భిన్నత్వంలో ఏకత్వం అంటారు మనదేశాన్ని. ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో ఆచారాల సమూహం మన దేశం. మన దేశంలో రకరకాల సాంప్రదాయాలు, వింత వింత ఆచారాలు ఇప్పటికి నిర్వహిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఒక వింత జాతర గురించి తెలుసుకుందాం…
ఆ జాతర పేరు బురదమాంబ జాతర. ఈ జాతరను విశాఖ జిల్లాలో చాలా ఘనంగా చేసుకుంటూ ఉంటారు.
మొన్నటికి మొన్న వెదుళ్ళ పండగ గురించి విన్నాం. ఇప్పుడు బురదమాంబ పండుగ. విశాఖపట్నం జిల్లాలోని దిమిలిలో బురదమాంబ సంబరం ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే ఈ జాతర రాష్ట్రంలో ఎక్కడ జరగని రీతిలో చాలా విచిత్రంగా ఉంటుంది.
యలమంచిలి నియోజకవర్గంలోని రాంబిల్లి మండలంలో కొలువుదీరిన ఈ దిమిలి గ్రామ దేవతే దల్లమాంబ. అనుపు మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో బురదమాంబ జాతర జరిపించడం అక్కడ ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. ఈ జాతరలో ఆ గ్రామంలోని పురుషులందరు కలిసి వేపకొమ్మలు చేతితో పట్టుకొని, మురుగుకాలువల్లోని బురదలో ఆ వేపకొమ్మలను ముంచి ఆ బురదను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ కేరింతలు కొడుతూ అందరూ ఎంజాయ్ చేయడమే ఈ ఉత్సవం యొక్క ప్రత్యేకత అని చెప్పాలి.
బురదలో ఆటలు ఆడడం ఏంటి? రోగాలు రావా? అని అనుకుంటున్నారా. రావు అనే అంటున్నారు అక్కడ ప్రజలు. బురద పూసుకున్నా గాని ఎటువంటి చర్మ వ్యాధులు రాకుండా అమ్మవారూ మమ్మల్ని కాపాడతారు. అది అంతా అమ్మవారి మహత్యం అని అక్కడి గ్రామస్తులు నమ్ముతారు.
బురదలో ఆటలు ఆడిన తరువాత ఆ వేప కొమ్మలను అమ్మవారి ఆలయం వద్ద ఉంచి ఘనంగా అమ్మవారి జాతరను నిర్వహిస్తారు. కేవలం మగవారు మాత్రమే ఇలా బురద జల్లుకుంటారు. ఆడవాళ్లు బురద జల్లుకోరు.
ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారి యొక్క విగ్రహం బురదలో లభించడం వల్ల ఆమెను బురదమాంబగా పిలుస్తారు అని అక్కడి గ్రామస్తులు అంటున్నారు. చూసే వాళ్ళకి విచిత్రంగా ఉన్న ఆ ఆచారాన్ని అక్కడ గ్రామస్థులు ఎప్పటినుంచో పాటిస్తున్నారు.!.