రత్యేకతను … ప్రాధాన్యతను కలిగివుంది. శ్రావణమాసం శుభాన్ని సూచిస్తుందనీ శుభకార్యాలకు ద్వారాలు తెరుస్తూ ఆనందాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలకంగా మన మీద ప్రభావం చూపుతుంది. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించడానికి, మంచి కలిగించడానికి, ధర్మాచరణాలను పండుగగా ఆచరించడం నియమమైంది. మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వల్ల కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుండి తప్పించుకోవడానికి, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది. ఈ మాసంలో వచ్చే సోమవారాలలో శివ భక్తులు దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవి కి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడంగా నమ్ముతారు
శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసంలో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని శ్రావణ మంగళ వారం ఆచరించడం ఆనవాయితీ.
ఈ మాసంలో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవిని షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని శాస్త్రం చెబుతుంది. ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. శ్రావణ పౌర్ణమి , జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రావణ పూర్ణిమ నాడు అన్నదమ్ముల ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను కట్టాలి. ఇలా శ్రావణ మాసం లోని ప్రతి రోజూ శుభప్రదమయినదే.