Home Health పెర్‌ఫ్యూమ్ ల ప్రభావం మన మీద ఎంత వరకు ఉంటుంది?

పెర్‌ఫ్యూమ్ ల ప్రభావం మన మీద ఎంత వరకు ఉంటుంది?

0
perfumes
చిరాకుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మంచి స్మెల్ చూసి మూడ్ చేంజ్ అయ్యిందా? అగర్బత్తి వాసన చూసినప్పుడు మనసు ప్రశాంతంగా మారిందా? ఈ పరిమళాలు, అత్తర్లు మన జీవితంలో భాగమైపోయాయి. సౌందర్యపోషణ, ఆరోగ్యరక్షణ, మానసికోల్లాసం, రోగచికిత్సలో అత్తర్లు, పరిమాళాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పటి నుండి కాదు పురాతన కాలం నుండి ఈ పరిమళాలను, సుగంధద్రవ్యాలను ఉపయోగిస్తూ వస్తున్నారు.
మన దైనందిన జీవితంలో ఉపయోగించే అనేక వస్తువులు ఏవో పరిమాళాలు వెదజల్లుతూనే ఉంటాయి. తలనూనె, షాంపూలు, పౌడర్లు, సబ్బులు, లోషన్లు, క్రీములు, లేపనాలు, కొవ్వొత్తులు, అగర్‌బత్తీలు, లాండ్రీ ఉత్పత్తులు, రూంఫ్రెష్‌నర్లు, టాయిరెటరీ తదితర ఉత్పత్తుల్లో పరిమళాల వినియోగం తప్పనిసరైపోయింది. అవి సహజ పరిమళాలైయుండవచ్చు లేదా కృతిమంగా తయారుచేసి వుండవచ్చు. ఈ సువాసనలు మన నాసికారంధ్రాలకు సోకగానే ఎంతో ఉపశమనం, ఆనందం. ఈ అనుభూతులను వర్ణించడానికి మాటలు చాలవు.
ఇంతకూ ఈ పరిమళాలెక్కడివి? వాటికి సువాసన ఎలా అబ్బుతుంది? మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వాటినెలా తయారుచేస్తారు? తదితర అనేకానేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…పరిమళాలు వేదకాలం నుండే వాడుకలో ఉన్నట్లు, ‘గంథశాస్త్రం’ చెబుతోంది. పరిమళాల పుట్టిల్లు మన దేశమే. ఈ పరిమళాలు మన దేశం నుండి వస్తుమార్పిడి ద్వారా పశ్చిమతీర దేశాలైన ఈజిప్టు, పెర్సియా, గ్రీస్‌, రోమ్‌లకు విస్తరించాయి. 2800 బిసికి చెందిన ఈజిప్ట్‌ పాపిరస్‌ గ్రంథాల్లో ఈ విషయాలు ప్రస్తావించబడి ఉండటం గమనార్హం.
ఇంట్లో పెరిగే తులసి, నిమ్మ లేదా వంటల్లో వాడే కొత్తిమీర, పుదీన ఆకులను చేతిలో తీసుకొని నలపండి. కమ్మని వాసన వస్తుంది. ఇందుకు కారణం ఆ మొక్కల పత్రాల్లోని ఆవశ్యక నూనెలే. ఆకులను నలిపినప్పుడు పత్రాల్లోని తైలగ్రంథులు చిట్లి ఆవశ్యకనూనెను విడుదల చేస్తాయి. ఈ ఆవశ్యకనూనెలు సాధారణ ఉష్ణోగ్రతలో ఆవిరై సువాసనలనిస్తాయి. గులాబి, మల్లె, సంపెంగ, లిల్లీ తదితర పూలసంగతీ అంతే. ఈ పూలల్లో నించి వెలువడే సువాసనలు ఎంతో ఉపశమనం కలిగిస్తాయి.
మల్లె, గులాబి, సంపెంగ పుష్పాలు, లావెండర్‌, రోజ్‌మేరీ, యాకలిప్టస్‌ పత్రాలు, నిమ్మ, కమలాఫలాలు, సిన్నమాన్‌, కాసియా బెరడులు, సింట్రోనెల్లా, జెరానియం కారిడాలు, చందనం, సెడార్‌ కలప, అల్లం, కాలమస్‌ కొమ్మలు, వట్టివేర్లు ఆవశ్యక నూనెల ఉత్పత్తిలో చైనా ప్రథమ స్థానంలో ఉండగా, బ్రెజిల్‌ రెండవ స్థానంలోనూ, మనదేశం మూడవస్థానంలో ఉంది.
