Home People Chandra Shekhar Azad, the Proud Prince of the Country

Chandra Shekhar Azad, the Proud Prince of the Country

0

స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటీషువారి గుండెల్లో రైల్లు పరిగెత్తించి దేశమాత విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన ఒక గొప్ప వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. ఒక మధ్య తరగతి బ్రాహ్మణా కుటుంబంలో పుట్టిన ఈయన సాయుధ పోరాటం వైపుకి అడుగులు వేయడం వెనుక దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఈయన మరణానికి గల కారణాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లా, బావ్రా  గ్రామంలో పండిట్ సీతారామ్ తివారి, జగరానీ దేవీలకు 1906 జూలై 23వ తేదీన చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. ఇతని పూర్తి పేరు చంద్రశేఖర సీతారామ్ తివారి. ఈయన ప్రాథమిక విద్యను సొంత గ్రామంలోనే పూర్తి చేసి ఆ తరువాత వారణాసిలో సంస్కృత పాఠశాలలో హయ్యర్ సెకండరీ విద్యను అభ్యసించారు. ఈయన గొప్ప ఆంజనేయస్వామి భక్తుడు.

బెనారస్ సత్యాగ్రహోద్యమంపై బ్రిటిష్ ప్రభుత్వం సాగించిన దమనకాండ ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అంతేకాకుండా 1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో తీవ్రంగా కలతచెందిన ఆజాద్, ఆ తరువాత 1921లో మహాత్మాగాంధీ నడిపిన సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నేరానికి గానూ ఈయన తన పదిహేనేళ్ల ప్రాయంలోనే అరెస్టయ్యారు. విచారణ సందర్భంగా కోర్టులో నీ పేరేంటి? అని మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నకు ఆయన పెద్ద శబ్దంతో ఆజాద్ అని అరచి చెప్పారు. దాంతో ఆయనకు మెజిస్ట్రేట్ 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. అయితే ప్రతి కొరడా దెబ్బకు ఆయన భారత్ మాతాకీ జై ,వందేమాతరం అంటూ గొంతెత్తి నినదించారు. ఇక అప్పటినుంచి చంద్రశేఖర్ ఆజాద్‌గా ఆయన పేరు స్థిరపడిపోయింది.

సహాయ నిరాకరణోద్యమం ఆజాద్‌లో దాగి ఉన్న విప్లవవాదిని మేల్కొలిపింది. ఎలాగైనా సరే భారతదేశాన్ని బ్రిటీష్‌వారి కబంధ హస్తాల నుంచి విడిపించాల్సిందేనని ఆయన బలంగా నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను స్థాపించారు. భగత్ సింగ్, సుఖదేవ్, తదితరులకు మార్గనిర్దేశకుడిగా మారారు.

1928వ సంవత్సరంలో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి కన్నుమూసిన పంజాబ్ కేసరీ లాలాలజపతిరాయ్ మృతికి ప్రతికారంగా రాజ్ గురు, భగత్ సింగ్, బ్రిటీష్ పోలీస్ అధికారి సాండర్స్ ను కాల్చి చంపగా, సాండర్స్ వెంట వచ్చిన హెడ్ కానిస్టబులు రాండ్ ను అజాద్ కాల్చి చంపాడు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ ప్రభుత్వాలు ఆజాద్ ను సజీవంగా పట్టుకునే ప్రయత్నం చేశాయి. అతనిని ప్రాణాలతో తీసుకువచ్చినా లేక చంపి తెచ్చినా 30 వేల రూపాయలు బహుమతిగా ప్రకటించారు.

అయితే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు పార్లమెంటు పై దాడి చేయడము, వారిని పోలీసులు పట్టుకోవడము, న్యాయస్థానంలో వారి ఉరి శిక్ష పడడము జరిగి పోయాయి. ఈ సంఘటనతో ఆజాద్ ఎంతో కలత చెందాడు. వారిని విడిపించడానికి ఎంతకైనా తెగించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా 1931 పిబ్రవరి 27 తెల్లవారుజామున జవహర్ లాల్ నెహ్రూని కలిసి విప్లవ వీరులైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లను విడిపించేందుకు సహకరించాలని వేడుకున్నాడు ఆజాద్. కాని నెహ్రూ అజాద్ కు ఏ సమాదానము చెప్పలేదు. దాంతో కలత చెందిన ఆజాద్ అలహాబాద్ వచ్చి ఆల్ఫ్రెడ్ పారుకులో తమ ఇతర విప్లవ మిత్రులత భగత్ సింగ తదితరులను ఎలా విడిపించాలో చర్చలు జరుపుతున్నాడు. ఆ చర్చల్లో పాల్గొన్న వారిలో రహస్య పోలీసులున్నారని అనుమానమొచ్చింది. అప్పటికే బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్‌ను లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పోలీసులకు లొంగకుండా, ఒక్కడే పోరాడుతూ ముగ్గురు పోలీసులను హతమార్చారు. అలసిపోయేదాకా పోరాడిన ఆయన చివరి క్షణంలో తన వద్ద మిగిలిన ఒకే ఒక్క బుల్లెట్‌తో తనను తానే కాల్చుకుని అశువులు బాసారు.

ఇలా భరతమాత కోసం 24 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ వారికీ ఎదురు నిలిచి ఒంటరి పోరాటం చేసి వీర మరణం పొంది చరిత్రలో ఒక గొప్ప వీరుడిగా నిలిచిపోయాడు.

Exit mobile version