ఆవశ్యక నూనెలను ఉపయోగించి రోగచికిత్స చేయడాన్ని ‘అరోమాథెరసీ’ అంటారు. దీంతో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. అవి నాసికారంధ్రాల ద్వారా మెదడుపై ప్రభావం, ఔషధంగా ఆవశ్యక నూనెల ప్రత్యక్ష ప్రభావం. అరోమాథెరపీలో ఆవశ్యక నూనెలను పీల్చడానికీ, మర్దనకు ఉపయోగిస్తారు. అలాగే సుగంధ ద్రవ్యాలని రెండు రకాలుగా ఉపయోగిస్తాం. మొదటిది శరీరం పై వాడితే , రెండవది పరిసరాలను సుగంధ భరితం చేసేవి. శుభకార్యాలకు లేదా ఏదైన పార్టీకి వెళ్ళినా, అక్కడి ఆవరణం అంతా పెర్‌ఫ్యూమ్ వాసనే ఎక్కువగా వస్తుంటుంది.
కొందరు బాగా ఘాటు వాసన వచ్చే పెర్ఫ్యూమ్ వాడితే ఇంకొకరు తక్కువ గాఢత ఉన్న పెర్ఫ్యూమ్ వాడతారు.  ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా బాగా తక్కువ ధరలో లభ్యమయ్యే సెంట్లు, ఇతర సుగంధ ద్రవ్యాలు మార్కెట్లోకి ఎక్కువగా వస్తున్నాయి. ఈ చవకబారు సుగంధ ద్రవ్యాలతో కొన్ని వ్యాధులు, అలర్జీలు పెరిగాయంటున్నారు అధ్యయనవేత్తలు. మనం వాడే సుగంధ ద్రవ్యాలు కృత్రిమ రసాయనాలను కలిగి ఉండడం వలన చర్మానికి హాని కలుగుతుంది.
కనుక బాదం నూనెలో కొన్ని చుక్కల సుగంధ తైలం ను కలిపి ఆ  మిశ్రమాన్ని చర్మానికి వాడటం వలన మంచి వాసనను వెదజల్లుతుంది. దీని వాడకం వలన ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. కొందరు వ్యక్తులు తమ ప్రైవేట్ పార్ట్ వద్ద కూడా సుగంధ పరిమళాలను వాడుతూ ఉంటారు . వాళ్ళు తమ అండర్ గార్మెంట్స్ వద్ద టాల్కం పౌడర్ రాసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఆ ప్రదేశం లో సుగంధ పరిమళాలను ఉపయోగించడం కంటే ప్రతిరోజూ శుభ్రంగా స్నానం చేయడం, ఎప్పటికప్పుడుశుభ్రంగా ఉండే అండర్ గార్మెంట్స్ వేసుకోవడం ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు.
గదిలో పరిమళాలను వెదజల్లే రూంఫ్రెష్‌నర్స్‌, కొవ్వొత్తులవల్ల ఆస్తమా, అలర్జీ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. వాటి తయారీ సమయంలో సువాసనలు ఎక్కువగా రావడం కోసం తయారీదారులు ఘాటైనా రసాయనాలు కలుపుతుంటారు. అవి విడుదల చేసే పరిమళాలను పీల్చినప్పుడు ఆ ప్రభావం ఊపిరితిత్తుల మీద పడి ఆస్తమా వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా గర్భిణీలు, పసిపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వీటికి దూరంగా ఉండం మంచిది. అందువల్ల సహజ పరిమళాలకు ప్రాధాన్యమివ్వాలి. ఉదయం, సాయంత్రం, ఇంట్లో సాంబ్రాణితో ధూపంవేయడం, కర్పూరం వెలిగించడం, ఫ్లవర్‌వాజుల్లో మంచి సువాసననిచ్చే పువ్వులు ఉంచడం వంటివి చేస్తే హానికారక క్రిములు దూరమై, ఇల్లంతా పరిమళభరితం అవుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. సహజసిద్ధమైన ఉత్పత్తులతో తయారుచేసిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. చెవి వెనక భాగంలో కొద్దిగా రాసుకోవాలి. ఐదు నిమిషాలయ్యాక చర్మం కంది పోవడం, దద్దుర్లు రావడం వంటి సమస్యలు లేకపోతే ఎంచుకోవచ్చు.

Exit mobile version